UP Police: నేరాల నియంత్రణకు పంచాంగం ఫాలో అవ్వండి.. యూపీ పోలీసులకు డీజీపీ ఆదేశాలు

రాష్ట్రంలో నేరాల నియంత్రణకు పోలీసులు పంచాంగాన్ని అనుసరించాలని యూపీ పోలీసులకు డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. ఈ నిర్ణయంపై కొందరు విమర్శలు చేస్తుంటే, మరికొందరు సమర్థిస్తున్నారట. దీని వెనుక బలమైన కారణం ఉందంటున్నారు ఆ రాష్ట్ర పోలీసు అధికారులు. 

Updated : 22 Aug 2023 17:56 IST

లఖ్‌నవూ: పెళ్లిళ్లు, శుభకార్యాలకు మంచి ముహూర్తం కోసం పంచాంగం చూస్తుంటాం. కానీ, సమాజంలో జరిగే నేరాలకు, పంచాంగానికి ఏమైనా సంబంధం ఉంటుందా? అంటే, ఉందనే అంటున్నారు యూపీ పోలీస్‌ బాస్‌. అంతేనా, రాష్ట్రంలోని పోలీసులందరూ ఇకపై నేరాల నియంత్రణకు పంచాంగాన్ని అనుసరించాలని ఆదేశాలు జారీ చేశారు.

‘‘యూపీ 112తోపాటు క్రిమినల్‌ ట్రాకింగ్‌ నెట్‌వర్క్‌ అండ్ సిస్టమ్‌ (CCTNS)లోని రికార్డ్‌లను పరిశీలిస్తే అమావాస్యకు వారం ముందు, వారం తర్వాత నేరాలు ఎక్కువగా జరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. కాబట్టి, అమావాస్య రోజుల్లో పెట్రోలింగ్ పెంచాలి. అలాగే, సెప్టెంబరు 14, అక్టోబరు14న అమావాస్య రాబోతోంది. పోలీసు అధికారులందరూ ఆ తేదీలకు వారం ముందు, తర్వాత అప్రమత్తంగా ఉండాలి. అమావాస్య, పౌర్ణమి ఎప్పుడొస్తాయనేది తెలుసుకునేందుకు పంచాంగాన్ని అనుసరించండి’’ అని ఆదేశాల్లో పేర్కొన్నారు. అయితే, ఈ నిర్ణయంపై కొందరు విమర్శలు చేస్తుంటే, మరికొందరు సమర్థిస్తున్నారట. కానీ, దీని వెనుక బలమైన కారణం ఉందంటున్నారు ఆ రాష్ట్ర పోలీసు అధికారులు. 

ప్రభుత్వ పాఠశాలల్లో చంద్రయాన్‌-3 ల్యాండింగ్‌ ప్రత్యక్ష ప్రసారం!

ఈ సర్య్కులర్‌పై ఓ పోలీసు ఉన్నతాధికారి మాట్లాడుతూ.. ‘‘కొన్ని ముఠాలు అమావాస్య రోజుల్లోనే దోపిడీలు, హత్యలు, ఇళ్లతో దొంగతనాలు వంటి నేరాలకు పాల్పడుతున్నాయి. వీరంతా పౌర్ణమి రోజుల్లో బయటకు రాకుండా, అమావాస్య రోజుల్లో నేరానికి పాల్పడిన తర్వాత దేవతలకు జంతువులను బలిస్తుంటారు. వారి కదలికలను అడ్డుకోవాలంటే అమావాస్యకు వారం ముందు, తర్వాత మరింత అప్రమత్తంగా ఉండాలి’’ అని పేర్కొన్నారు. అయితే, పోలీసులకు పంచాంగం అనుసరించమని ఆదేశించడం ఇదేం తొలిసారి కాదని, రెండు దశాబ్దాల క్రితం కూడా ఇదే తరహాలో అమావాస్య, పౌర్ణమి తేదీలను తెలుసుకుంనేందుకు క్యాలెండర్‌లు పంపిణీ చేశారని సదరు అధికారి వెల్లడించారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని