PM Modi: ‘కొత్త ఏడాదికి గొప్ప శుభారంభం’.. ఎక్స్‌పోశాట్‌ విజయంపై ప్రధాని మోదీ

ఎక్స్‌పోశాట్‌ విజయంతో కొత్త ఏడాదికి గొప్ప శుభారంభం ఇచ్చిన ఇస్రో శాస్త్రవేత్తలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

Updated : 01 Jan 2024 16:36 IST

దిల్లీ: కొత్త ఏడాదికి (New Year 2024) ఇస్రో (ISRO) శాస్త్రవేత్తలు గొప్ప శుభారంభం ఇచ్చారని ప్రధాని మోదీ (PM Modi) అన్నారు. సోమవారం ఎక్స్‌పోశాట్‌ (XPoSat) ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తల బృందానికి ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘2024కు గొప్ప శుభారంభం ఇచ్చిన మన శాస్త్రవేత్తల బృందానికి ధన్యవాదాలు. ఇది అద్భుతమైన వార్త. ఈ ప్రయోగం అంతరిక్ష రంగంలో భారత్‌ నైపుణ్యానికి నిదర్శనం. ఈ విజయంతో భారత్‌ను ఉన్నత శిఖరాలకు చేర్చిన ఇస్రో శాస్త్రవేత్తలకు నా శుభాకాంక్షలు’’ అని ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు. 

ఎక్స్‌పోశాట్‌ విజయంపై కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతోపాటు పలువురు ప్రముఖులు ఇస్రో శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘అంతరిక్ష రంగంలో భారత్‌ సాధించిన పురోగతికి ఇది నిదర్శనం. కృష్ణబిలాలు, న్యూట్రాన్‌ నక్షత్రాల పరిశోధన కోసం ఎక్స్‌పోశాట్‌తో ఇస్రో శాస్త్రవేత్తలు చారిత్రాత్మక ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. కొత్త ఏడాది తొలి రోజున ఇంతటి విజయాన్ని అందించిన వారికి శుభాకాంక్షలు’’ అని అమిత్‌ షా ట్వీట్‌ చేశారు. 

‘భారత స్పేస్‌ స్టేషన్‌’ కోసం ఇస్రో ముందడుగు.. నింగిలోకి ఫ్యుయల్‌ సెల్‌

‘‘కొత్త సంవత్సరంలో పీఎస్‌ఎల్‌వీ-సీ58/ఎక్స్‌పోశాట్‌ ప్రయోగంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్న ఇస్రో శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు. ఇలాంటి ప్రయోగాలతో ప్రజల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించండి. ఈ మిషన్‌లో ఎక్కువ మంది మహిళా శాస్త్రవేత్తలు భాగస్వామ్యం కావడం గర్వకారణం’’ అని ఖర్గే ట్వీట్‌లో తెలిపారు. 

సోమవారం ఉదయం తిరుపతి జిల్లాలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి పీఎస్‌ఎల్‌వీ-సీ58 (PSLV-C58) వాహకనౌక ‘ఎక్స్‌-రే పొలారిమీటర్‌ ఉపగ్రహం’తో నింగిలోకి దూసుకెళ్లింది. అంతరిక్షంలోని కృష్ణబిలాలను అర్థం చేసుకోవడం ఈ మిషన్ ప్రధాన ఉద్దేశం. ఎక్స్‌రే ఫొటాన్లు, వాటి పోలరైజేషన్‌పై అధ్యయనం ద్వారా కృష్ణబిలాలు, న్యూట్రాన్‌ స్టార్ల దగ్గర రేడియేషన్‌కు సంబంధించిన వివరాలను ఎక్స్‌పోశాట్‌ బహిర్గతం చేస్తుంది. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా (NASA) తర్వాత ఇలాంటి ప్రయోగం చేసిన దేశం భారత్‌ కావడం విశేషం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని