Unacademy: చదువుకున్న వారికే ఓటు వేయాలని చెప్పిన టీచర్‌.. ఉద్యోగం పీకేసిన ఎడ్‌టెక్‌ సంస్థ

చదువుకున్న వారికే ఓటువేయాలని విద్యార్థులకు చెప్పిన ఉపాధ్యాయుడిపై ప్రముఖ ఎడ్‌టెక్‌ సంస్థ అన్‌అకాడమీ వేటు వేసింది. తమ వ్యక్తిగత అభిప్రాయాలను పంచుకోవడానికి తరగతి గది సరైంది కాదని పేర్కొంది.

Updated : 18 Aug 2023 06:56 IST

దిల్లీ: చదువుకున్న వారికే ఓటువేయాలని విద్యార్థులకు చెప్పిన ఓ ఉపాధ్యాయుడిపై వేటు పడింది. బెంగళూరులోని ప్రముఖ ఎడ్‌టెక్‌ సంస్థ అన్‌అకాడమీలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న కరణ్‌ సంగ్వాన్‌ను తొలగిస్తూ ఆ విద్యాసంస్థ నిర్ణయం తీసుకుంది. తమ వ్యక్తిగత అభిప్రాయాలను పంచుకోవడానికి తరగతి గది సరైంది కాదని పేర్కొంది. కరణ్‌ సంగ్వాన్‌ ఒప్పంద ఉల్లంఘనకు పాల్పడ్డాడని అన్‌అకాడమీ సహ వ్యవస్థాపకుడు రోమన్‌సైనీ పేర్కొన్నారు. అందుకే అతడిని తొలగించినట్లు వివరణ ఇచ్చారు. ఈ వివాదంపై ఆగస్టు 19న అన్ని వివరాలు వెల్లడిస్తానని వేటుకు గురైన ఉపాధ్యాయుడు తెలిపారు. ‘‘గత కొన్నిరోజులుగా ఒక వీడియో వైరల్‌గా మారింది. దాంతో నేను వివాదంలో చిక్కుకున్నాను. న్యాయ సంబంధిత పరీక్షల కోసం సన్నద్ధమవుతున్న నా విద్యార్థుల పాటు నేను సైతం పలు పరిణామాలు ఎదుర్కొంటున్నాను’’ అని సంగ్వాన్‌ తెలిపాడు. 

చంద్రుడిని ముందుగా చేరేదెవరు..? చంద్రయాన్‌-3 Vs లూనా25పై ఉత్కంఠ!

అన్‌అకాడమీలో పనిచేస్తున్న సంగ్వాన్‌ పాఠాలు బోధిస్తున్న క్రమంలో వచ్చే ఎన్నికల్లో చదువుకున్న వారికే ఓటు వేయాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. దీంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. దీనిపై అన్‌అకాడమీ సహవ్యవస్థాపకుడు సైనీ ట్వీట్‌(ఎక్స్‌) చేశారు. ‘‘నాణ్యమైన విద్యను అందించడానికి మా సంస్థ కట్టుబడి ఉంది. నిష్పాక్షికమైన విద్యను అందించాలనే ఉద్దేశ్యంతో మా సంస్థలో పనిచేసే ఉపాధ్యాయులకు కఠిన ప్రవర్తనా నియమావళి అమలులో ఉంది. మేము చేసే ప్రతిపనికి విద్యార్థులు కేంద్రంగా ఉంటారు. వ్యక్తిగత అభిప్రాయాలను పంచుకోవడానికి తరగతి గది సరైన వేదిక కాదు. అవి విద్యార్థులను ప్రభావితం చేయగలవు. ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు సంగ్వాన్‌ మాతో విడిపోవాల్సి వచ్చింది’’ అని సైనీ పేర్కొన్నారు. 

ఈ విషయంపై దిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్‌ కేజ్రీవాల్‌ స్పందించారు. చదువుకున్న వారికి ఓటు వేయమని చెప్పడం నేరమా?అన్నారు. ఎవరైనా నిరక్షరాస్యులైతే వారిని నేను వ్యక్తిగతంగా గౌరవిస్తాననీ, కానీ, ప్రజాప్రతినిధులు కచ్చితంగా చదువుకున్నవారై ఉండాలని అన్నారు. శాస్త్రసాంకేతిక రంగాలు ఏలుతున్న కాలంలో చదువుకోని ప్రజాప్రతినిధులు 21వ శతాబ్దపు ఆధునిక భారతదేశాన్ని ఎప్పటికీ నిర్మించలేరని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు