IRCTC tour package: కేరళ, తమిళనాడు పుణ్యక్షేత్రాల దర్శనమా? ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ వివరాలివే!

IRCTC tour package: కేరళ, తమిళనాడులోని పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలనుకంటున్నారా..? అయితే ఈ ప్యాకేజీపై ఓ లుక్కేయండి.

Updated : 24 Oct 2023 10:42 IST

రామనాథస్వామి ఆలయం

ఇంటర్నెట్‌ డెస్క్‌: కేరళ, తమిళనాడులోని పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ ప్యాకేజీ మీ కోసమే. పరమేశ్వరుని ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన రామేశ్వరంతో పాటు మధుర మీనాక్షి ఆలయం, పద్మనాభస్వామి ఆలయాలన్ని దర్శించుకోవటానికి ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (IRCTC) కొత్త ప్యాకేజీని తీసుకొచ్చింది. ఒడిశాలోని భువనేశ్వర్‌ నుంచి ఈ ప్రయాణం మొదలవుతుంది. తొమ్మిది రాత్రులు, పది పగళ్లుగా ఈ టూర్‌ కొనసాగుతుంది. బ్రహ్మపుర, విజయనగరం, విశాఖపట్నం స్టేషన్లలో బోర్డింగ్‌కు అవకాశం ఉంది. ప్రయాణం అనంతరం ఆయా రైల్వే స్టేషన్లలో దిగొచ్చు. ప్రతి శుక్రవారం ఈ రైలు అందుబాటులో ఉంటుంది. నవంబర్‌ 3 నుంచి మీ ప్రయాణానికి టికెట్లు బుక్‌ చేసుకోవచ్చు.

పద్మనాభపురం ప్యాలెస్

రైలు ప్రయాణం ఇలా...

  • భువనేశ్వర్ రైల్వే స్టేషన్ నుంచి మధ్యాహ్నం 12.10 గంటలకు భువనేశ్వర్ - రామేశ్వరం సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ (ట్రైన్‌ నం.20896) రైలు బయల్దేరుతుంది.
  • రెండో రోజు రాత్రి 8:33 గంటలకు రామనాథపురం చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా రామేశ్వరం తీసుకెళ్తారు. ముందుగానే బుక్‌ చేసిన హోటల్లోనే రాత్రి భోజనం, బస ఉంటుంది.
  • మూడో రోజు ఉదయం 5 గంటలకు రామనాథస్వామి ఆలయం, రామర్‌ పాదం ఆలయం, పంచముఖ ఆంజనేయుని ఆలయాల సందర్శనానికి తీసుకెళ్తారు. తర్వాత తిరిగి హోటల్‌కు చేరుకుంటారు. విశ్రాంతి అనంతరం మధ్యాహ్నం 2:30 గంటలకు ధనుష్కోడికి తీసుకెళ్తారు. సాయంత్రం షాపింగ్‌ చేసుకోవచ్చు. రాత్రి భోజనం, బస అక్కడే ఉంటుంది.
  • నాలుగో రోజు ఉదయం 8 గంటలకు అల్పాహారం ముగించుకొని కలామ్‌ మ్యూజియం చూడటానికి వెళ్తారు. తర్వాత కన్యాకుమారికి బయల్దేరుతారు. సాయంత్రం కన్యాకుమారి చేరుకుంటారు. అక్కడ సూర్యాస్తమయాన్ని (Sunset Point) చూస్తారు. సాయంత్రం షాపింగ్‌కు వెళ్లొచ్చు. కన్యాకుమారిలో ముందుగా బుక్‌ చేసిన హోటల్‌లో రాత్రి భోజనం, బస ఉంటుంది.
  • ఐదో రోజున తెల్లవారుజామున 4 గంటలకు సూర్యోదయం వీక్షించి తిరిగి హోటల్‌ చేరుకుంటారు. కాసేపు విశ్రాంతి తీసుకొని అల్పాహారం చేసిన తర్వాత.. కుమారి అమ్మన్ ఆలయానికి తీసుకెళ్తారు. అక్కడే మూడు సముద్రాలు కలిసే చోటు (Three Seas Mingle Point), వివేకానంద రాక్ మెమోరియల్, తిరువల్లువర్ విగ్రహం, మహాత్మా గాంధీ స్మారక మండపం వంటి సందర్శనా స్థలాలను నడక మార్గం ద్వారా వెళ్లి వీక్షించాల్సి ఉంటుంది. ముందు రోజు సూర్యాస్తమయం చూడనివారు ఐదో రోజు చూడొచ్చు. వ్యాక్స్‌ మ్యూజియం అందాల్ని చూసి రాత్రి కన్యాకుమారిలోనే భోజనం, బస ఉంటుంది.
  • ఆరో రోజు ఉదయం 8:30 గంటలకు తిరుచెందూర్ ఆలయాన్ని దర్శించుకొని తిరువనంతపురం బయల్దేరుతారు. మార్గం మధ్యలో పద్మనాభపురం ప్యాలెస్ అందాల్ని వీక్షిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు తిరువనంతపురం చేరుకుంటారు. అక్కడ ముందుగా ఏర్పాటు చేసిన హోటల్లో విశ్రాంతి తీసుకొని కోవలం బీచ్‌ని సందర్శిస్తారు. సాయంత్రం షాపింగ్‌ చేయెచ్చు. రాత్రి భోజనం, బస తిరువనంతపురంలోనే ఉంటుంది.
  • ఏడో రోజు ఉదయం అనంతరం పద్మనాభస్వామి ఆలయాన్ని చూడటానికి వెళ్తారు. స్వామివారి దర్శనం అనంతరం చిత్ర ఆర్ట్ గ్యాలరీ, నేపియర్ మ్యూజియం, నేచురల్ హిస్టరీ మ్యూజియం, అట్టుకల్ భగవతి ఆలయం, సైన్స్ అండ్‌ టెక్నాలజీ మ్యూజియం, ప్లానిటోరియం సందర్శిస్తారు. ఇక సాయంత్రం షాపింగ్‌ కావాలంటే షాపింగ్‌ చేసుకోవచ్చు. తిరువనంతపురంలోనే రాత్రి భోజనం, బస ఉంటుంది.
  • ఎనిమిదో రోజు ఉదయం 5 గంటలకు మధురై బయల్దేరుతారు. మధ్యాహ్నం 1 గంటకు చేరుకుంటారు. అక్కడ హోటల్‌లో విశ్రాంతి తీసుకొని మధ్యాహ్నం తిరుమలై నాయకర్‌ మహల్‌, తిరుపుర- కుండ్రం మురుగన్, మీనాక్షి అమ్మవారి ఆలయాల్ని దర్శించుకుంటారు. రాత్రి మధురైలోనే బస ఉంటుంది.
  • ముందు రోజు అమ్మవారి ఆలయాన్ని సందర్శించటానికి వీలు కాకపోతే తొమ్మిదో రోజు ఉదయం మీనాక్షి అమ్మ దర్శనానికి తీసుకెళ్తారు. తర్వాత ఉదయం 11 గంటలకు మధురై నుంచి  (ట్రైన్‌ నెం: 12666) రైలులో భువనేశ్వర్‌కు పయనమవుతారు.
  • పదో రోజు సాయంత్రం 4 గంటలకు భువనేశ్వర్‌ రైల్వే ష్టేషన్‌ చేరుకోవటంతో మీ యాత్ర పూర్తవుతుంది.

మీనాక్షి అమ్మవారి ఆలయం

వీటి బాధ్యత ఐఆర్‌సీటీసీదే..

  • యాత్రకు వెళ్లి రావడానికి రైలు టికెట్లు (థర్డ్‌ ఏసీ, స్లీపర్‌ ఎంపికను బట్టి) ప్యాకేజీలో అంతర్భాగంగా ఉంటాయి.
  • ఏసీ గదిలో బస, ఏసీ రవాణా సదుపాయం ఉంటుంది.
  • ఏడు రోజులు ఉదయం టిఫిన్‌, రాత్రి భోజనం ఐఆర్‌సీటీసీయే చూసుకుంటుంది.
  • ప్రయాణ బీమా సదుపాయం ఉంటుంది.

ఇవి గుర్తుంచుకోండి..

  • రైలు ప్రయాణంలో ఆహారాన్ని మీరే ఏర్పాటు చేసుకోవాలి.
  • పర్యాటక ప్రదేశంలో ఎక్కడైనా ప్రవేశ రుసుములు ఉంటే యాత్రికులే చెల్లించాలి.
  • వ్యక్తిగత గుర్తింపు కార్డులను (original ID) తప్పనిసరిగా తీసుకెళ్లాలి.
  • పేరు, వయసు.. మొదలైన వివరాల్లో ఏవైనా మార్పులు ఉంటే ప్రయాణానికి 5 రోజుల ముందు మాత్రమే మార్చుకోవటానికి వీలుంటుంది. అది కూడా ఒకసారి మాత్రమే.

వివేకానంద రాక్ మెమోరియల్

ప్యాకేజీ ఛార్జీలు..

  • 2 - 3 ముగ్గురు వ్యక్తులు బుక్‌ చేసుకుంటే.. కంఫర్ట్‌లో (థర్డ్‌ ఏసీ బెర్త్‌) ఒక్కో ప్రయాణికుడికి  సింగిల్ షేరింగ్‌లో అయితే రూ.72,380, ట్విన్ షేరింగ్‌కు రూ.41,930, ట్రిపుల్ షేరింగ్‌కు రూ.34,555 చెల్లించాలి. 5 - 11 ఏళ్ల మధ్య చిన్నారులకు విత్ బెడ్‌ అయితే రూ.23,440, విత్ అవుట్ బెడ్ అయితే రూ.17,860 చెల్లించాలి.
  • స్టాండర్ట్‌లో (స్లీపర్‌ బెర్త్‌), రూమ్‌ సింగిల్ షేరింగ్ అయితే రూ.68,120, ట్విన్ షేరింగ్‌కు రూ.37,670, ట్రిపుల్ షేరింగ్‌కు రూ.30,295. ఇక 5-11 ఏళ్ల మధ్య చిన్నారులకు విత్ బెడ్‌తో రూ.19,180, అదే విత్ అవుట్ బెడ్ అయితే రూ.13,600 చెల్లించాలి.
  • నలుగురు నుంచి ఆరుగురు కలిసి బుక్‌ చేసుకుంటే వేరే ప్యాకేజీ ఛార్జీలు వర్తిస్తాయి. స్టాండర్ట్‌లో (స్లీపర్‌ బెర్త్‌) డబుల్‌ షేరింగ్‌కు రూ.34,280, ట్రిపుల్‌ షేరింగ్‌కు రూ.31,480 చెల్లించాలి. 5-11 ఏళ్ల మధ్య చిన్నారులకు విత్ బెడ్‌తో రూ.21,525, విత్ అవుట్ బెడ్ అయితే రూ.15,945 చెల్లించాలి.
  • అదే కంఫర్ట్‌లో (థర్డ్‌ ఏసీ) డబుల్‌ షేరింగ్‌కు రూ.30,020, ట్రిపుల్‌ షేరింగ్‌కు రూ.28,220 చెల్లించాలి. 5 - 11 ఏళ్ల మధ్య చిన్నారులకు విత్ బెడ్‌ అయితే రూ. 17,270, విత్ అవుట్ బెడ్ అయితే రూ.11,685 చెల్లించాలి.
  • క్యాన్సిలేషన్‌ పాలసీ ఇలా... 15 రోజుల ముందు ప్రయాణం రద్దు చేసుకుంటే ఒక్కో టికెట్‌కు క్యాన్సిలేషన్‌ కింద రూ.250 ఛార్జీగా వసూలు చేస్తారు. అదే 8 - 14 రోజుల ముందు రద్దు చేసుకుంటే 25 శాతం, 4 - 7 రోజుల ముందు రద్దు చేసుకుంటే 50 శాతం టికెట్‌ ధర నుంచి మినహాయిస్తారు. అయితే, ప్రయాణానికి నాలుగు రోజుల కంటే తక్కువ సమయంలో రద్దు చేసుకొంటే ఎలాంటి తిరిగి చెల్లింపులూ ఉండవు.

టికెట్‌ బుకింగ్‌, ప్యాకేజీకి సంబంధించి పూర్తి వివరాల కోసం ఈ లింక్‌ క్లిక్‌ చేయండి..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని