Fine: పట్టపగలే.. యువతుల విచ్చలవిడి ప్రవర్తన.. ₹33వేలు ఫైన్‌ వేసిన పోలీసులు

సామాజిక మాధ్యమాల్లో రీల్స్‌ మోజులో పడిన యువతులు వికృత చేష్టలకు పాల్పడిన వీడియోపై పోలీసులు సీరియస్‌ అయ్యారు. వారికి ₹33వేలు జరిమానా విధించారు.

Published : 26 Mar 2024 00:02 IST

నోయిడా: సోషల్‌ మీడియాలో పాపులర్‌ అయ్యేందుకు రీల్స్‌ మోజులో పడి కొందరు యువత ఎంచుకొంటున్న మార్గాలు జుగుప్స కలిగించేలా ఉంటున్నాయి. దిల్లీ మెట్రో రైలులో ఇద్దరు యువతులు హోలీ రంగులు పూసుకొంటూ అసభ్యకరంగా ప్రవర్తించిన వీడియోపై తీవ్ర విమర్శలు రాగా.. తాజాగా అదే తరహాలో మరో వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తోంది. ఉత్తరప్రదేశ్‌లో నోయిడాలోని ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఇద్దరు యువతులు పట్టపగలే రీల్స్‌ మోజులో విచ్చలవిడిగా ప్రవర్తించిన వీడియోపై నెటిజన్లు మండిపడుతున్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ వీడియోలో ఒక యువకుడు స్కూటర్‌ నడుపుతుండగా.. వెనుక ఇద్దరు అమ్మాయిలు ఎదురెదురుగా కూర్చొని ఉన్నారు. వాహనం ముందుకు వెళ్తుండగా ఒకరికొకరు హోలీ రంగులు పూసుకొంటూ అసభ్యకరరీతిలో హావభావాల్లో మునిగిపోయిన దృశ్యాలు రికార్డయ్యాయి. ఈ వీడియోలో ఓ హిందీ సాంగ్‌ బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లే అవడాన్ని గమనించవచ్చు.

ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో నోయిడా పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఆ వీడియోలో ద్విచక్రవాహనంపై ఉన్న ముగ్గురికీ రూ.33వేలు జరిమానా విధించారు. ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను ఈ-చలానా జారీ చేసినట్లు నోయిడా పోలీసులు ‘ఎక్స్‌’ వేదికగా వెల్లడించారు. పోలీసులు చర్యలపై పలువురు నెటిజన్లు కృతజ్ఞతలు చెబుతుండగా.. మరికొందరు మరీ ఎక్కువ ఫైన్‌ వేశారంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియోపై నెటిజన్ల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఈ వీడియోలో కనిపిస్తున్న యువతులపై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని