అన్సారీ సోదరులకు జైలు శిక్ష.. లోక్‌సభ సభ్యత్వం కోల్పోనున్న మరో ఎంపీ..!

మోదీ ఇంటిపేరుపై వ్యాఖ్యల కేసులో జైలు శిక్ష ఎదుర్కొని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ లోక్‌సభ సభ్యత్వాన్ని కోల్పోయిన విషయం తెలిసిందే. తాజాగా మరో ఎంపీపై కూడా అనర్హత వేటు పడనుంది. ఓ హత్య కేసులో ముక్తార్‌ అన్సారీ (Mukhtar Ansari) సోదరుడు అఫ్జల్‌కి కోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది.

Published : 29 Apr 2023 19:47 IST

లఖ్‌నవూ: ఉత్తరప్రదేశ్‌కు చెందిన వివాదాస్పద రాజకీయ నేతలు ముక్తార్‌ అన్సారీ సోదరులకు జైలు శిక్ష పడింది. కిడ్నాప్‌, హత్య ఘటనల్లో 2007లో గ్యాంగ్‌స్టర్‌ నిరోధక చట్టం కింద అన్సారీ సోదరులపై కేసు నమోదైంది. ఈ కేసుపై విచారణ జరిపిన ఉత్తరప్రదేశ్‌లోని ఎంపీ ఎమ్మెల్యే కోర్టు వీరిని దోషులుగా తేల్చింది. ముక్తార్‌ అన్సారీ  (Mukhtar Ansari)కి 10 ఏళ్లు, ఆయన సోదరుడు అఫ్జల్‌ అన్సారీకి నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో అఫ్జల్‌ (Afzal Ansari) తన లోక్‌సభ సభ్యత్వాన్ని కోల్పోనున్నారు.

1996లో విశ్వహిందూ పరిషత్‌ నాయకుడు నందకిశోర్‌ కిడ్నాప్‌ వ్యవహారం, 2005లో భాజపా ఎమ్మెల్యే కృష్ణానంద్‌ రాయ్‌ హత్య కేసుల్లో ముక్తార్‌ అన్సారీ హస్తం ఉందని ఆరోపణలు రావడంతో 2007లో అతడిపై కేసు నమోదైంది. ఆ తర్వాత ఇదే అభియోగాలపై ముక్తార్‌ అన్న అఫ్జల్‌పైనా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. కొన్నేళ్ల పాటు సాగిన ఈ కేసులో వీరిద్దరి దోషులుగా తేల్చుతూ యూపీ కోర్టు తాజాగా తీర్పునిచ్చింది. ముక్తార్‌ అన్సారీకి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.5లక్షల జరిమానా, అఫ్జల్‌కు నాలుగేళ్ల జైలు శిక్షతో పాటు రూ.లక్ష జరిమానా విధించింది. 

కాగా.. బీఎస్పీ నేత అయిన అఫ్జల్‌ అన్సారీ (Afzal Ansari) ప్రస్తుతం ఘాజీపూర్‌ నుంచి లోక్‌సభ సభ్యుడిగా ఉన్నారు. తాజాగా కోర్టు ఆయనకు నాలుగేళ్ల జైలు శిక్ష విధించడంతో ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఆయనపై అనర్హత వేటు పడనుంది. దీంతో అఫ్జల్‌ తన లోక్‌సభ సభ్యత్వాన్ని కోల్పోనున్నారు. ఇక, ముక్తార్‌ అన్సారీ మరో హత్యలో దోషిగా తేలి ప్రస్తుతం జైల్లో ఉన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని