Viral video: మోదీ ప్రమాణ స్వీకారోత్సవంలో ‘అనుకోని అతిథి’.. అది పులేనా?.. పోలీసులేమన్నారంటే!

Viral video: రాష్ట్రపతిభవన్‌ వేదికగా జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో అనుకోని అతిథి ప్రత్యక్షమైంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

Updated : 10 Jun 2024 22:10 IST

Viral video | దిల్లీ: దేశ ప్రధానిగా నరేంద్రమోదీ (PM modi) మరోసారి ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతో పాటు 71 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. రాష్ట్రపతి భవన్‌ వేదికగా ఆదివారం జరిగిన దేశ, విదేశాలకు చెందిన రాజకీయ, సినీ ప్రముఖులు హాజరయ్యారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రతా వలయంలో జరిగిన ఈ వేడుకలో అనుకోని అతిథి ప్రత్యక్షమైంది. ప్రమాణస్వీకార కార్యక్రమం జరుగుతుండగా.. ఓ జంతువు స్టేజీ వెనక భాగంలో కనిపించింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ప్రధాని సహా పలువురు కీలకమంత్రులు ప్రమాణస్వీకార కార్యక్రమం పూర్తయ్యాక ఈ ఘటన చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్‌ నుంచి భాజపా తరఫున గెలుపొందిన దుర్గాదాస్‌ ఉయికె ప్రమాణస్వీకారం చేసి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ధన్యవాదాలు తెలియజేస్తున్న సమయంలో ఓ జంతువు అటుగా వెళ్లడం కనిపించింది. ప్రమాణ స్వీకార వేదికకు కాస్త దూరంలోనే సంచరించడం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

బాధ్యతలు స్వీకరించిన మోదీ.. తొలి సంతకం దేనిపైఅంటే..?

సోషల్‌మీడియా వేదికగా దీనికి సంబంధించిన వీడియో ఒకటి చక్కర్లు కొడుతోంది. తొలుత ఫేక్‌ వీడియో లేదా ఏఐ జనరేటెడ్‌ వీడియో అని కొట్టిపారేశారు. తర్వాత ప్రధానమంత్రి కార్యాలయం నిన్న షేర్‌ చేసిన యూట్యూబ్‌ లైవ్‌ ఫీడ్‌ను పరిశీలించినప్పుడు.. ఓ జంతువు సంచరించడం నిజమేనని తేలింది. నడుస్తున్న ఠీవిని బట్టి అది పులి అని కొందరు.. పిల్లి అయ్యుంటుందని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. ఇంకేదైనా పెంపుడు జంతువు కావొచ్చనన్న ఊహాగానాలూ వెలువడ్డాయి. దీనిపై దిల్లీ పోలీసులు స్పందించారు.

అది పులి కాదు..పిల్లి:  దిల్లీ పోలీసుల ప్రకటన 

నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణస్వీకారోత్సవం జరుగుతున్న వేళ స్టేజీ వెనక ఓ జంతువు ప్రత్యక్షమైన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో దిల్లీ పోలీసులు స్పందించారు. వీడియోలో ఉన్నది వన్యప్రాణి అంటూ జరిగిన ప్రచారమంతా అవాస్తవమని తేల్చి చెప్పారు. ఈ వీడియోలో కనిపించినది సాధారణమైన పిల్లి అని స్పష్టం చేశారు. దయచేసి ఇలాంటి రూమర్లను నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు