Kangana Ranaut: ఎంపీగా గెలిస్తే.. బాలీవుడ్‌ను వీడుతారా? కంగనా ఏం చెప్పారంటే..

భాజపా తరఫున ఎన్నికల బరిలోకి దిగిన ప్రముఖ నటి కంగనా రనౌత్‌.. ఎంపీగా గెలిస్తే బాలీవుడ్‌ను వీడుతారా అనే ప్రశ్నకు బదులిచ్చారు.

Published : 19 May 2024 14:40 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ (Kangana Ranaut).. ఈ సార్వత్రిక ఎన్నికల్లో హిమాచల్‌ ప్రదేశ్‌లోని మండి లోక్‌సభ స్థానం నుంచి భాజపా అభ్యర్థిగా పోటీలో ఉన్న సంగతి తెలిసిందే. ఎన్నికల్లో విజయం సాధిస్తే సినిమాలకు దూరంగా ఉంటారా? అనే ప్రశ్నకు ఆమె అవుననే సమాధానమిచ్చారు. ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు.

‘‘బాలీవుడ్‌లో నేను విజయం సాధించా. నటిగా ఎన్నో అవార్డులు గెలుచుకున్నా. మండి ఎంపీగా గెలుపొందితే బాలీవుడ్‌కు వీడ్కోలు పలకాలనుకుంటున్నా. ఒక ఉత్తమ ఎంపీగా ప్రజలకు నావంతు కృషి చేస్తా. అదే నాకు గొప్ప అవార్డుగా భావిస్తా’’ అని కంగనా బదులిచ్చారు. ఇదే సమయంలో సినీ ఇండస్ట్రీలో కొనసాగాలని కోరుతూ నిర్మాతల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయన్నారు. ‘మీరొక ప్రతిభావంతమైన నటి. సినిమాలకు దూరంగా ఉండొద్దు’ అని చాలా మంది నిర్మాతలు, ప్రముఖ నటులు కోరుతున్నట్లు చెప్పారు.

ఆప్‌ అంతానికి భాజపా ‘ఆపరేషన్‌ ఝాడు’: కేజ్రీవాల్‌

అంతకుముందు మరో వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కంగనా భిన్నంగా స్పందించారు. ‘‘ఎన్నికల ముందు నేను సంతకం చేసిన కొన్ని సినిమాలు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ కారణంతో వెంటనే బాలీవుడ్‌ను విడిచిపెట్టలేను’’ అని పేర్కొన్నారు. ఇక కంగనా నటించిన తాజా చిత్రం ‘ఎమర్జెన్సీ’ (Emergency) వాయిదా పడిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం ఆమె బిజీగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చిత్రబృందం ఇటీవల ప్రకటించింది. ఈ సినిమా కంగనా స్వీయ దర్శకత్వంలో రూపొందుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని