రెండు రోజులు మంచినీళ్లతో సరిపెట్టుకున్నారు!

Eenadu icon
By Entertainment Team Updated : 19 Sep 2024 17:29 IST
Ee
Font size
  • A
  • A+
  • A++
3 min read

ఇంటర్నెట్‌డెస్క్‌: తెలుగు తెరపై క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సీనియర్‌ నటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు (gummadi venkateswara rao ). ఇంటిపేరుతోనే అందరికీ సుపరిచితులైన ఆయన ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించారు. తండ్రిగా, బాబాయిగా, పెదనాన్నగా, తాతగానే కాదు, ప్రతినాయక ఛాయలున్న పాత్రలనూ పోషించారు.

సినిమా రంగానికి వచ్చినప్పుడు గుమ్మడి వెంకటేశ్వరరావుది హీరోగా నటించే వయసే. కానీ, చెయ్యలేదు. ఒక జానపద చిత్రంలో హీరోగా, (జమున నాయిక) అవకాశం వచ్చింది. కొన్ని రోజులు షూటింగ్‌ జరిగి ఆగిపోయింది. ఆయన తొలి నుంచి వయసు మీరిన పాత్రలే వేస్తూ వచ్చారు. ఆ పాత్రలంటేనే ఇష్టపడేవారు. గుమ్మడి కెరీర్‌లో నటించిన అద్భుతమైన పాత్రల్లో ‘మహామంత్రి తిమ్మరుసు’ ఒకటి. ఎన్టీఆర్‌ శ్రీకృష్ణ దేవరాయలుగా నటించిన ఆ చిత్రంలో తొలుత మంత్రి తిమ్మరుసు పాత్రకు ఎస్వీ రంగారావును అనుకున్నారట. అయితే, ఆయన వాచకం, శరీరం ఆ పాత్రను డామినేట్‌ చేస్తుందని గుమ్మడిని తీసుకున్నారు. ఇదే విషయాన్ని ఎన్టీఆర్‌కు చెబితే ఆయన కూడా ఓకే అన్నారు. వారి నమ్మకం నిజమైంది. మహామంత్రి తిమ్మరుసు పాత్రలో గుమ్మడి ఒదిగిపోయారు. ఇలా ఎన్నో మరుపురాని సాత్విక పాత్రల్లో గుమ్మడి చిర స్మరణీయుడిగా నిలిచిపోయారు

గుమ్మడి వాక్యాలు

‘‘మీరు ఈ సినిమాలకి వచ్చి మూడు దశాబ్దాలయింది. మీరు నేర్చుకున్నదీ, గ్రహించినదీ ఏమిటి?’’ అని ఒక సందర్భంలో ఆయనను ప్రశ్నిస్తే ఇలా చెప్పుకొచ్చారు. ‘‘పంచ సూత్రాలు అని నేనే రాసి పెట్టుకున్నాను. కొంతమందికి రాసి కూడా ఇచ్చాను. మీకూ ఇస్తాను చదువుకోండి’’ అని, ‘సైక్లో స్టైల్‌’ కాపీని (అప్పుడు జిరాక్స్‌ మెషీన్లు లేవు) ఇచ్చారట. అందులో ఇలా ఉన్నాయి. 1. ఈ సినిమా ప్రపంచంలో ధనార్జనే గీటురాయి. 2. అనుబంధాలు, ఆత్మీయతలు! నిస్వార్థమైన స్నేహం ఆశించడం, నీటికోసం ఎండమావుల వెంట పరుగెత్తడంలాంటిది. 3. మంచితనం అనేది అసమర్థతకు పర్యాయ పదం. 4. సొంత లాభం కొంత మానుకుని, పొరుగువాడికి తోడుపడేవాడు పిచ్చి సన్యాసి. 5. ఎత్తులు, పై ఎత్తులతో స్వార్థానికి ఇతరుల్ని ఉపయోగించుకునే వాడే తెలివైనవాడు!

  • గుమ్మడి వెంకటేశ్వరరావు నటించిన ‘అర్ధాంగి’ చిత్రంలో ఆయనకు భార్యగా నటించిన శాంత కుమారి ఆయనకంటే 8 సంవత్సరాలు పెద్దది. అలాగే ఆయనకు పెద్ద కుమారుడిగా నటించిన అక్కినేని నాగేశ్వరరావు ఆయనకంటే 3 సంవత్సరాలు పెద్ద. ఆయన చిన్న కుమారుడిగా నటించిన జగ్గయ్య ఆయన కంటే 1 సంవత్సరం పెద్ద.
  • తొలినాళ్లలో అవకాశాల కోసం మద్రాసు వచ్చినప్పుడు చేతిలో ఉన్న డబ్బులు అయిపోయి రెండు రోజులు మంచినీటితో సరిపెట్టుకున్నారు. ఆ తరువాత కంపెనీ డైరెక్టర్ సహాయం చేస్తానని చెప్పినా నిరాకరించి ఖర్చుల కోసం తన పెళ్ళినాటి ఉంగరం తాకట్టు పెట్టి తిరిగి విడిపించుకున్నారు. ఆయన జీవితంలో భోజనానికి ఇబ్బంది పడిన రోజులు ఇవేనని ఓ సందర్భంలో గుమ్మడి పంచుకున్నారు.
  • ‘మహామంత్రి తిమ్మరుసు’ చిత్రంలో ఎన్.టి.ఆర్ కృష్ణదేవరాయలుగా నటించినా చిత్రానికి పేరు గుమ్మడి పాత్ర మీదుగా ఉండటం రామారావు చిత్రాలలో ఓ అరుదైన ఘటన. అలాగే ‘మర్మయోగి’ చిత్రం పేరు కూడా గుమ్మడి పాత్ర మీదే ఉంది.
  • గుమ్మడి చివరిసారిగా 2008 సంవత్సరంలో ‘జగద్గురు శ్రీ కాశీనాయని చరిత్ర’ సినిమాలో తన జీవితానికి దగ్గరగా ఉన్న కాశీనాయన పాత్ర పోషించారు.

Published : 19 Sep 2024 12:49 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

జిల్లా వార్తలు

లైవ్ టీవీ