WhatsApp group scam: పెరుగుతున్న వాట్సప్‌ గ్రూపు స్కామ్స్‌.. లాభాలంటూ వెళితే అంతే!

WhatsApp group scam: సైబర్‌ నేరాలు పెరిగిపోతున్నాయి. ఇటీవల వాట్సప్‌ గ్రూపుల్లో స్టాక్‌ మార్కెట్‌ పెట్టుబడులు అంటూ మోసాలకు తెగబడుతున్నారు.

Published : 29 May 2024 10:24 IST

WhatsApp group scam | ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆన్‌లైన్‌ మోసాలకు హద్దే లేకుండా పోతోంది. ఒకతరహా మోసాల నుంచి ప్రజలు అప్రమత్తమయ్యేలోపు.. మరో కొత్తతరహా మోసలకు తెరతీస్తున్నారు సైబర్‌ నేరగాళ్లు. ఆన్‌లైన్‌ ఆయుధంగా.. అత్యాశనే పావుగా చేసుకొని.. సామాన్యుల నుంచి డబ్బులు కొట్టేస్తున్నారు. తాజాగా వాట్సప్‌ గ్రూపులు (WhatsApp group) కట్టి స్టాక్‌ మార్కెట్లో లాభాలంటూ ఆశ చూపి మోసాలకు తెరతీస్తున్నారు. తాజాగా పుణెకు చెందిన ఇద్దరు సోదరుల నుంచి ఏకంగా రెండున్నర కోట్ల రూపాయిలు కొట్టేశారు. ఈతరహా మోసాలు ఇటీవలకాలంలో పెరుగుతున్నాయి. ఇంతకీ ఎలా మోసం చేస్తున్నారు? వీటి బారి నుంచి బయటపడడం ఎలా?

మేకను బలివ్వాలంటే దానికి ముందు ఎర వెయ్యాలి. సైబర్‌ నేరగాళ్లదీ అదే పంథా. కాల్‌, వాట్సప్‌, సోషల్‌మీడియా ద్వారా వీరు సంప్రదిస్తారు. నమ్మకంగా మాట్లాడతారు. తర్వాత లాభాలు ఎర వేస్తారు. స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడులంటూ ఆకర్షిస్తారు. ఆ సలహాలు కూడా తామే ఇస్తామని నమ్మబలుకుతారు. అంతా ఓకే అనుకున్నాక.. వారిని ఓ వాట్సప్‌ గ్రూపులో చేరుస్తారు. ఆపై కథ మొదలవుతుంది.

మన సమాచారం సురక్షితమేనా?

స్టాక్‌ మార్కెట్‌కు సంబంధించి పెట్టుబడి సలహాలు, సూచనలతో సైబర్‌ నేరగాళ్లు వాట్సప్‌ గ్రూపుల్లో సూచనలు చేస్తుంటారు. గ్రూపులో సభ్యులు వాటిని పాటిస్తున్నట్లు నటిస్తారు. ఇదంతా చూసినవారికి పెట్టుబడి పెట్టకపోతే తాము తీవ్రంగా నష్టపోతున్నామేమో అన్నట్లుగా భ్రమ కల్పిస్తారు. లాభాలంటూ అరచేతిలో వైకుంఠం చూపిస్తారు. వారిచేత పెట్టుబడులు పెట్టిస్తారు. అందుకోసం ప్రత్యేకంగా రూపొందించిన ట్రేడింగ్‌ అకౌంట్‌ను, సాఫ్ట్‌వేర్‌ను అందిస్తారు. తమ పెట్టుబడులకు రెట్టింపు ప్రతిఫలం అందులో చూపిస్తారు. ఒకవేళ ఎవరైనా తీయడానికి ప్రయత్నిస్తే సెబీ మీ అకౌంట్‌ను లాక్‌ చేసిందని, ఫండ్స్‌ నిలిచిపోయాయని చెబుతారు. అప్పటికి గానీ సైబర్‌ నేరగాళ్ల బారిన పడ్డామన్న విషయం తెలియదు.

సోదరులకు రూ.2.45 కోట్లకు టోకరా

ఇటీవల పుణెకు చెందిన ఇద్దరు సోదరులు సైబర్‌ నేరగాళ్ల బారినపడి రూ.2.45 కోట్లు కోల్పోయారు. ఇందులో ఒకరు రూ.1.68 కోట్లు, మరొకరు రూ.77.50 లక్షలు చొప్పున ఇలాగే పెట్టుబడి పెట్టారు. తమ పెట్టుబడికి ఏకంగా రూ.8 కోట్లు అయ్యిందని సైబర్‌ నేరగాళ్లు నమ్మబలికారు. తీరా సొమ్ములు తీసుకుందామని ప్రయత్నించేటప్పుడు అసలు మోసం బయటపడింది. జెరోదా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్‌ వంటి ప్రముఖుల పేర్లతోనూ వాట్సప్‌ గ్రూపుల్లో, సోషల్‌మీడియాలో ఈతరహా మోసాలకు పాల్పడుతున్నారు.

మోసాలకు చిక్కకుండా..

  • ఇంటర్నెట్‌ వేదికగా పరిచయమయ్యే వారిని తొందరగా విశ్వసించొద్దు. ఎవరితోనూ వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవద్దు.
  • పెట్టుబడులు, లాభాలు అంటూ ఎవరైనా మిమ్మల్ని వాట్సప్‌ గ్రూపుల్లో చేరిస్తే.. గ్రూపు పేరు, అడ్మిన్‌ వివరాలు వంటివి తెలుసుకోవాలి. అనుమానాస్పదంగా ఉంటే బయటకొచ్చేయడమే మంచిది.
  • వాట్సప్‌ గ్రూపులు, సందేశాల్లో లాభాలు, ఆఫర్లు వచ్చేవాటిని గుడ్డిగా నమ్మొద్దు. వాటిల్లో వచ్చే లింకులు క్లిక్‌ చేయొద్దు. ఏపీకే ఫైల్స్‌ను డౌన్‌లోడ్‌ చేయొద్దు.
  • మీ అనుమతి లేకుండా ఎవరూ మిమ్మల్ని వాట్సప్‌ గ్రూపుల్లో చేర్చడానికి వీల్లేకుండా వాట్సప్‌ సెట్టింగ్స్‌ మార్చుకోవడం మంచిది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని