Jr NTR: ఎన్టీఆర్‌తో ‘మిషన్‌ ఇంపాజిబుల్‌’లాంటి మూవీ.. అలా‘శక్తి’గా మారిపోయింది!

Jr NTR: తాను అనుకున్న ‘శక్తి’ కథ ఎలా సోషియో ఫాంటసీ మూవీగా మారిపోయిందో దర్శకుడు మెహర్‌ రమేశ్‌ ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

Published : 17 Jul 2023 16:58 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఎన్టీఆర్‌ (NTR) కథానాయకుడిగా మెహర్‌ రమేశ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సోషియో ఫాంటసీ మూవీ ‘శక్తి’ (sakthi movie). ఇలియానా కథానాయిక. భారీ బడ్జెట్‌తో అశ్వినీదత్‌ నిర్మించారు. 2011లో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల మెప్పు పొందలేకపోయింది. అసలు మెహర్‌ రమేశ్‌ చెప్పిన కథ వేరే ఉందట. ‘కంత్రీ’ తర్వాత నిర్మాత అశ్వినీదత్‌ను కలిసిన మెహర్‌ రమేశ్‌ ఓ సోషల్‌ ఫిల్మ్‌ను తీయాలనుకున్నారు. ఎన్టీఆర్‌కు కూడా అదే కథను వినిపించారు. ఇద్దరికీ బాగా నచ్చేసిందట. ఇండస్ట్రీలో స్నేహితులైన దర్శకుడు వి.వి.వినాయక్‌, కథానాయకుడు అల్లు అర్జున్‌లకు కూడా ఈ కథ వినిపించి అభిప్రాయం తీసుకున్నారట మెహర్‌ రమేశ్‌. అందరికీ కథ నచ్చింది. అదే సమయంలో ఎన్టీఆర్‌ తన డేట్స్‌ను ముందుగా ‘బృందావనం’ కోసం కేటాయించాల్సి వచ్చింది. దీంతో మెహర్‌ రమేశ్‌ మూవీ ఆలస్యమైంది.

ఈ క్రమంలోనే నిర్మాత అశ్వినీదత్‌కు ఒక ఆలోచన వచ్చిందట. ఎన్టీఆర్‌తో ‘పాతాళ భైరవి’, ‘జగదేక వీరుడు’లాంటి సోషియో ఫాంటసీ మూవీ తీయాలనుకున్నారట. అందుకోసం ఇండస్ట్రీలో అప్పటికే ఉన్న సీనియర్‌ రచయితలను పిలిపించి, తాను అనుకున్న ఆలోచనలను చెప్పడంతో సోషల్‌ ఫిల్మ్‌గా తీయాలనుకున్న ‘శక్తి’ సోషియో ఫాంటసీ మూవీగా అయింది. సుమారు రూ.25కోట్లతో సినిమా తీద్దామని చిత్రీకరణ మొదలు పెడితే, అది అలా అలా పెరిగిపోయి భారీ బడ్జెట్‌ చిత్రంగా మారిపోయింది. ఆధ్యాత్మిక కథలపై తనకు పెద్దగా అవగాహన లేకపోయినా, తన వంతు ప్రయత్నించి, సినిమాను తీసినట్లు మెహర్‌ రమేశ్‌ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఒకవేళ ఎన్టీఆర్‌తో ‘మిషన్ ఇంపాజిబుల్‌’లాంటి మూవీ చేసి ఉంటే, ఎలా ఉండేదో..!

‘బేబీ’కి యువత ఫిదా.. సోషల్‌మీడియాలో ఫన్నీ మీమ్స్‌ వరద..!

ఇక ఇదే ‘శక్తి’ మూవీపై గతంలో అశ్వినీదత్‌ కూడా స్పందించారు. ‘‘నా కెరీర్‌లో బాగా నిరాశకు గురి చేసిన సినిమా ‘శక్తి’. ‘ఇక మనకి ఈ ఇండస్ట్రీ అనవసరం. సినిమాలు వదిలేసి వెళ్లిపోదాం’ అనిపించింది. నిర్మాణ వ్యయం బాగా ఎక్కువైపోయింది. ఆ ఒక్క సినిమాతోనే రూ.32 కోట్లు పోయాయి. ఇది మామూలు విషయం కాదు.  ‘శక్తి’ మాత్రం నాకు చాలా షాకింగ్‌గా అనిపించింది. అందుకే నాలుగైదేళ్ల పాటు సినిమాలు తీయాలని అనిపించలేదు. ఈలోగా పిల్లలు వచ్చి సినిమా తీస్తామంటే ఒప్పుకొన్నా. మంచి సినిమాలు తీయడంతో వాళ్లను ప్రోత్సహిస్తూ వచ్చా’’ అని అశ్వినీదత్‌ అన్నారు.

ప్రస్తుతం వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌పై ప్రభాస్‌ కథానాయకుడిగా ‘ప్రాజెక్ట్‌-కె’ రూపొందిస్తున్నారు. నాగ్‌ అశ్విన్‌ దర్శకుడు. దీపిక పదుకొణె, కమల్‌హాసన్‌, అమితాబ్‌ బచ్చన్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు. మరోవైపు దర్శకుడు మెహర్‌ రమేశ్‌ ‘భోళా శంకర్‌’ తీస్తున్నారు. చిరంజీవి కథానాయకుడిగా ఇది రూపొందుతోంది. తమిళంలో ఘన విజయం సాధించిన ‘వేదాళం’కు రీమేక్‌గా దీన్ని తీర్చిదిద్దారు. ఆగస్టులో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని