Jairam Ramesh: ‘ఆ మూడు బిల్లులు ప్రమాదకరం..! వాటిని వ్యతిరేకిస్తాం’

వలస పాలన నాటి క్రిమినల్‌ చట్టాల స్థానంలో కేంద్రం ప్రవేశపెట్టిన మూడు కొత్త బిల్లులను వ్యతిరేకిస్తున్నట్లు కాంగ్రెస్‌ తెలిపింది.

Published : 05 Dec 2023 02:10 IST

దిల్లీ: బ్రిటిష్‌ వలస పాలన నాటి క్రిమినల్‌ చట్టాల స్థానంలో భారతీయ న్యాయ సంహిత (BNS), భారతీయ నాగరిక్‌ సురక్షా సంహిత (BNSS), భారతీయ సాక్ష్య (BS) పేర్లతో కేంద్రం ప్రవేశపెట్టిన మూడు కొత్త బిల్లులను వ్యతిరేకిస్తున్నట్లు కాంగ్రెస్‌ తెలిపింది. ఇవి చాలా ప్రమాదకరమని పార్టీ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ పేర్కొన్నారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల నేపథ్యంలో ఉభయ సభల్లో లేవనెత్తాల్సిన అంశాలు, అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ సీనియర్‌ నేతలు సోనియా గాంధీ నివాసంలో సమావేశమై చర్చించారు. అనంతరం జైరాం రమేశ్‌ మీడియాకు వివరాలు వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు, ధరల పెరుగుదల, నిరుద్యోగం, ఆదాయ అసమానతలు, విదేశాంగ విధానం, సరిహద్దుల్లో పరిస్థితులపై ఉభయ సభల్లో స్వల్పకాలిక చర్చకు అనుమతించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించినట్లు చెప్పారు.

ఆత్మపరిశీలన చేసుకుంటాం.. మధ్యప్రదేశ్‌ ఫలితం అంతుపట్టడం లేదు!

ఇటీవలి మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై స్పందిస్తూ.. ‘రాజస్థాన్, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌లలో ఫలితాలు.. మా అంచనాల కంటే చాలా తక్కువగా ఉన్నాయి. కానీ, నిరుత్సాహం చెందం. ప్రజాతీర్పును అంగీకరిస్తాం. ప్రస్తుతం వివరాలను విశ్లేషిస్తున్నాం. మా సంకల్పం తగ్గలేదు. మేం మరింత బలంగా పోరాడతాం’ అని జైరాం రమేశ్‌ తెలిపారు. టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాపై లోక్‌సభ నైతిక విలువల కమిటీ నివేదికను ప్రస్తావిస్తూ.. దీనిపైనా పార్లమెంటులో చర్చ జరగాలన్నారు. ‘ఈ వ్యవహారంలో మా వైఖరి స్పష్టంగా ఉంది. ఇది మొయిత్రాను వేధించేందుకు, లక్ష్యంగా చేసుకునేందుకు పన్నిన రాజకీయ కుట్ర. ఆమెను సభ నుంచి బహిష్కరించేందుకు ప్రభుత్వం తీసుకునే ఏ చర్యనైనా మేం వ్యతిరేకిస్తాం. ఎథిక్స్ కమిటీ నివేదికపై చర్చ జరగాలి. మహువాకు తనపై వచ్చిన ఆరోపణలపై స్పందించే అవకాశాన్ని ఇవ్వాలి’ అని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు