Uttarakhand tunnel: సొరంగం ఆపరేషన్‌ను లైవ్‌లో చూసి.. మోదీ భావోద్వేగం

Uttarakhand tunnel: ఉత్తరాఖండ్‌లో సొరంగంలో చిక్కుకున్న 41 మంది కూలీలు నిన్న రాత్రి సురక్షితంగా బయటపడ్డారు. ఆ దృశ్యాలను ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించిన ప్రధాని మోదీ.. భావోద్వేగానికి గురయ్యారట..!

Published : 29 Nov 2023 16:25 IST

దిల్లీ: ఉత్తరాఖండ్‌ (Uttarakhand)లోని ఉత్తర్‌కాశీ (Uttarkashi Tunnel)లో గల సిల్‌క్యారా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులు.. 17 రోజుల తర్వాత బాహ్య ప్రపంచాన్ని చూశారు. మంగళవారం రాత్రి కూలీలను ఒక్కొక్కరిగా సొరంగంలో నుంచి బయటకు తీసుకొచ్చారు. అదే సమయంలో దిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) నేతృత్వంలో కేంద్ర కేబినెట్ సమావేశం (Cabinet Meet) జరిగింది. ప్రధానితో సహా కేబినెట్‌ మంత్రులంతా ఈ రెస్క్యూ ఆపరేషన్‌ను లైవ్‌ స్ట్రీమింగ్‌లో చూశారు.

సొరంగం నుంచి కార్మికులంతా క్షేమంగా బయటపడగానే ప్రధాని మోదీ చాలా భావోద్వేగానికి గురయ్యారని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ తెలిపారు. మంగళవారం నాటి కేబినెట్‌ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆయన బుధవారం మీడియాకు వెల్లడించారు. సమావేశంలో ఉత్తరాఖండ్‌ సొరంగం ఆపరేషన్‌ కూడా చర్చకు వచ్చినట్లు ఠాకూర్‌ తెలిపారు.

తొలుత భయపడ్డాం.. కానీ, నమ్మకాన్ని వీడలేదు: మోదీతో కార్మికుల సంభాషణ

‘‘ఈ ఆపరేషన్‌ విజయవంతమవడం కోసం ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు తీసుకుంది. కార్మికుల ప్రాణాలు కాపాడటం కోసం ప్రతి ప్రయత్నం చేసింది. ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారంలో ఉన్నప్పటికీ.. సొరంగం ఆపరేషన్‌ను ఎప్పటికప్పుడు సమీక్షించారు. కనీసం రోజుకు రెండు సార్లు దీని గురించి అప్‌డేట్‌ తెలుసుకున్నారు. ఉత్తరాఖండ్‌ సీఎం పుష్కర్‌ సింగ్‌ ధామితో పలుమార్లు ఫోన్‌లో మాట్లాడారు’’ అని ఠాకూర్‌ వెల్లడించారు. సొరంగం నుంచి బయటకు వచ్చిన తర్వాత కార్మికులతో ప్రధాని ఫోన్‌లో మాట్లాడి వారి క్షేమ సమాచారం అడిగి తెలుసుకున్న విషయం తెలిసిందే.

రిషికేశ్‌ ఎయిమ్స్‌కు కార్మికులు..

నిన్న రాత్రి సొరంగం నుంచి కార్మికులంతా బయటకు రాగానే వారికి సిల్‌క్యారాకు సమీపంలోని కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌కు తీసుకెళ్లారు. ఈ మధ్యాహ్నం వరకు వారిని అబ్జర్వేషన్‌లో ఉంచారు. మరిన్ని వైద్య పరీక్షల నిమిత్తం వారిని చినూక్‌ హెలికాప్టర్లలో రిషికేశ్‌లోని ఎయిమ్స్‌కు తరలించారు. కార్మికుల మానసిక పరిస్థితిని కూడా వైద్యులు పరిశీలించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు