CM-change: రెండున్నరేళ్లకు ‘సీఎం’ను మారుస్తారా..? సిద్ధరామయ్య ఏమన్నారంటే..!

కర్ణాటక ముఖ్యమంత్రిగా ఐదేళ్లపాటు తానే కొనసాగుతానని సిద్ధరామయ్య స్పష్టం చేశారు.

Published : 03 Nov 2023 02:02 IST

బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి (Karnataka CM) మార్పు అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఇందుకు సంబంధించి అధికార పార్టీలో ఓ వర్గంలో ఊహాగానాలు వెలువడటం చర్చనీయాంశమయ్యింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) స్పందించారు. అధికార మార్పు ప్రసక్తే లేదని.. ఐదేళ్లపాటు తానే ఈ పదవిలో కొనసాగుతానని తేల్చిచెప్పారు. కర్ణాటకలోని (Kannada Politics) హొస్పేట్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం.. అధికార మార్పిడిపై వస్తోన్న ఊహాగానాలపై విలేకరులు అడిగిన ప్రశ్నకు ఈ విధంగా స్పందించారు.

‘ఐదేళ్లపాటు మా ప్రభుత్వమే అధికారంలో ఉంటుంది. నేను ముఖ్యమంత్రిగా కొనసాగుతా. భాజపా భ్రమలో ఉంది. అధికారం లేకుండా వాళ్లు ఉండలేరు. ఓసారి ఆపరేషన్‌ కమలం విజయం సాధించడంతో మరోసారి అలాగే చేయొచ్చని ప్రయత్నిస్తున్నారు. కానీ, ఈసారి అలా చేయలేరు’ అని సిద్ధరామయ్య స్పష్టం చేశారు. ఇక మరో ముగ్గురిని ఉప ముఖ్యమంత్రులుగా నియమించే అంశంపై స్పందించిన ఆయన.. ‘మీకు ఎవరు చెప్పారు..? అవన్నీ అధిష్ఠానం నిర్ణయిస్తుంది. కాంగ్రెస్‌ ప్రాంతీయ పార్టీ కాదు, జాతీయ పార్టీ. అధిష్ఠానంతో చర్చించకుండా ఏ నిర్ణయం జరగదు. నేను లేదా ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని మార్చలేరు’ అని అన్నారు.

కాంగ్రెస్‌, అభివృద్ధి.. ఒకేదగ్గర మనుగడ సాగించలేవ్‌ : మోదీ

ఇదిలాఉంటే, కర్ణాటకలో ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భాజపాను అధికారానికి దూరం చేసిన కాంగ్రెస్‌ పార్టీ.. పూర్తి మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే, ముఖ్యమంత్రి పదవి చేపట్టే విషయంపై సీనియర్‌ నేతలు సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌ల మధ్య పోటీ నెలకొన్న విషయం తెలిసిందే. చివరకు అధిష్ఠానం నిర్ణయంతో మే 20న సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా, డీకేఎస్‌ ఉపముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ క్రమంలోనే వారిద్దరి మధ్య రాజీ కుదిరిందని.. రెండున్నరేళ్ల తర్వాత వీరిద్దరి మధ్య అధికార మార్పిడి ఉంటుందనే వార్తలు వినిపించాయి. వీటిని పార్టీ ఖండించింది. తాజాగా ఇదే అంశం కన్నడ రాజకీయాల్లో మరోసారి చర్చకు వచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు