Wrestlers Protest: మా పతకాలను వెనక్కి ఇచ్చేస్తాం: హెచ్చరించిన రెజ్లర్లు

బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌ సింగ్‌ (Brij Bhushan)కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న తమపై దిల్లీ పోలీసులు అనుచితంగా ప్రవర్తించారని స్టార్‌ రెజ్లర్లు (Wrestlers Protest) ఆరోపించారు. ఇటువంటి అవమానాలు భరించలేమని.. ఇలాగే కొనసాగిస్తే మాత్రం తమకు వచ్చిన పతకాలను వెనక్కి తీసుకోండని హెచ్చరించారు.

Updated : 04 May 2023 15:52 IST

దిల్లీ: భారత రెజ్లింగ్‌ సమాఖ్య (WFI) అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌ సింగ్‌ (Brij Bhushan)కు వ్యతిరేకంగా నిరసనలు చేపడుతోన్న రెజ్లర్ల (Wrestlers Protest)పై దిల్లీ పోలీసులు అనుచితంగా ప్రవర్తించడంపై క్రీడాకారులు తీవ్రంగా మండిపడ్డారు. ఇలాగైతే తమకు వచ్చిన పద్మశ్రీలతోపాటు ఇతర పతకాలను, అవార్డులను వెనక్కి ఇచ్చేస్తామని హెచ్చరించారు. ఇలాంటి అవమానాలు భరించాల్సి వస్తే తమకు వచ్చిన ఈ గౌరవాలతో ప్రయోజనం లేదని విలపిస్తూ తమ ఆవేదన వ్యక్తం చేశారు.

‘మా పతకాలను వెనక్కి తీసుకోండి. మమ్మల్ని చాలా అవమానాలకు గురిచేస్తున్నారు. మా గౌరవం కోసం పోరాడుతున్నాం. కానీ, వాళ్ల కాళ్లకింద నలిగిపోతున్నాం. మా పతకాలను వెనక్కి ఇవ్వడంతోపాటు మా జీవితాలను కూడా ఇచ్చేస్తాం. కానీ, మాకు మాత్రం న్యాయం చేయండి’ అని వినేశ్‌ ఫొగాట్‌ (Vinesh Phogat) ఆవేదన వ్యక్తం చేశారు. తనపై పురుష పోలీసులు అనుచితంగా ప్రవర్తించి వేధించారని.. ఆ సమయంలో ఏ ఒక్క మహిళా పోలీసు కూడా లేరని వాపోయారు.

చేయిచేసుకోవడం సిగ్గుచేటు.. 

మహిళా రెజ్లర్లపై పోలీసులు చేయిచేసుకోవడం సిగ్గుచేటు అని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) పేర్కొన్నారు. దేశ వనితలపై దాడులకు పాల్పడటానికి భాజపా (BJP) ఎన్నడూ వెనుకాడదని ఆరోపించారు. భాజపా ఇచ్చే ‘బేటీ బచావో’ నినాదం కేవలం మాటలకే పరిమితం అని రాహుల్‌ గాంధీ దుయ్యబట్టారు.

అది అహంకారమే..

తమకు జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడుతున్న రెజ్లర్లతో పోలీసులు ఘర్షణకు దిగడం జాతీయ క్రీడాకారులకు అవమానకరమని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) పేర్కొన్నారు. అహంకారంతోనే భాజపా ఇటువంటి చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. దౌర్జన్యంతో వ్యవస్థను నడపాలని భాజపా అనుకుంటోందని ఆరోపించిన కేజ్రీవాల్‌.. అధికారం నుంచి ఆ పార్టీని దూరం చేయాలని పిలుపునిచ్చారు.

మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ మద్దతు

ఆందోళన చేస్తున్న స్టార్‌ రెజ్లర్లకు దిల్లీ మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ స్వాతి మద్దతు ప్రకటించారు. గురువారం ఉదయం దీక్షా స్థలికి చేరుకున్న ఆమె.. మహిళా క్రీడాకారిణులపై పోలీసు సిబ్బంది అసభ్యకరంగా ప్రవర్తించడం దారుణమన్నారు. దీనిపై ఫిర్యాదు అందిన అనంతరం వారిపై చర్యలు ఉంటాయని పేర్కొన్నారు.

స్టార్‌ రెజ్లర్ వినేశ్‌ ఫొగాట్‌, సాక్షి మాలిక్‌, బజ్‌రంగ్‌ పునియాలు క్రీడారంగంలో అత్యున్నత పురస్కారమైన ఖేల్‌రత్న అవార్డును అందుకున్న విషయం తెలిసిందే. వీరిలో సాక్షి మాలిక్‌(2017), బజరంగ్‌ పునియాలకు పద్మశ్రీ కూడా లభించింది. ఇదిలాఉంటే, దీక్షా శిబిరం వద్ద బుధవారం అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. పోలీసులు, రెజ్లర్ల మధ్య ఘర్షణ జరిగి పలువురు గాయపడ్డారు. నిరసనకారుల వసతి కోసం కొందరు మడత మంచాలు తీసుకురావడం ఈ ఉద్రిక్తతలకు కారణమయ్యింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు