Atiq Ahmed: అతీక్‌ భార్య కోసం డ్రోన్లతో వేట.. ఎవరీ షాయిస్తా పర్వీన్‌..!

అతీక్‌ భార్య షాయిస్తా పర్వీన్‌ కోసం పోలీసు గాలింపు తీవ్రమైంది. ఆమె కోసం ప్రయాగ్‌రాజ్‌లోని కొన్ని ప్రాంతాల్లో ప్రతి ఇంటిని జల్లెడ పడుతున్నారు.  

Updated : 21 Apr 2023 17:30 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఉమేశ్‌పాల్‌ హత్యకేసులో కీలక నిందితురాలిగా భావిస్తున్న అతీక్‌ అహ్మద్‌(Atiq Ahmed) భార్య షాయిస్తా పర్వీన్‌ (Shaista Parveen) కోసం ఉత్తరప్రదేశ్‌(UP) పోలీసులు గాలింపు చర్యలను తీవ్రం చేశారు. ప్రయాగ్‌రాజ్‌ పోలీసులు, ఎస్టీఎఫ్‌ (స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌) సిబ్బంది తనిఖీలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ప్రయాగ్‌రాజ్‌ - కౌసంబీ ప్రాంతంలోని గంగా కచార్‌ వద్ద ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. గ్రామాల మధ్య రాకపోకలపై దృష్టిపెట్టేందుకు పోలీసులు డ్రోన్లను కూడా వినియోగిస్తున్నట్లు సమాచారం. తాజాగా ఆమె కదలికలు భెరెటా ప్రాంతంలో గుర్తించినట్లు పోలీసులకు సమాచారం రావడంతో అప్రమత్తమై ఇంటింటి తనిఖీల చేపట్టారు.

గత 20 రోజుల్లో మూడు సందర్భాల్లో షాయిస్తా మరో ఇద్దరితో కలిసి పోలీసుల నుంచి చివరి నిమిషంలో తప్పించుకొంది. తరచూ తన స్థావరాలను మార్చుకొంటూ తిరుగుతున్న ఆమెను పట్టుకొవడానికి కొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. ఆమె మొబైల్‌ ఫోన్లు వినియోగించడంలేదని.. ఆమెకు మద్దతుగా కొంత మంది పనిచేస్తున్నారని అధికారులు తెలిపారు. మరో వైపు కసారీ మసారీలోని షాయిస్తా పుట్టింటి వారు కూడా గృహాన్ని వదిలేసి వెళ్లిపోయినట్లు అధికారులు చెబుతున్నారు.

పర్వీన్‌.. ప్రయాగ్‌రాజ్‌ సమీపంలోని దాముపుర్‌ అనే గ్రామంలో జన్మించింది. ఆమె తండ్రి ఓ కానిస్టేబుల్‌. ఆమెకు నలుగురు సోదరీమణులు, ఇద్దరు సోదరులు ఉన్నారు. ప్రయాగ్‌రాజ్‌లో ఆమె డిగ్రీ వరకు చదువుకొంది. 1996లో ఆమె అతీక్‌ అహ్మద్‌ను పెళ్లి చేసుకొంది. అప్పటికే స్వతంత్ర అభ్యర్థిగా అతీక్‌ మూడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించాడు. వివాహం తర్వాత ఆమె చాలా కాలం ఇంటికే పరిమితమైంది. ఆమె కుటుంబ సభ్యులు అతీక్‌తో కలిసి పనిచేయడం మొదలుపెట్టారు. ప్రస్తుతం తమ్ముడు జకీ అహ్మద్‌ లఖ్‌నవూకు చెందిన వ్యాపారి మోహిత్‌ జైస్వాల్‌ కిడ్నాప్‌ కేసులో అక్కడి జిల్లా జైల్లో ఉన్నాడు.

2019లో అతీక్‌ను గుజరాత్‌లో సబర్మతి జైలుకు తరలించారు. మరోవైపు ఆమె కుమారులు అలీ అహ్మద్‌, ఉమర్‌ అహ్మద్‌, మరిది అష్రాఫ్‌లు కూడా జైళ్లలోనే ఉన్నారు.  దీంతో పర్వీన్‌ రంగంలోకి దిగి భర్త తరఫున పనులను చక్కబెట్టడం మొదలుపెట్టింది. ఆమె సబర్మతి జైలులో తనను కలుసుకొన్నప్పుడే ఉమేశ్‌పాల్‌ హత్యకు కుట్రపన్నినట్లు అతీక్‌ వాంగ్మూలం ఇచ్చాడు. దీంతోపాటు ఆమె అతీక్‌కు ఫోన్‌, సిమ్‌ను చేరవేసింది. ఆ ఫోన్‌తోనే అతీక్‌ హంతకులతో టచ్‌లో ఉన్నట్లు తేలింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని