Dheeraj Sahu: తండ్రి దేశానికి ‘దానం’ చేస్తే.. కొడుకు రూ.వందల కోట్ల అక్రమ సంపాదన!

ధీరజ్‌ సాహూ కంపెనీల్లో గుర్తించిన నగదు లెక్కించేందుకు 50 మందికిపైగా సిబ్బంది, 40 కౌంటింగ్‌ మెషిన్లను వినియోగించారు. ఐదు రోజులు లెక్కించగా సుమారు రూ.350 కోట్లకుపైగా నగదు ఉన్నట్లు గుర్తించారు.

Updated : 11 Dec 2023 20:57 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఝార్ఖండ్‌కు చెందిన కాంగ్రెస్ ఎంపీ ధీరజ్‌ సాహూ(Dhiraj Prasad Sahu)కు సంబంధించిన కంపెనీలపై ఆదాయపన్ను అధికారులు (Income Tax) జరిపిన దాడుల్లో రూ.వందల కోట్ల విలువైన కరెన్సీ లభ్యం కావడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. వాటిని లెక్కించేందుకు 50 మందికిపైగా సిబ్బంది, 40 కౌంటింగ్‌ మెషిన్లను వినియోగించడం గమనార్హం. ఐదు రోజులు లెక్కించగా సుమారు రూ.350 కోట్లకుపైగా నగదు ఉన్నట్లు గుర్తించారు. ఈ క్రమంలోనే ధీరజ్‌ సాహూ, ఆయన కుటుంబానికి సంబంధించిన ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. ధీరజ్‌ కుమార్‌ తండ్రి బల్‌దేవ్‌ స్వాతంత్ర్య సమరయోధుడు. 1947లో భారత్‌ స్వాతంత్ర్యం పొందిన సమయంలో .. ఆయన భారత ప్రభుత్వానికి రూ.47 లక్షల నగదు, 47 కిలోల బంగారాన్ని విరాళంగా ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఇలా తండ్రి దేశానికి దానం ఇస్తే.. కుమారుడు మాత్రం అక్రమ సంపాదనలో ఆరితేరిపోయాడనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

కాంగ్రెస్‌తో ఎనలేని అనుబంధం..

  • ధీరజ్‌ ప్రసాద్‌ సాహూకు ఐదుగురు సోదరులు. వీరిలో సాహు సహా నలుగురు రాజకీయాల్లో ఉన్నారు. ఒక సోదరుడు శివ్‌ ప్రసాద్‌ సాహూ లోక్‌సభ ఎంపీగా పనిచేశారు. కాంగ్రెస్‌ తరఫున రాంచీ స్థానం నుంచి రెండుసార్లు ఎన్నికయ్యారు.2001లో ఆయన మృతి చెందారు. మరో సోదరుడు నంద్‌లాల్‌ సాహూ కూడా లేరు. ధీరజ్‌ మరో సోదరుడు గోపాల్‌ సాహూ కాంగ్రెస్‌లో చురుకుగా ఉన్నారు. 2019 ఎన్నికల్లో హజారీబాగ్‌ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. మరో సోదరుడు ఉదయ్‌ సాహూ కూడా ఆ పార్టీలోనే కొనసాగుతున్నారు.
  • ధీరజ్‌ సాహూ ఝార్ఖండ్‌లోని చతరా నుంచి రెండుసార్లు పోటీ చేసి.. ఓటమిపాలయ్యాడు. 2009లో రాజ్యసభ ఉప ఎన్నికలో ఎంపికైన అతడు.. జులై 2010లో మరోసారి ఎన్నికయ్యాడు. 2018లో మూడోసారి రాజ్యసభ సభ్యుడిగా అడుగుపెట్టాడు.
  • ధీరజ్‌ సోదరుడు శివ్‌ ప్రసాద్‌ సాహూ ఇందిరా గాంధీతో సత్సంబంధాలు ఉండేవి. దీంతో ఆయన కుటుంబానికి పార్లమెంటు, అసెంబ్లీతోపాటు మంత్రి పదవుల్లోనూ ఆధిపత్యం కొనసాగింది.
  • సాహూ కుటుంబం కాంగ్రెస్‌ పార్టీకి రాజకీయంగా, ఆర్థికంగానూ ఎంతో మద్దతుగా నిలిచేదని చెబుతుంటారు. ముఖ్యంగా ఝార్ఖండ్‌లోని లోహర్‌దాగాతోపాటు సమీప జిల్లాల్లో వీరికి మంచి పట్టు ఉంది. కాంగ్రెస్‌ పార్టీ వ్యవహారాల్లో ఈ కుటుంబం చురుకుగా వ్యవహరిస్తుంటుంది. వీళ్ల పూర్వీకుల ఇంటిని ‘వైట్‌ హౌస్‌ ఆఫ్‌ లోహర్‌దాగా’గా పిలిచేవారు. ఇక్కడికి రాజకీయ నేతలే కాకుండా సినీనటులు, క్రికెటర్లు కూడా వచ్చేవారట.
  • సాహు కుటుంబానిది ‘మద్యం’ ప్రధాన వ్యాపారం. వీరికి సంబంధించి ఒడిశాలో ఎన్నో డిస్టిలరీలు ఉన్నాయి.

ధీరజ్‌ ఆస్తులు..

  • 2018లో ఎన్నికల సంఘానికి అందించిన అఫిడవిట్‌లో రూ.34 కోట్ల ఆస్తులు ఉన్నట్లు ధీరజ్‌ సాహూ పేర్కొన్నారు. వీటిలో రూ.20 కోట్లు చరాస్తులు కాగా, మరో రూ.14 కోట్ల విలువైన వ్యవసాయ భూమి, ఇతర స్థిరాస్తులున్నట్లు చెప్పారు. నాలుగు కార్లు కూడా ఉన్నాయని అందులో పేర్కొన్నారు.
  • ధీరజ్‌ సాహూ ఏడాది సంపద రూ.కోటిగా అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఆయన భార్యకు రూ.3.1కిలోల బంగారం ఉందని, ఆయనకూ రూ.26 లక్షల విలువైన బంగారు ఆభరణాలు ఉన్నాయని చెప్పారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని