EC: హామీల అమలు సాధ్యాసాధ్యాలను తెలుసుకునే హక్కు ఓటర్లకు ఉంది..!: సీఈసీ

తమ ఎన్నికల మేనిఫెస్టోలో హామీలు ఇచ్చే హక్కు రాజకీయ పార్టీలకు ఉందని సీఈసీ రాజీవ్‌కుమార్‌ తెలిపారు.

Published : 24 Feb 2024 20:34 IST

చెన్నై: రాజకీయ పార్టీలు ఇచ్చే ఎన్నికల హామీల అమలు విషయంలో సాధ్యాసాధ్యాల గురించి తెలుసుకునే హక్కు ఓటర్లకు ఉందని భారత ప్రధాన ఎన్నికల కమిషర్‌ రాజీవ్‌కుమార్‌ (CEC Rajiv Kumar) పేర్కొన్నారు. అలాగే తమ ఎన్నికల మేనిఫెస్టోలో వాగ్దానాలు చేసే హక్కు పార్టీలకు ఉందని చెప్పారు. చెన్నైలో నిర్వహించిన మీడియా సమావేశంలో సీఈసీ మాట్లాడుతూ.. పార్టీల హామీలపై ఎన్నికల సంఘం ఒక నమూనా పత్రాన్ని సిద్ధం చేసిందని, అయితే.. ఈ మొత్తం వ్యవహారం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉందని తెలిపారు.

‘‘తమిళనాడులో భాజపా, కాంగ్రెస్‌ వంటి జాతీయ పార్టీలు.. డీఎంకే, అన్నాడీఎంకే వంటి రాష్ట్ర పార్టీలను కలిశాం. వాటిలో చాలావరకు స్థానికంగా ఒకే దశలో ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశాయి. ఓటర్లకు పంపిణీ చేసేందుకు అనేక పార్టీలు నిధులు కూడబెడుతున్నట్లు ఆరోపించాయి. ఈనేపథ్యంలో.. నగదు, మద్యం, ఆన్‌లైన్ ద్వారా డబ్బు బదిలీ వంటి ప్రలోభాలను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని కోరాయి’’ అని సీఈసీ వెల్లడించారు. ప్రలోభాలను అడ్డుకునేందుకు సంబంధిత సంస్థలు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు.

కొత్త నేర చట్టాలు.. జులై 1 నుంచి అమల్లోకి

ఆన్‌లైన్‌ లావాదేవీలపై దృష్టిసారించాలని ‘నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌’కు సూచించినట్లు సీఈసీ రాజీవ్‌కుమార్‌ చెప్పారు. ఫేక్‌ న్యూస్‌పై మాట్లాడుతూ.. ‘ఇటీవల లోక్‌సభ ఎన్నికల తేదీలు వెల్లడైనట్లు నకిలీ వార్తలు చక్కర్లు కొట్టాయి. మా దృష్టికి వచ్చిన అరగంటలోపే వాటికి అడ్డుకట్ట పడేలా స్పష్టత ఇచ్చాం’’ అని తెలిపారు. ఇదిలాఉండగా.. తమిళనాడులో పర్యటిస్తోన్న సీఈసీ, ఇతర ఉన్నతాధికారులు.. రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల సన్నద్ధతపై గుర్తింపుపొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో శుక్రవారం సమావేశమైన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని