Vande Bharat Sleeper: మార్చి నుంచి వందేభారత్‌ స్లీపర్‌.. తొలి రైలు ఈ రూట్‌లోనే!

వందేభారత్‌ స్లీపర్‌ రైలు ఇప్పటివరకు ఉన్న సర్వీస్‌ల కంటే వేగంగా ప్రయాణిస్తుందని రైల్వే వర్గాలు తెలిపాయి.

Updated : 06 Feb 2024 19:50 IST

దిల్లీ: వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ స్లీపర్‌ (Vande Bharat Express Sleeper) రైళ్ల ట్రయల్‌ రన్‌ మార్చి నెల నుంచి చేపట్టనున్నట్లు రైల్వే వర్గాలు తెలిపాయి. ఏప్రిల్‌లో ఈ సర్వీసులు ప్రయాణికులకు అందుబాటులోకి వస్తాయని, తొలి రైలును దిల్లీ-ముంబయిల మధ్య ప్రారంభించనున్నట్లు పేర్కొన్నాయి. రాజధాని ఎక్స్‌ప్రెస్‌ కంటే వేగంగా ప్రయాణించే ఈ రైలులో 16 నుంచి 20 (ఏసీ, నాన్‌-ఏసీ) కోచ్‌లు ఉంటాయి. వీటితో దేశంలోని ప్రధాన నగరాల మధ్య ప్రయాణ సమయం తగ్గుతుందని రైల్వే అధికారులు తెలిపారు. 

‘‘రాత్రి వేళలో ఎక్కువ ప్రయాణదూరం ఉండే రూట్లలో వందేభారత్‌ స్లీపర్‌ రైళ్లను నడపాలని నిర్ణయించాం. వీటిని చెన్నైలోని ఇంటిగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ (ICF)లో డిజైన్‌ చేశారు. ఇప్పటి వరకు భారతీయ రైల్వేలో ఉన్న సర్వీస్‌ల కంటే ఇవి వేగంగా ప్రయాణిస్తాయి. దీంతో ప్రయాణ సమయం రెండు గంటలు ఆదా అవుతుంది. తొలి దశలో పది రూట్లలో వీటిని అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నాం’’ అని భారతీయ రైల్వే ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. 

కొత్త కారిడార్లు.. సరికొత్త బోగీలు

ఇప్పటికే సెమీ హైస్పీడ్‌ వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ఛైర్‌కార్‌ రైళ్లు దేశవ్యాప్తంగా వివిధ నగరాల మధ్య సర్వీసులను అందిస్తున్నాయి. త్వరలో వందే మెట్రో రైలును కూడా తీసుకురానున్నట్లు సమాచారం. రైల్వే ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలు కల్పించడంలో భాగంగా దాదాపు 40 వేల సాధారణ కోచ్‌లను అధునాతన వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ తరహా కోచ్‌లుగా మారుస్తామని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగంలో ప్రకటించారు. దీంతో ప్రయాణికుల భద్రత, సౌకర్యాలు మెరుగుపడతాయని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని