Uttarakhand Tunnel: మిగిలిన 2 మీటర్ల డిగ్గింగ్.. కూలీలను తీసుకొచ్చేందుకు మరికొన్ని గంటలు

Uttarakhand Tunnel: ఉత్తరాఖండ్‌లోని సొరంగంలో చిక్కుకున్న కూలీలు బయటకు తీసుకొచ్చేందుకు మరికొన్ని గంటలు పట్టే అవకాశముంది. సొరంగం వద్ద సహాయక చర్యలు దాదాపు చివరి దశకు చేరుకున్నాయి.

Published : 28 Nov 2023 16:40 IST

ఉత్తర్‌కాశీ: ఉత్తరాఖండ్‌ (Uttarakhand)లోని ఉత్తర్‌కాశీ (Uttarkashi) సిల్‌క్యారా సొరంగం (Silkyara tunnel)లో చిక్కుకున్న 41 మంది కార్మికులను కాపాడేందుకు చేపట్టిన సహాయక చర్యలు శరవేగంగా సాగుతున్నాయి. నేలకు సమాంతరంగా తొలుత చేపట్టిన పనులు ఆగిపోయిన చోట నుంచి 12 మంది ‘ర్యాట్‌ హోల్‌ మైనర్లు’ (బొగ్గు గనుల్లో సన్నని మార్గాలను తవ్వడంలో నిపుణులు) డ్రిల్లింగ్‌ చేపట్టి మిగతా దూరం పూర్తి చేశారు. ఆ తర్వాత కూలీలు ఉన్న ప్రాంతం వరకు గొట్టాన్ని పంపించారు.

కొనసాగుతున్న డిగ్గింగ్‌ పనులు

ర్యాట్‌ హోల్‌ మైనర్లు డ్రిల్లింగ్‌ పూర్తి చేసిన తర్వాత.. సొరంగం లోపల డిగ్గింగ్‌ పనులను మొదలుపెట్టారు. సహాయక చర్యలపై తాజా పరిస్థితులను జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్డీఎంఏ) సభ్యుడు లెఫ్టినెంట్‌ జనరల్‌ (రిటైర్డ్‌) సయ్యద్‌ హస్నేన్‌ మీడియాకు వివరించారు. ఇంకా 2 మీటర్ల డిగ్గింగ్‌ పనులు మిగిలి ఉన్నాయని తెలిపారు. అది పూర్తయిన తర్వాత ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది సొరంగం లోపలికి వెళ్తారని పేర్కొన్నారు. లోపల ఉన్న కూలీలను ఒక్కొక్కరిగా బయటకు తీసుకొస్తారని వెల్లడించారు. ‘‘ఒక్కో కూలీని బయటకు తీసుకొచ్చేందుకు కనీసం 3 నుంచి 5 నిమిషాల సమయం పడుతుంది. అంటే మొత్తం 41 మందిని సొరంగం నుంచి బయటకు తీసుకురావడానికి కనీసం 3-4 గంటలు పడుతుంది’’ అని ఆయన వెల్లడించారు. కూలీల భద్రత కోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. 

నకిలీ ప్రపంచంలో ‘నిజం’ కోసం ఆరాటం.. అత్యధికులు వెతికిన పదం ఇదే

సిద్ధంగా ఉండండి..

తాజా పరిస్థితులపై కూలీల కుటుంబాలకు ఇప్పటికే అధికారులు సమాచారమిచ్చారు. ‘‘వారి దుస్తులు, బ్యాగులతో సిద్ధంగా ఉండండి’’ అని కుటుంబ సభ్యులకు తెలిపారు. దీంతో కూలీల కుటుంబ సభ్యులు సొరంగం వద్దకు చేరుకున్నారు. కూలీలను బయటకు తీసుకొచ్చిన తర్వాత వెంటనే వైద్య చికిత్స అందించనున్నారు. ఇందుకోసం సొరంగం లోపల తాత్కాలిక వైద్య కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దీంతో పాటు సిల్‌క్యారాకు 30 కిలోమీటర్ల దూరంలోని కమ్యూనిటీ హెల్త్‌సెంటర్‌ వద్ద 41 పడకలతో తాత్కాలిక వార్డ్‌ను సిద్ధం చేశారు. కూలీలను తరలించేందుకు సొరంగం వద్ద అంబులెన్స్‌లను ఏర్పాటు చేశారు. అంబులెన్స్‌లు వెళ్లేందుకు వీలుగా రోడ్లను మెరుగుపర్చారు. అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారిని వాయు మార్గంలో తరలించేందుకు చినూక్‌ హెలికాప్టర్లను కూడా సొరంగం వద్ద సిద్ధంగా ఉంచారు.

ఈ కూలీలు గత 16 రోజులుగా సొరంగంలో చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. ఇటీవల సొరంగంలోకి ఎండోస్కోపి తరహాలోని కెమెరాను పంపి వారితో మాట్లాడారు. కూలీలంతా సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు. వారి కోసం గొట్టాల్లో నుంచి ఆహారం, పానీయాలను పంపుతున్నారు. బాధితుల్లో మనోధైర్యాన్ని నింపేందుకు వాకీటాకీలను పంపి వారితో అధికారులు మాట్లాడుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు