Chhattisgarh New CM: ఛత్తీస్‌గఢ్‌ నూతన ముఖ్యమంత్రిగా విష్ణుదేవ్‌ సాయ్‌

ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రిగా విష్ణుదేవ్‌ సాయ్‌ను భాజపా ఎంపిక చేసింది. నేడు సమావేశమైన భాజపా ఎమ్మెల్యేలు.. శాసనసభా పక్ష నేతగా ఆయన్ను ఎన్నుకున్నారు.

Updated : 10 Dec 2023 18:30 IST

రాయ్‌పుర్‌: ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రిగా విష్ణుదేవ్‌ సాయ్‌ను (Vishnu Deo Sai) భాజపా ఎంపిక చేసింది. ఆదివారం సమావేశమైన భాజపా ఎమ్మెల్యేలు.. శాసనసభా పక్ష నేతగా సాయ్‌ను ఎన్నుకున్నారు. అనంతరం భాజపా కేంద్ర పరిశీలకులు అర్జున్‌ముండా, శర్వానంద సోనోవల్‌, దుష్యంత్‌ గౌతమ్‌లు సాయ్‌ పేరును ప్రకటించారు. విష్ణుదేవ్‌ గతంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేశారు. ప్రధాని మోదీ తొలి కేబినెట్‌లో కేంద్ర మంత్రిగా సేవలందించారు.

ఎవరీ విష్ణుదేవ్‌సాయ్‌?

  • విష్ణుదేవ్‌సాయ్‌ రాష్ట్ర భాజపాలో సీనియర్‌ నేత. 2020 నుంచి 2022 వరకు భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరించారు. 1999, 2004, 2009, 2014 లోక్‌సభ ఎన్నికల్లో రాయ్‌గఢ్‌ నియోజకవర్గం నుంచి వరుసగా ఎన్నికయ్యారు.
  • ఇటీవల జరిగిన ఎన్నికల్లో జాష్పుర్‌ జిల్లాలోని కుంకురి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
  • ఈయన ఆదివాసీ వర్గానికి చెందిన వారు. రాష్ట్రంలో ఆదివాసీల సంఖ్య దాదాపు 30 శాతానికి పైగా ఉంటుంది. దీంతో భాజపా అధిష్ఠానం ఆయన వైపు మొగ్గు చూపింది.
  • విష్ణు ప్రాతినిథ్యం వహిస్తున్న జాష్పుర్ జిల్లా ఝార్ఖండ్‌, ఒడిశాలతో సరిహద్దులు పంచుకుంటోంది. దీంతో రానున్న ఎన్నికల్లో ఈ మూడు రాష్ట్రాల్లోని ఆదివాసీల మన్ననలు, విశ్వాసాన్ని చూరగొనేందుకు ఈయనను ఎంపిక చేసిందని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు.
  • రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎంగా బాధ్యతలు నిర్వహించిన అజిత్‌ జోగి తొలి ఆదివాసీ సీఎం కాగా సుదీర్ఘకాలం తరువాత మరో ఆదివాసీకి అవకాశం లభించింది.
  • ఓబీసీ లేదా ఆదివాసీ వర్గానికి చెందిన ఎవర్ని సీఎంను నియమించాలన్న అంశంపై భాజపా సుదీర్ఘంగా చర్చించింది. అరుణ్‌సావొ, ఓపీ చౌదరిలు బీసీ వర్గానికి చెందినవారు కాగా , విష్ణుదేవ్‌, రేణుకాసింగ్‌, రాంవిచార్‌ నేతమ్‌... తదితరులు ఆదివాసీ వర్గానికి చెందినవారు. పూర్వ సీఎం రమణ్‌సింగ్‌ పేరును పరిశీలించినా చివరకు విష్ణుసాయ్‌ని ఎంపిక చేశారు.
  • మాజీ సీఎం, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్ర రాజకీయాల్లో భాజపాకు పెద్ద దిక్కుగా ఉన్న రమణ్‌సింగ్‌కు విష్ణుసాయ్‌ అత్యంత సన్నిహితుడు. దీంతో అధిష్ఠానం ఈయన్ని ఎంపిక చేసినట్టు సమాచారం.
  • (అజిత్‌ జోగి తొలి ఆదివాసీ సీఎంగా బాధ్యతలు నిర్వహించినా 2019లో ఆయన కులధ్రువీకరణ పత్రాన్ని ప్రభుత్వ అధికారులు రద్దు చేశారు. దీంతో సాంకేతికంగా చూస్తూ విష్ణుదేవ్‌ సాయ్‌ ఛత్తీస్‌గఢ్‌కు తొలి ఆదివాసీ సీఎంగా భావించవచ్చు.)

-ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు