Farmers protest: ‘మేం బాధ్యతగానే ఉన్నాం’: కేంద్రం అడ్వైజరీపై పంజాబ్‌ ప్రభుత్వం లేఖ

Farmers protest: తమ డిమాండ్ల పరిష్కారం కోసం రైతులు ఆందోళన జరుపుతున్న వేళ.. కేంద్రం, పంజాబ్‌ ప్రభుత్వాల మధ్య మాటల యుద్ధం జరిగింది. 

Published : 21 Feb 2024 18:44 IST

చండీగఢ్‌: రైతుల నిరసన వేళ(Farmers protest).. కేంద్ర హోంశాఖ జారీ చేసిన అడ్వైజరీపై పంజాబ్‌(Punjab) ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. సరిహద్దు ప్రాంతాల్లో నిరసనకారులు గుమిగూడేందుకు అనుమతిస్తున్నామనడం ఏమాత్రం సరికాదని వ్యాఖ్యానించింది. హరియాణా పోలీసులు ప్రయోగించిన టియర్ గ్యాస్ షెల్స్‌, రబ్బర్ బుల్లెట్లు, డ్రోన్ల వల్ల 160 మంది రైతులు గాయపడినప్పటికీ.. పంజాబ్ ప్రభుత్వం బాధ్యతాయుతంగా శాంతిభద్రతలను పరిరక్షిస్తోందని పేర్కొంది.

రైతులపై సానుభూతితో వ్యవహరించాలని కేంద్రాన్ని కోరింది. పంజాబ్(Punjab) సరిహద్దు రాష్ట్రం కావడంతో శాంతిభద్రతల విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పింది. అలాగే కేంద్రం, రైతుల మధ్య జరిగిన చర్చలో తమ ప్రభుత్వం కీలకపాత్ర పోషించిందని గుర్తు చేసింది. రెండు వర్గాల మధ్య నాలుగుసార్లు విడతల వారీగా చర్చలు జరగ్గా.. మూడుసార్లు ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ పాల్గొనడాన్ని ప్రస్తావిస్తూ ఈవిధంగా వ్యాఖ్యానించింది.

పంజాబ్‌-హరియాణా సరిహద్దు వద్ద 14వేల మంది రైతులు, 1200 ట్రాక్టర్లు.. ‘దిల్లీ చలో’ మార్చ్‌లో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నాయంటూ కొన్ని కథనాలు వెలువడిన సంగతి తెలిసిందే. దాంతో శాంతిభద్రతలపై ఆందోళన వ్యక్తంచేస్తూ.. కేంద్ర హోంశాఖ పంజాబ్ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈక్రమంలోనే ఆ రాష్ట్రం ఇలా స్పందించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని