Pune: బాలుడి డ్రైవింగ్‌తో ఇద్దరి మృతి.. ప్రమాదంపై టీనేజర్‌ను వ్యాసం రాయమన్న కోర్టు

Bail conditions for Pune teen: తన డ్రైవింగ్‌తో ఇద్దరి మృతికి కారణమైన ఓ మైనర్‌కు పుణె కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. అయితే, షరతుల కింద ప్రమాదంపై ఆ బాలుడిని వ్యాసం రాయమని న్యాయస్థానం చెప్పడం గమనార్హం.

Published : 20 May 2024 13:22 IST

పుణె: మైనర్ల చేతికి వాహనాలు (Minor Car Driving) ఇవ్వడం వల్లే జరిగే ప్రమాదాల గురించి తరచూ వింటూనే ఉన్నాం. తెలియనితనం, యుక్త వయసులో వారు చేసే విన్యాసాలు ఎన్నో కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపుతున్నాయి. మహారాష్ట్ర (Maharashtra)లోని పుణెలో అలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఓ బాలుడి నిర్లక్ష్యం ఇద్దరి యువకుల జీవితాలను బలితీసుకుంది. ఈ కేసులో ఆ మైనర్‌కు కోర్టు బెయిల్‌ మంజూరు చేయగా.. ఆ సమయంలో విధించిన షరతులు (Bail Conditions) ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి.

పుణెలో ఆదివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ బైక్‌ను లగ్జరీ కారు ఢీకొనడంతో ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారమందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకోగా.. కారు డ్రైవ్‌ చేసిన నిందితుడు ఓ మైనర్‌ అని తేలింది. దీంతో అతడిని అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపర్చారు. ఈ కేసులో ఆ బాలుడికి జువైనల్‌ కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ఇందుకు కొన్ని షరతులు విధించింది.

బీచ్‌లో సముద్ర స్నానానికి దిగిన తెలుగు యువకులకు వినూత్న శిక్ష

ప్రమాదంపై వ్యాసం రాయాలని, 15 రోజుల పాటు ట్రాఫిక్‌ పోలీసులతో కలిసి పనిచేయాలని ఆదేశించింది. మానసిక నిపుణుడి వద్ద చికిత్స తీసుకోవాలని, భవిష్యత్‌లో ఎవరైనా రోడ్డు ప్రమాదాలకు గురైతే బాధితులకు సాయం చేయాలని సూచించింది. నిందితుడిని మేజర్‌గా పరిగణించి దర్యాప్తు చేసేందుకు అనుమతి ఇవ్వాలని పోలీసులు కోరగా.. న్యాయస్థానం అందుకు తిరస్కరించింది. బెయిల్‌ నిరాకరించడానికి కారణాలు కనిపించడం లేదని కోర్టు ఈ సందర్భంగా పేర్కొన్నట్లు పోలీసు అధికారులు వెల్లడించారు.

ఈ కేసులో నిందితుడు స్థానికంగా ఓ ప్రముఖ బిల్డర్‌ కుమారుడని తెలిసింది. ఇటీవలే 12వ తరగతి పూర్తి చేసిన ఆ బాలుడు.. శనివారం తన స్నేహితులతో కలిసి పోర్షే కారులో పబ్‌కు వెళ్లాడు. అక్కడ మద్యం కూడా సేవించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఆదివారం తెల్లవారుజామున పబ్‌ నుంచి తిరిగి వస్తుండగా వాహనం నియంత్రణ కోల్పోయి ఎదురుగా వెళ్తున్న బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల స్వస్థలం రాజస్థాన్‌ అని పోలీసులు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు