కొత్త కారిడార్లు.. సరికొత్త బోగీలు

దేశంలో రైలు మార్గం ద్వారా జరిగే సరకు రవాణాను వేగవంతం చేయడంతోపాటు ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలు కల్పించబోతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

Updated : 02 Feb 2024 07:22 IST

రవాణాను వేగవంతం చేయనున్న నడవాలు
వందేభారత్‌ స్థాయికి 40 వేల సాధారణ కోచ్‌లు

దిల్లీ: దేశంలో రైలు మార్గం ద్వారా జరిగే సరకు రవాణాను వేగవంతం చేయడంతోపాటు ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలు కల్పించబోతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మూడు ప్రధాన రంగాలకు భారీ ఆర్థిక నడవాలు (ఎకనమిక్‌ కారిడార్లు) తీసుకువస్తామని, దాదాపు 40 వేల సంప్రదాయ రైలుపెట్టెల్ని అధునాతన వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ తరహా కోచ్‌లుగా మారుస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగంలో చెప్పారు. పెరిగిన ట్రాఫిక్‌తో రైలుమార్గాల్లో నెలకొన్న రద్దీని తగ్గించి, ప్రయాణికుల రైళ్ల నిర్వహణను మెరుగుపరచడానికి ఈ ప్రతిపాదన దోహదపడుతుందని పేర్కొన్నారు. దేశ ఆర్థికాభివృద్ధికి భారతీయ రైల్వే ఒక చోదక శక్తిగా నిలుస్తుందన్నారు. ‘‘మూడు నడవాల్లో మొదటిది ‘ఇంధన, ఖనిజాలు, సిమెంట్‌ నడవా’. రెండోది ఓడరేవుల అనుసంధాన నడవా, మూడోది అధిక ట్రాఫిక్‌ రద్దీ నడవా. ‘ప్రధాని గతిశక్తి పథకం’ కింద ప్రాజెక్టులను గుర్తించి బహుళ రవాణా అనుసంధానతకు మార్గం సుగమం చేస్తాం. ఇవి రవాణారంగ సమర్థతను పెంచి, వ్యయాన్ని తగ్గిస్తాయి. సరకు రవాణాకు కేటాయించిన ప్రత్యేక మార్గాలు (డెడికేటెడ్‌ ఫ్రైట్‌ కారిడార్లు)తో కలిసి ఈ మూడు కార్యక్రమాలు మన స్థూల జాతీయోత్పత్తిని పెంచుతాయి’’ అని చెప్పారు. భద్రత, సౌకర్యాలను మెరుగుపరచడానికి రైలుపెట్టెల ప్రమాణాలను పెంచుతామన్నారు.


పట్టణ ప్రాంతాల రూపాంతరీకరణ

దేశంలో పట్టణీకరణ, పట్టణ ప్రాంతాల రూపాంతరీకరణ శరవేగంగా సాగుతున్నాయని నిర్మల చెప్పారు. మెట్రోరైళ్లు, నమోభారత్‌ రైళ్లు దీనికి ఉత్ప్రేరకాలుగా నిలుస్తాయని పేర్కొన్నారు. వీటిని మరింతగా విస్తరించుకుంటూ వెళ్లడం ద్వారా పెద్ద నగరాల్లో రవాణాపరమైన అభివృద్ధికి ఊతం లభిస్తుందని చెప్పారు. దేశంలో మధ్యతరగతి ప్రజలు వేగంగా విస్తరిస్తున్నారని తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని