RSS: ‘మణిపుర్‌ హింస’లో విదేశీ శక్తుల ప్రమేయం ఉందా?.. ప్రశ్నించిన మోహన్‌ భాగవత్‌

లోక్‌సభ ఎన్నికలకు ముందు భావోద్వేగాలను రెచ్చగొట్టి ఓట్లను రాబట్టుకునే ప్రయత్నాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ సూచించారు.

Updated : 24 Oct 2023 11:28 IST

నాగ్‌పుర్‌: సమస్యల నుంచి బయటపడేందుకుగానూ ప్రపంచం ఇప్పుడు భారత్‌ వైపు చూస్తోందని ఆరెస్సెస్‌ (RSS) సర్‌ సంఘ్‌చాలక్‌ మోహన్‌ భాగవత్‌ (Mohan Bhagwat) పేర్కొన్నారు. ఇటీవలి జీ20 సదస్సులో పాల్గొన్న ప్రతినిధులు భారతదేశ ‘భిన్నత్వంలో ఏకత్వా’న్ని ప్రత్యక్షంగా చూసినట్లు చెప్పారు. దసరా పర్వదినం పురస్కరించుకుని నాగ్‌పుర్‌లోని ఆరెస్సెస్‌ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ‘విజయదశమి ఉత్సవం (Vijayadashami Utsav)’లో మోహన్‌ భాగవత్ ప్రసంగించారు. మణిపుర్ హింసాకాండ (Manipur Violence)లో విదేశీ శక్తుల ప్రమేయం ఉందా? అని ఆరెస్సెస్‌ చీఫ్‌ ఈ సందర్భంగా ప్రశ్నించారు.

‘‘మణిపుర్‌లో అనేక ఏళ్లుగా మెయితీలు, కుకీలు కలిసిమెలసి ఉంటున్నారు. ఒక్కసారిగా హింస ఎలా చెలరేగింది? అక్కడ హింస జరగడం లేదు.. జరిగేలా చేస్తున్నారు. ఇందులో విదేశీ శక్తుల పాత్ర ఉందా? ఎందుకంటే ఇటువంటి పరిస్థితులు విదేశీ శక్తులకే మేలు చేస్తాయి. కొంతమంది సంఘ వ్యతిరేక వ్యక్తులు తమను తాము సాంస్కృతిక మార్క్సిస్టులుగా చెప్పుకొంటున్నారు. అయితే, వారు మార్క్స్‌ను మరచిపోయారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు భావోద్వేగాలను రెచ్చగొట్టి ఓట్లను రాబట్టుకునే ప్రయత్నాల విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. దేశ ఐక్యత, సమగ్రత, గుర్తింపు, అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఓటు వేయాలి’’ అని మోహన్‌ భాగవత్‌ విజ్ఞప్తి చేశారు.

పుణ్యక్షేత్రాల దర్శనమా? ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ వివరాలివే!

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ గాయకుడు, స్వరకర్త శంకర్‌ మహదేవన్‌ మాట్లాడుతూ.. ‘అఖండ భారత్’ సిద్ధాంతాన్ని, మన సంప్రదాయాలు, సంస్కృతిని పరిరక్షించడంలో ఆరెస్సెస్‌ సహకారం అన్నిటికంటే గొప్పదన్నారు. అంతకుముందు సంఘ్‌ వ్యవస్థాపకుడు కె.బి.హెడ్గేవార్ స్మారకాన్ని సందర్శించారు. ప్రజలు తమ తమ రంగాల్లో కృషి చేయడం ద్వారా దేశ నిర్మాణానికి సహకరించాలని పిలుపునిచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని