Chandrayaan-3 : ప్రభుత్వ పాఠశాలల్లో చంద్రయాన్‌-3 ల్యాండింగ్‌ ప్రత్యక్ష ప్రసారం!

జాబిల్లి (Moon) ఉపరితలంపై చంద్రయాన్‌-3 (Chandrayaan-3) ల్యాండింగ్ ప్రక్రియను అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యక్ష ప్రసారం చేయించాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ అధికారులను ఆదేశించారు.

Published : 22 Aug 2023 16:11 IST

లఖ్‌నవూ: చంద్రయాన్‌-3 (Chandrayaan-3) వ్యోమనౌక చంద్రుడి (Moon) ఉపరితలంపై కాలుమోపే అపురూప ఘట్టాన్ని ఉత్తర్‌ప్రదేశ్‌లోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యక్ష ప్రసారం చేయించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ నిర్ణయించారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని విద్యాశాఖ ఆధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. ‘ఆగస్టు 23న సాయంత్రం 5.27 గంటల సమయానికి ‘చంద్రయాన్‌-3’ చంద్రుడిపై దిగే ప్రక్రియను ఇస్రో ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది. వెబ్‌సైట్‌, యూట్యూబ్‌ ఛానల్‌, డీడీ నేషనల్‌ మాధ్యమాల ద్వారా ఆ అరుదైన దృశ్యాలను వీక్షించవచ్చు. ఈ నేపథ్యంలో పాఠశాలలు, విద్యాసంస్థల్లో సాయంత్రం 5.15 గంటల నుంచి 6.15 గంటల వరకు ప్రత్యక్ష ప్రసారానికి కావాల్సిన ఏర్పాట్లు చేయాలని’ అందులో పేర్కొన్నారు. 

లాంచింగ్‌ నుంచి ల్యాండింగ్‌ వరకు.. 60 సెకన్లలో చంద్రయాన్‌-3 ప్రయాణం

రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఈ ఆదేశాలపై అదనపు ప్రాజెక్ట్ డైరెక్టర్‌ మధుసూదన్‌ హుల్గీ మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలను సాయంత్రం ఆ సమయం వరకు తెరిచి ఉంచడం ఇదే మొదటిసారి అని పేర్కొన్నారు. చారిత్రక ఘట్టాన్ని విద్యార్థులకు చూపించి వారికి అంతరిక్ష ప్రయోగాలపై అవగాహన కల్పిస్తామన్నారు. ఈ ప్రయోగం విద్యార్థుల్లో ఉత్సుకతను రేకెత్తించడమే కాకుండా.. అన్వేషణ పట్ల ఇష్టాన్ని ప్రేరేపిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. 

జులై 14న శ్రీహరికోటలోని షార్‌ ప్రయోగ వేదిక నుంచి చంద్రయాన్‌-3 రోదసిలోకి దూసుకెళ్లింది. బుధవారం సాయంత్రం చంద్రయాన్‌-3కి సంబంధించిన విక్రమ్‌ ల్యాండర్‌ జాబిల్లి దక్షిణ ధ్రువంపై సాఫ్ట్‌ ల్యాండింగ్‌ కానుంది. ఆ తరువాత విక్రమ్‌ ల్యాండర్‌లో నుంచి ప్రజ్ఞాన్‌ రోవర్ విడిపోనుంది. రెండు వారాల పాటు ల్యాండర్‌, రోవర్‌ చంద్రుడి ఉపరితలంపై పరిశోధనలు సాగిస్తాయి. ఈ ప్రయోగం విజయవంతమైతే.. అమెరికా, రష్యా, చైనా తర్వాత జాబిల్లిపై కాలుమోపిన నాలుగో దేశంగా భారత్‌ అవతరించనుంది. ఇక, దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలి దేశంగా సరికొత్త చరిత్రను లిఖించనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు