Yoga guru Ramdev: సుప్రీం ఆగ్రహం.. బేషరతుగా క్షమాపణలు చెప్పిన రామ్‌దేవ్‌ బాబా

తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసులో యోగా గురువు రామ్‌దేవ్ బాబా (Yoga guru Ramdev) నేడు సుప్రీంకోర్టు ఎదుట హాజరయ్యారు. ఈ కేసులో ఆయన కోర్టుకు బేషరతుగా క్షమాపణలు చెప్పారు. 

Updated : 02 Apr 2024 13:14 IST

దిల్లీ: తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసు విచారణలో భాగంగా యోగా గురువు రామ్‌దేవ్ బాబా (Yoga guru Ramdev), పతంజలి ఆయుర్వేద సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలక్రిష్ణ మంగళవారం సుప్రీంకోర్టు ఎదుట హాజరయ్యారు. తమ ఆదేశాలను పాటించడంలో విఫలమైనందుకు తీవ్ర అసహనం వ్యక్తం చేసిన కోర్టు.. చర్యలకు సిద్ధంగా ఉండాలని వారిని హెచ్చరించింది. అలాగే క్షమాపణలు తెలియజేస్తూ గత నెల పతంజలి సంస్థ దాఖలు చేసిన అఫిడవిట్‌పై స్పందిస్తూ.. ‘‘మీ క్షమాపణల పట్ల మేం సంతృప్తి చెందలేదు’’ అని వ్యాఖ్యానించింది.

ఈ సందర్భంగా రామ్‌దేవ్‌ బాబా కోర్టుకు బేషరతుగా క్షమాపణలు చెప్పారు. అయితే, అఫిడవిట్‌లో వీరు ఇచ్చిన వివరణపై అసంతృప్తి వ్యక్తం చేసిన కోర్టు.. వారం రోజుల్లోగా మళ్లీ కొత్త అఫిడవిట్లు దాఖలు చేయాలని సూచించింది. ఏప్రిల్‌ 10న మరోసారి న్యాయస్థానం ఎదుట వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను వాయిదా వేసింది.

ఆధునిక వైద్యవిధానాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ పతంజలి ఆయుర్వేద సంస్థపై ఇండియన్‌ మెడికల్ అసోసియేషన్‌ (IMA) సుప్రీంకోర్టు (Supreme Court)లో పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం గతేడాది నవంబర్‌లో ఆ సంస్థను మందలించింది. తమ ఉత్పత్తులు వివిధ రకాల వ్యాధులను నయం చేస్తాయంటూ ‘అసత్య’, ‘తప్పుదోవ’ పట్టించే ప్రకటనలు ఇవ్వొద్దని తేల్చిచెప్పింది. లేదంటే కోర్టు తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఇకపై ఎలాంటి ఉల్లంఘనలూ జరగవంటూ అప్పట్లో ఆ సంస్థ న్యాయవాది కోర్టుకు వెల్లడించారు.

టీ, రొట్టె ముక్కలతో రోజు మొదలు

అయితే, ఆ హామీని ఉల్లంఘించడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వారిపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో తెలియజేయాలని రామ్‌దేవ్‌ బాబా (Yoga guru Ramdev), ఆచార్య బాలకృష్ణకు నోటీసులు జారీ చేసింది. ప్రకటనల విషయంలోనూ సూచనలు చేసింది. ఇతర వైద్య విధానాలపై ప్రభావం చూపేలా ప్రింట్‌ లేదా ఎలక్ట్రానిక్‌ మాధ్యమాల్లో ఎలాంటి ప్రచారం చేయవద్దని మరోసారి హెచ్చరించింది. ఆ నోటీసులకు పతంజలి స్పందించలేదు. ‘మీ ప్రతిస్పందన ఎందుకు దాఖలు చేయలేదు..?’ అని జస్టిస్‌ హిమా కోహ్లీ, జస్టిస్‌ అమానుల్లాతో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది. తదుపరి విచారణ సమయంలో వారిద్దరు న్యాయస్థానం ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. 

దానిలో భాగంగా ఇటీవల పతంజలి సంస్థ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. న్యాయవ్యవస్థ పట్ల అత్యంత గౌరవం ఉందని వ్యాఖ్యానిస్తూ.. క్షమాపణలు తెలియజేసింది. తాజాగా వారు కోర్టు ముందుకు వచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు