Rakesh Tikait: రైతుల్ని దిల్లీ వెళ్లకుండా ఆపితే.. నేతల్ని గ్రామాల్లోకి రానివ్వం: టికైత్‌ హెచ్చరిక

రైతులు దిల్లీ  వెళ్లకుండా ఆడ్డుపడితే.. ఎన్నికల సమయంలో రాజకీయ నాయకుల్ని కూడా గ్రామాల్లోకి రానివ్వబోమని రైతు నేత రాకేశ్‌ టికైత్‌ హెచ్చరించారు.

Published : 22 Feb 2024 01:39 IST

మేరఠ్‌: పంటలకు కనీస మద్దతు ధర సహా పలు డిమాండ్ల సాధనకు అన్నదాతలు మరోసారి తమ ఉద్యమాన్ని ఉద్ధృతం చేశారు. కేంద్ర ప్రభుత్వంతో పలుమార్లు జరిగిన చర్చలు విఫలం కావడంతో దిల్లీ చలోకి బయల్దేరిన రైతుల్ని పోలీసులు అడ్డుకోవడంపై భారతీయ కిసాన్‌ యూనియన్‌ జాతీయ అధికార ప్రతినిధి రాకేశ్‌ టికైత్‌ తీవ్రంగా స్పందించారు. రైతుల్ని దిల్లీ  వెళ్లనీయకుండా ప్రభుత్వం అడ్డుకుంటే.. ఎన్నికల సమయంలో రాజకీయ నేతల్ని కూడా తమ గ్రామాల్లోకి రాకుండా చేస్తామని హెచ్చరించారు.  పంటలకు కనీస మద్దతు ధర, స్వామినాథన్‌ కమిటీ సిఫార్సుల అమలు, గతంలో రైతులు చేపట్టిన ఆందోళనల్లో మృతి చెందిన కర్షకుల కుటుంబాలకు సాయం అందించడం సహా పలు డిమాండ్లను ఆమోదించాలని కోరుతూ రైతు సంఘాలు దిల్లీ చలోకి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఇందులోభాగంగా మీరఠ్‌లోని రైతులు బుధవారం కలెక్టరేట్‌ వద్దకు చేరుకొని ట్రాక్టర్లతో ర్యాలీ చేపట్టారు. దీంతో పోలీసులు వారు ముందుకురాకుండా రోడ్లపై బారికేడ్లు ఏర్పాటుచేయగా.. రైతులు వాటిని తొలగించి ముందుకుసాగారు.

‘మేం బాధ్యతగానే ఉన్నాం’: కేంద్రం అడ్వైజరీపై పంజాబ్‌ ప్రభుత్వం లేఖ

‘‘రోడ్డుపై ఇనుప కంచెలు వేయడం సబబు కాదు.. మా దారికి వాళ్లు అడ్డొస్తే మేం కూడా గ్రామాల్లోకి వచ్చినప్పుడు ఇలాగే చేస్తాం. మమ్మల్ని దిల్లీ వెళ్లకుండా అడ్డుకుంటే.. మా గ్రామాల్లోకి రాజకీయ నాయకుల్ని కూడా ప్రవేశించనివ్వకుండా అడ్డుకుంటాం. భాజపా సారథ్యంలోని కేంద్రప్రభుత్వం పారిశ్రామికవేత్తల కోసమే పనిచేస్తోంది. ఇది రైతుల ప్రభుత్వమైతే.. కనీస మద్దతు ధరల హామీ చట్టాన్ని ఇప్పటికే అమలుచేసేది’’ అని రాకేశ్ టికైత్‌ అన్నారు. మరోవైపు, రైతుల పోరాటానికి సంబంధించిన భవిష్యత్తు కార్యాచరణపై గురువారం సంయుక్త కిసాన్‌ మోర్చా (SKM) సమావేశం జరగనుందని టికైత్‌ చెప్పారు. మరోవైపు, రైతుల డిమాండ్లపై మరోసారి చర్చించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని కేంద్రమంత్రి అర్జున్‌ముండా వెల్లడించారు. చర్చలకు రైతు సంఘం నాయకులను మరోసారి ఆహ్వానిస్తున్నామని.. శాంతియుత వాతావరణాన్ని కొనసాగించడమే ఇప్పుడు అవసరమని ఆయన ట్వీట్‌ చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని