PM Modi: రాజకీయాల్లో ‘నూబ్‌’ ఎవరో..? మోదీ సెటైర్‌

PM Modi: రాజకీయాల్లో ‘నూబ్‌’ ఎవరని ప్రధాని మోదీ అన్నారు. తాను ఆ  పదాన్ని ఉపయోగిస్తే.. మీరంతా ఓ వ్యక్తిని ఊహించుకుంటారంటూ విపక్షాలపై వంగ్యాస్త్రాలు గుప్పించారు.

Updated : 13 Apr 2024 15:44 IST

దిల్లీ: ఆన్‌లైన్‌ వీడియో గేమ్స్‌తో పాపులారిటీ సంపాదించిన కొంతమంది గేమర్ల (gamers)తో ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) ఇటీవల ముచ్చటించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వీడియోను ప్రధాని తాజాగా పంచుకున్నారు. ఇందులో ప్రతిపక్షాలను విమర్శిస్తూ మోదీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. ఆన్‌లైన్‌ గేమ్‌ పరిభాషలోని ‘నూబ్‌ (Noob)’తో విపక్షాలను పోలుస్తూ ప్రధాని సెటైర్లు వేశారు.

వివిధ రాష్ట్రాలకు చెందిన గేమర్లు తీర్థ్‌ మెహతా, పాయల్‌ ధరె, అనిమేశ్‌ అగర్వాల్‌, అన్షు బిష్త్‌, నమన్‌ మథుర్‌, మిథిలేశ్‌ పటాంకర్‌, గణేశ్ గంగాధర్‌ ఇటీవల ప్రధాని నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా గేమర్లతో కలిసి మోదీ కొంతసేపు ఆన్‌లైన్‌ గేమ్‌ ఆడారు. ఆ సమయంలో ‘నూబ్‌’ అని వినిపించగానే ప్రధాని నవ్వుతూ.. ‘‘ఈ పదాన్ని నేను ఎన్నికల్లో ఉపయోగిస్తే ఎవర్ని అంటున్నానా? అని ప్రజలు ఆశ్చర్యపోతారు. ఒకవేళ ఆ పదం నేను చెబితే మీరు వెంటనే ఓ వ్యక్తిని ఊహించుకుంటారు’’ అంటూ పరోక్ష విమర్శలు చేశారు.

సీఎం స్టాలిన్‌ కోసం రాహుల్‌ ‘స్వీట్‌’ గిఫ్ట్‌.. స్వయంగా దుకాణానికి వెళ్లి..

ఆన్‌లైన్‌ గేమర్ల భాషలో ‘నూబ్‌’ అంటే ఆటకు కొత్తగా వచ్చిన లేదా ఆ రంగంలో నైపుణ్యం లేని వ్యక్తి అని అర్థం. మోదీ తన వ్యాఖ్యల్లో ఏ నాయకుడి పేరును ప్రస్తావించనప్పటికీ కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi)ని ఉద్దేశిస్తూనే ఈ విమర్శలు చేశారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై కాంగ్రెస్‌ స్పందించడం గమనార్హం.

మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ నేత ప్రమోద్‌ తివారీ మాట్లాడుతూ.. ‘‘ఎన్నికల నేపథ్యంలో భాజపా పాటిస్తున్న రాజకీయ వ్యూహాలివి. వారికి తప్పకుండా ఎదురుదెబ్బ తగులుతుంది’ అని అన్నారు. హస్తం నేతల వ్యాఖ్యలకు భాజపా దీటుగా బదులిచ్చింది. ‘‘ప్రధాని ఎవరి పేరూ ప్రస్తావించలేదు. మరి కాంగ్రెస్‌ నేతలు ఎందుకు స్పందిస్తున్నారు? రాజకీయాల్లో నూబ్‌ ఎవరనేది వారే ధ్రువీకరిస్తున్నారు’’ అంటూ భాజపా నేత షెహజాద్‌ పూనావాలా ఎద్దేవా చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు