WhatsApp Trading fraud: వాట్సప్‌లో ట్రేడింగ్‌ పేరుతో.. వ్యాపారి నుంచి రూ.9 కోట్లు స్వాహా

WhatsApp Trading fraud: వాట్సప్‌ గ్రూప్‌లో ట్రేడింగ్‌ అంటూ భారీ లాభాల ఆశ చూపి ఓ వ్యాపారి నుంచి ఏకంగా రూ.9 కోట్లు కొట్టేశారు సైబర్‌ నేరగాళ్లు.

Published : 01 Jun 2024 20:12 IST

నోయిడా: సైబర్‌ నేరగాళ్లు (Cyber Fraudsters) నానాటికీ కొత్తతరహా మోసాలకు తెర తీస్తున్నారు. ఈ మధ్య వాట్సప్‌ గ్రూపు (WhatsApp group)ల్లో స్టాక్‌ మార్కెట్‌ పెట్టుబడుల పేరుతో జరుగుతున్న మోసాలు కలవరపెడుతున్నాయి. ఇటీవల పుణెకు చెందిన ఇద్దరు సోదరులు అత్యాశకు పోయి రూ.రెండున్నర కోట్లు పోగొట్టుకున్నారు. ఇప్పుడు నోయిడాలో ఓ వ్యాపారి (Noida Businessman) ఏకంగా రూ.9 కోట్లు కోల్పోయి లబోదిబోమంటున్నాడు.

నోయిడాలోని సెక్టార్‌ 40కి చెందిన వ్యాపారి రజత్‌ బోథ్రా మే 1న స్టాక్‌ మార్కెట్‌ ట్రేడింగ్‌ (Stock Market Trading)కు సంబంధించిన ఓ వాట్సప్‌ గ్రూప్‌లో చేరాడు. అందులో కొన్ని రోజులు స్టాక్‌ మార్కెట్‌కు సంబంధించి పెట్టుబడి సలహాలు, సూచనలు ఇచ్చారు. ఆ తర్వాత పెట్టుబడులు పెడితే భారీ లాభాలు వస్తాయంటూ ఆశ చూపారు. తొలుత రజత్‌ చిన్న మొత్తంలో పెట్టుబడులు పెడితే మంచి లాభాలు చూపించి నేరగాళ్లు నమ్మించారు. దీంతో మే 27న ఆ వ్యాపారి కొన్ని షేర్లలో ఏకంగా రూ.9.09 కోట్లు పెట్టాడు. ఆ కాసేపటికే అతడి ట్రేడింగ్‌ అకౌంట్‌ నిలిచిపోయింది.

పెరుగుతున్న వాట్సప్‌ గ్రూపు స్కామ్స్‌.. లాభాలంటూ వెళితే అంతే!

మోసపోయాయని గ్రహించిన ఆ వ్యాపారి వెంటనే సైబర్‌ పోలీసుల (Cyber Police)కు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు బదిలీ అయిన మొత్తంలో రూ.1.62 కోట్లను విత్‌డ్రా చేయడానికి వీల్లేకుండా ఫ్రీజ్‌ చేశారు. వ్యాపారి డబ్బులను నేరగాళ్లు చెన్నై, అస్సాం, భువనేశ్వర్‌, హరియాణా, రాజస్థాన్‌లోని పలు బ్యాంకు ఖాతాలకు బదిలీ చేసినట్లు గుర్తించారు. దీనిపై దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని