Supreme Court: ఎన్నికలను మేం నియంత్రించలేం: ‘వీవీప్యాట్‌’ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు

Supreme Court: ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈవీఎంలలోని ఓట్లతో వీవీప్యాట్‌ స్లిప్పులను సరిపోల్చాలన్న పిటిషన్లపై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

Updated : 24 Apr 2024 15:51 IST

దిల్లీ: ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల్లో(EVM) నమోదైన ఓట్లతో 100 శాతం వీవీప్యాట్ల (VVPAT) స్లిప్పులను సరిపోల్చి లెక్కించాలన్న పిటిషన్లపై సుప్రీంకోర్టు (Supreme Court) తీర్పును రిజర్వ్‌ చేసింది. ఈసందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల ప్రక్రియను నియంత్రించే అధికారం తమకు లేదని పేర్కొంది. రాజ్యాంగ సంస్థ అయిన ఎన్నికల సంఘం (Election Commission) పనితీరును తాము నిర్దేశించలేమని వెల్లడించింది.

ఎన్నికల కౌంటింగ్‌ సమయంలో ఈవీఎం ఓట్లతో వీవీప్యాట్‌ స్లిప్‌లను క్రాస్‌ వెరిఫై చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు బుధవారం మరోసారి విచారణ జరిపింది. వాస్తవానికి దీనిపై జస్టిస్‌ సంజీవ్‌ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తాలతో కూడిన ధర్మాసనం నేడు తీర్పు వెలువరించాల్సి ఉంది. అయితే, ఈ అంశంలో ఇంకా తమకు సందేహాలు ఉండటంతో ధర్మాసనం స్పష్టత కోరింది. ఈక్రమంలోనే కేంద్ర ఎన్నికల సంఘానికి కొన్ని ప్రశ్నలు సంధించింది.

వారసత్వ ఆస్తుల్నీ వదలరట: పిట్రోడా వ్యాఖ్యలపై మోదీ విమర్శలు

ఈవీఎంలో మైక్రో కంట్రోలర్‌ ఎక్కడ ఉంటుంది. కంట్రోలింగ్‌ యూనిట్‌లోనా లేదా వీవీప్యాట్‌లోనా? అని ప్రశ్నించింది. మైక్రో కంట్రోలర్‌ అనేది ఒకసారి రూపొందించిన ప్రోగ్రామా, కాదా? అన్నది నిర్ధారించాలని సూచించింది. కోర్టు ఆదేశాల మేరకు ఈ మధ్యాహ్నం ఈసీ అధికారులు న్యాయస్థానం ఎదుట హాజరై వివరణ ఇచ్చారు.

ఎన్నికల సంఘం వివరణను పరిశీలించిన ధర్మాసనం తీర్పును రిజర్వ్‌ చేసింది. ఈసందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘మా సందేహాలను ఈసీ నివృత్తి చేసింది. మీ (పిటిషనర్ల) ఆలోచనా ధోరణిని మేం మార్చలేం. కేవలం అనుమానాలను ఆధారం చేసుకుని ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేం. ఎన్నికల సంఘం ఓ రాజ్యాంగ సంస్థ. దాని పనితీరును మేం నిర్దేశించలేం. ఎన్నికల ప్రక్రియను నియంత్రించలేం’’ అని స్పష్టం చేసింది.

ఈ విచారణ సందర్భంగా ఈవీఎమ్‌ సోర్స్ కోడ్‌కు సంబంధించిన అంశాలను పిటిషనర్లు లేవనెత్తారు. పారదర్శకత కోసం దాన్ని బయటపెట్టాలని కోరారు. దీన్ని ధర్మాసనం వ్యతిరేకించింది. ‘‘సోర్స్‌ కోడ్‌ను ఎప్పుడూ బహిర్గతం చేయకూడదు. అలా చేస్తే దాన్ని దుర్వినియోగం చేసే అవకాశముంది’’ అని వ్యాఖ్యానించింది.

ప్రస్తుతం ఓ అసెంబ్లీ స్థానంలో ఐదు ఈవీఎంలలోని ఓట్లను వీవీప్యాట్‌ స్లిప్పులతో వెరిఫై చేస్తున్నారు. అలా కాకుండా మొత్తం స్లిప్పులను సరిపోల్చాలని పిటిషనర్లు డిమాండ్‌ చేస్తున్నారు. అయితే, ఈసీ మాత్రం అది సులభం కాదని చెబుతోంది. ఈవీఎంలను ట్యాంపరింగ్‌ చేసే అవకాశం లేదని కోర్టును వివరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని