Jagdeep Dhankhar: అవినీతి అనేది వాటికి ‘పాస్‌వర్డ్‌’ కాదు.. జైలుకెళ్లే మార్గం: జగదీప్‌ ధన్‌ఖడ్‌

అవకాశాలు, ఉద్యోగాలకు అవినీతి పాస్‌వర్డ్‌ కాదని ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ పేర్కొన్నారు. అది అవినీతి పరులు జైలుకు వెళ్లే మార్గమని అన్నారు.

Published : 15 Apr 2024 17:10 IST

నాగ్‌పూర్‌: అధికారగణంలో అవినీతి శక్తులకు అడ్డుకట్ట పడుతోందని ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ (Jagdeep Dhankhar) అన్నారు. అవకాశాలు, ఉద్యోగాలకు ఇక అవినీతి అనేది ఓ పాస్‌వర్డ్‌లా ఉండదన్నారు. నాగ్‌పూర్‌లోని నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ డైరెక్ట్‌ టాక్సెస్‌లో ఐఆర్‌ఎస్‌ (IRS) 76వ బ్యాచ్‌ వీడ్కోలు సభలో ధన్‌ఖడ్‌ పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన ప్రసంగించారు.

‘‘నేడు మీ అందరికీ ఒకటి చెప్పాలనుకుంటున్నా. పరిపాలనను అవినీతి ఎప్పటికీ శాసించలేదు. ఇకపై అవినీతి అనేది అవకాశం, ఉద్యోగం లేదా కాంట్రాక్టుకు ‘పాస్‌వర్డ్‌’ కాదు. అది జైలుకెళ్లే మార్గం. అధికారగణంలో అవినీతి శక్తులకు అడ్డుకట్ట పడుతోంది. నిద్రాణస్థితి నుంచి మేలుకున్న భారత్.. ప్రపంచశక్తిగా ఎదిగే దిశగా వేగంగా దూసుకుపోతోంది. జీ-20 సదస్సుకు ప్రాతినిధ్యం వహించే సమయంలో భారత్‌.. దక్షిణ దేశాల గొంతుకగా మారింది. ప్రస్తుతం మన దేశం ప్రముఖ వేదికగా మారింది. భారత్‌ దూరదృష్టి, నాయకత్వాన్ని చూస్తుంటే గర్వంగా ఉంది’’ అని అన్నారు. 

‘కేజ్రీవాల్‌ను కరడుగట్టిన నేరస్థుడిలా చూస్తున్నారు’ - పంజాబ్‌ సీఎం ఆరోపణ

ఐఆర్‌ఎస్‌ అధికారులకు సాంకేతికత పరిజ్ఞానం అవసరాన్ని ధన్‌ఖడ్‌ నొక్కి చెప్పారు. నేటి సమాజంలో నగదు నిర్వహణ అనేది ముప్పుగా మారిందన్నారు. సాంకేతికత అనేది అనధికారిక నిర్వహణను నిరుత్సాహపరుస్తుందని.. ఇది సమాజాన్ని దెబ్బతీస్తుందన్నారు. కానీ, నేడు అవినీతిని సహించలేనివిధంగా భారత్‌ రూపుదిద్దుకుందన్నారు. వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని తీసుకొచ్చిందని పేర్కొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని