Vijayakanth: రాజకీయాల్లో ఆశాదీపంగా కనిపించి.. దిగ్గజ నేతలకు సవాలుగా నిలిచి!

దశాబ్దాల పాటు తమిళ రాజకీయాలను శాసిస్తున్న ద్రవిడ పార్టీలకు ప్రత్యామ్నాయంగా నిలిచే ప్రయత్నం చేసిన విజయకాంత్‌ (Captain Vijayakanth).. తమిళ రాజకీయాల్లో ఓ ఆశాదీపంగా కనిపించారు.

Updated : 28 Dec 2023 16:03 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కోలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగిన విజయకాంత్‌ (Captain Vijayakanth) అక్కడి రాజకీయాల్లోనూ కీలక పాత్ర పోషించారు. దశాబ్దాల పాటు తమిళ రాజకీయాలను శాసిస్తున్న ద్రవిడ పార్టీలకు ప్రత్యామ్నాయంగా నిలిచే ప్రయత్నం చేసిన ఆయన.. రాజకీయాల్లో ఓ ఆశాదీపంగా కనిపించారు. ‘దేశీయ ముర్పొక్కు ద్రావిడ కళగం (DMDK)’ పేరుతో పార్టీని స్థాపించి దిగ్గజ నేతలకు (కరుణానిధి, జయలలిత) చుక్కలు చూపించారు! మిత్రపక్షంగా ఉంటూనే అధికార పార్టీపై నిప్పులు చెరిగిన ఆయన.. తనదైన శైలిలో తమిళ పాలిటిక్స్‌లో ముద్ర వేశారు. భారీ అభిమానగణంతో ఓ దశాబ్దం పాటు తమిళ రాజకీయాల్లో ‘కెప్టెన్‌’ తన ప్రాభవాన్ని చాటుకున్నారు.

నటుడు విజయకాంత్‌ ఇకలేరు.. చికిత్స పొందుతూ మృతి

తమిళ రాజకీయాల్లో ఎంజీ రామచంద్రన్‌ (MGR) తర్వాత విజయం సాధించిన రెండో వ్యక్తి విజయకాంత్‌ అనే చెప్పవచ్చు. కరుణానిధి, జయలలిత కూడా సినిమా నేపథ్యం నుంచే వచ్చినప్పటికీ.. అన్నాదురై, ఎంజీఆర్‌ రాజకీయ వారసత్వాన్ని మాత్రమే వాళ్లు అందిపుచ్చుకున్నారు. కానీ, నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న విజయకాంత్‌ మాత్రం.. ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టి సొంతంగా పార్టీని స్థాపించారు.

రాజకీయాల్లో దూకుడు..

సినిమాల్లో కమల్‌హాసన్‌, రజనీకాంత్‌లకు సమకాలీనుడైన విజయకాంత్‌.. రాజకీయాల్లోకి రావాలని నిర్ణయం తీసుకున్న వెంటనే దూకుడుగా వ్యవహరించారు. 2005లో ‘దేశీయ ముర్పొక్కు ద్రావిడ కళగం (DMDK)’ పేరుతో రాజకీయ పార్టీని స్థాపించారు. మరుసటి ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో (2006లో) ఒక్క స్థానంలోనే గెలిచినప్పటికీ.. 8.38 శాతం ఓట్లు సాధించారు. ఆ తర్వాత జరిగిన లోక్‌సభ (2009) ఎన్నికల్లోనూ మెరుగైన పనితీరుతో రాష్ట్రంలో తృతీయ రాజకీయ శక్తిగా ఎదిగి ప్రధాన పార్టీలకు సవాలుగా నిలిచారు.

‘అమ్మ’తో చేతులు కలిపి..

డీఎంకేను ఎలాగైనా గద్దె దించాలన్న లక్ష్యంతో ఉన్న అన్నాడీఎంకే.. 2011 అసెంబ్లీ ఎన్నికల సమయంలో డీఎండీకేతో పొత్తుపెట్టుకుంది. 41 స్థానాల్లో పోటీ చేసిన విజయకాంత్‌ పార్టీ ఏకంగా 29 స్థానాల్లో విజయం సాధించి (7.8 శాతం ఓట్లు) రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. డీఎంకే మూడో స్థానానికే పరిమితమయ్యింది. అలా తమిళ రాజకీయాల్లో డిసైడింగ్‌ ఫ్యాక్టర్‌గా నిలిచారు. జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్న ఆ సమయంలో కూటమిలో అభిప్రాయభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. అసెంబ్లీలో అన్నాడీఎంకే నేతల వైపు వేళ్లు చూపిస్తూ అధికార పార్టీపై విజయకాంత్‌ విమర్శలు గుప్పించడం సంచలనం రేపింది. దీనికి జయలలిత కూడా దీటుగా స్పందించారు. అన్నాడీఎంకేతో పొత్తు లేకుండా ఒక్కసీటు కూడా గెలవలేరని.. ఒంటరిగా పోటీ చేసి తన బలాన్ని నిరూపించుకోవాలని డీఎండీకేకు సవాలు విసిరారు. దీంతో ఆ పార్టీల బంధానికి బ్రేకులు పడటంతోపాటు డీఎండీకే పతనం మొదలయ్యింది.

పార్టీ గుర్తింపు కోల్పోయి..

2014 సార్వత్రిక ఎన్నికల్లో భాజపా నేతృత్వంలోని కూటమిలో డీఎండీకే చేరింది. దీనిలోనే పీఎంకే, ఎండీఎంకే పార్టీలు కూడా ఉన్నాయి. ఆ ఎన్నికల్లో విజయకాంత్‌ పార్టీ ఒక్క సీటు గెలవకపోగా.. ఓటు బ్యాంకు 5శాతానికి పడిపోయింది. ఆ తర్వాత 2016 అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్ష పార్టీలతో కలిసి పీపుల్స్‌ వెల్ఫేర్‌ ఫ్రంట్‌గా ఏర్పడ్డాయి. అందులో విజయకాంత్‌నే కూటమి తరఫున సీఎం అభ్యర్థిగా ప్రకటించారు. కానీ, ఆ ఎన్నికల్లో డీఎండీకే ఒక్క సీటు కూడా గెలవకపోవడమే కాకుండా 2.4శాతం ఓట్లకే పరిమితమైంది. చివరకు రాష్ట్ర పార్టీ గుర్తింపు కూడా కోల్పోయింది.

వెంటాడిన అనారోగ్యం..

2016 ఎన్నికల నాటికే అనారోగ్య కారణాలతో విజయకాంత్‌ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండలేకపోయారు. అప్పటినుంచి కెప్టెన్‌ భార్య ప్రేమలత పార్టీ వ్యవహారాలను చూసుకున్నారు. డీఎండీకే కోశాధికారిగా ఉన్న ఆమె.. ఇటీవలే పార్టీ జనరల్‌ సెక్రటరీగా నియమితులయ్యారు. ఈ క్రమంలో అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతూ చెన్నైలోని ఓ ఆసుపత్రిలో విజయకాంత్‌ తుదిశ్వాస విడిచారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని