Special Status: ఏపీకి ప్రత్యేక హోదా.. ఆ హామీని ప్రధాని నెరవేరుస్తారా? : కాంగ్రెస్‌

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని గతంలో ప్రధానమంత్రి ఇచ్చిన హామీని ఇప్పుడు నెరవేరుస్తారా? అని కాంగ్రెస్‌ ప్రశ్నించింది.

Updated : 06 Jun 2024 18:52 IST

దిల్లీ: ఆంధ్ర ప్రదేశ్‌, బిహార్‌లకు ప్రత్యేక హోదా ఇస్తామని గతంలో ఇచ్చిన హామీని ప్రధానమంత్రి నెరవేరుస్తారా? అని కాంగ్రెస్‌ ప్రశ్నించింది. మరోవైపు మోదీ 3.o ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తున్నామని పదే పదే ప్రచారం జరుగుతోందని, కానీ, ఈసారి అది మోదీ 1/3 ప్రభుత్వమేనని విమర్శించింది. ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించిన కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రటరీ జైరాం రమేశ్‌.. ఆంధ్రప్రదేశ్‌, బిహార్‌లకు సంబంధించి నాలుగు ప్రశ్నలు సంధిస్తూ ‘ఎక్స్‌’లో ఓ వీడియో పోస్టు చేశారు.

‘‘ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తామని ఏప్రిల్‌ 30, 2014న తిరుపతి వేదికగా హామీ ఇచ్చారు. తద్వారా భారీస్థాయిలో పెట్టుబడులు వస్తాయని చెప్పారు. ఇప్పటికి పదేళ్లయ్యింది.. కానీ, అది జరగలేదు. ఇప్పడు ఆ హామీ నెరవేరుతుందా? ఏపీకి ప్రధానమంత్రి ప్రత్యేక హోదా కల్పిస్తారా?’’ అని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ ప్రశ్నించారు. అంతేకాకుండా వైజాగ్‌ స్టీల్‌ ప్లాంటును ప్రైవేటీకరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించిన ఆయన.. దీన్ని అన్ని పార్టీలు వ్యతిరేకించాయన్నారు. ఇప్పుడైనా ఆ ప్రైవేటీకరణను అడ్డుకుంటారా? అని నిలదీశారు.

18th Lok Sabha: ఎనిమిదోసారి.. లోక్‌సభలో ‘సీనియర్‌ మోస్ట్‌’ ఎంపీలు!

ఎన్డీయే కూటమిలో ఉన్న నీతీశ్‌కుమార్‌ ఎంతోకాలంగా డిమాండు చేస్తున్నట్లుగా.. బిహార్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తారా? ఈ డిమాండు కొన్నేళ్లుగా ఉన్నప్పటికీ ప్రధాని మాత్రం మౌనం వీడటం లేదని జైరాం రమేశ్‌ పేర్కొన్నారు. కాంగ్రెస్‌, ఆర్జేడీ, జేడీయూలతో కొనసాగిన మహాగఠ్‌బంధన్‌ హయాంలో రాష్ట్రంలో కులగణన చేపట్టామన్నారు. దీనిని దేశవ్యాప్తంగా నిర్వహించాలని, నీతీశ్‌ కూడా ఇందుకు మద్దతు తెలుపుతున్నారన్నారు. ఇలా దేశం మొత్తం కులగణన చేపడతామని ప్రధాని హామీ ఇస్తారా? అని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అడిగారు.

ఇదిలాఉంటే, ఎన్డీఏ కూటమిలో ఉన్న తెదేపా 16, జేడీయూ 12 లోక్‌సభ సీట్లను గెలుచుకున్న సంగతి తెలిసిందే. భాజపా అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు అవసరమైన మెజార్టీని సొంతంగా సాధించలేకపోయింది. దీంతో మిత్ర పక్షాలైన తెదేపా, జేడీయూలు కీలకంగా మారిన నేపథ్యంలో కాంగ్రెస్‌ కూడా ఆ రెండు రాష్ట్రాల డిమాండ్లను ప్రస్తావించింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు