Yogi Adityanath: ఆరు నెలల్లో పీవోకే విలీనం ఖాయం..: సీఎం యోగి

మరో ఆరు నెలల్లో పీవోకే భారత్‌లో విలీనమవడం ఖాయమని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ పేర్కొన్నారు. కానీ, మూడోసారి కూడా ప్రధానిగా మోదీ ఎన్నికైతేనే అది సాధ్యమవుతుందని అన్నారు. 

Published : 19 May 2024 00:09 IST

దిల్లీ: పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే) మరో కొన్ని నెలల్లో భారత్‌లో విలీనమవుతుందని ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ (Yogi Adityanath) అన్నారు. అయితే, నరేంద్ర మోదీ ప్రధానిగా ఉంటేనే అది సాధ్యమవుతుందని పేర్కొన్నారు. శనివారం పాల్ఘర్‌లో ఏర్పాటుచేసిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న యోగి ప్రసంగించారు.

‘‘గత పదేళ్లల్లో నవభారత నిర్మాణాన్ని చూశాం. సరిహద్దులో భద్రత కట్టుదిట్టం చేశాం. ఉగ్రవాదాన్ని అరికట్టాం. మూడేళ్లుగా పాకిస్థాన్‌లో అనేకమంది ఉగ్రవాదులు హతమయ్యారు. దానివెనక భారత ఏజెన్సీల హస్తం ఉన్నట్లు ఆంగ్ల పత్రిక కథనాలు పేర్కొంటున్నాయి. మన ప్రజలను చంపినవారిని మనం పూజించలేం కదా. తగిన బుద్ధి చెబుతాం. పీవోకేను ఆక్రమించుకునేందుకు పాకిస్థాన్‌ తీవ్రంగా యత్నిస్తోంది. కానీ, అలా జరగదు. మరో ఆరు నెలల్లో అది పూర్తిగా భారత్‌లో విలీనమవుతుంది. కానీ.. మూడోసారి కూడా మోదీయే ప్రధానిగా బాధ్యత వహిస్తేనే అది జరుగుతుంది’’ అని యోగి పేర్కొన్నారు.

మాలీవాల్‌ను బయటకు పంపిన భద్రతా సిబ్బంది.. కేజ్రీవాల్‌ నివాసం నుంచి మరో వీడియో

కాంగ్రెస్‌ హయాంలో పేదలు చనిపోయారు 

కాంగ్రెస్‌ హయాంలో పేదలు ఆకలితో ప్రాణాలు కోల్పోయారని యోగి ఆరోపించారు. ‘‘కానీ, మోదీ పాలనలో ఆ సమస్య లేదు. కేంద్ర ప్రభుత్వం 80 కోట్ల మందికి ఉచితంగా రేషన్‌ అందిస్తోంది. భారత్‌ పూర్తిగా అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే మనం ప్రతిఒక్కరి మనోభావాలను గౌరవించాలి. ప్రతీ ఆడబిడ్డకు భద్రత కల్పించాలి. ఉపాధి అందించాలి’’ అని వ్యాఖ్యానించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని