satyam rajesh: అలీ విమానం మిస్సయితే.. రాజేష్‌ కాస్తా.. ‘సత్యం’ రాజేష్‌ అయ్యాడు!

విలన్‌ అవుదామని ఇండస్ట్రీకి వచ్చిన రాజేష్‌ అవకాశాల కోసం రెండు, మూడేళ్ల పాటు స్టూడియోల చుట్టూ తిరిగిన రాజేష్‌ కెరీర్‌ను ‘సత్యం’ మలుపు తిప్పింది.

Published : 07 Nov 2023 09:39 IST

హైదరాబాద్‌: చిత్ర పరిశ్రమలో అదృష్టం ఎవరిని ఎప్పుడు వరిస్తుందో తెలియదు. ఒకరి కోసం అనుకున్న పాత్రల్లో మరొకరు నటించి, ఆ పాత్రతోనే పేరు తెచ్చుకున్న వారు ఎందరో. అలాంటి వారిలో ‘సత్యం’ రాజేష్‌ (satyam rajesh) కూడా ఒకరు. విలన్‌ అవుదామని ఇండస్ట్రీకి వచ్చిన రాజేష్‌ అవకాశాల కోసం రెండు, మూడేళ్ల పాటు స్టూడియోల చుట్టూ తిరిగారు. ‘సర్‌.. విలన్‌గా చేస్తా. అవకాశమివ్వండి’ అంటే ‘నువ్వా? విలన్‌గానా?’ అంటూ పెదవి విరిచేవారు. ఈ క్రమంలో సరైన తిండి లేక బరువు తగ్గిపోవడంతో ముఖం కూడా పీక్కుపోయి, సన్నగా చిన్న పిల్లాడిలా కనిపించడంతో, విలన్‌ పాత్రలు అడిగితే నవ్వుకునేవారట.

పట్టు వదలకుండా ఆడిషన్స్‌ వెళ్లిన రాజేష్‌కు తొలుత హీరో ఫ్రెండ్స్‌ గ్రూపులో ఒకడిగా క్యారెక్టర్లు రావడం మొదలు పెట్టాయి. వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని, గుర్తింపు తెచ్చుకునే సమయంలోనే సుమంత్‌ ‘సత్యం’ మూవీ రాజేష్‌ కెరీర్‌ను మలుపుతిప్పింది. అందులో సుమంత్‌ స్నేహితుడి పాత్ర కోసం తొలుత అలీని అనుకున్నారు. అప్పటికే సినిమా షెడ్యూల్‌ మొదలవడంతో అలీ కూడా షూటింగ్‌లో పాల్గొనాల్సి ఉంది. అదే సమయంలో ఆయన దుబాయ్‌ వెళ్లారు. ఇండియాకు తిరిగి వచ్చే సమయంలో అక్కడ విమానం క్యాన్సిల్‌ అవడంతో రెండు రోజులు దుబాయ్‌లోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఈలోగా అనుకున్న షెడ్యూల్‌ ఆలస్యమవుతుండటంతో దర్శకుడు సూర్య కిరణ్‌... రాజేష్‌ను ఆ పాత్రకు తీసుకుందామనుకున్నారు. ఇదే విషయాన్ని నిర్మాత నాగార్జున దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన తొలుత ఒప్పుకోలేదు. ‘అలీ వచ్చేదాకా వేచి చూద్దాం’ అని అన్నారు. దీంతో సూర్య కిరణ్‌ కలగజేసుకుని, ‘రాజేష్‌ నటనతో పాటు, నా కామెడీ టైమింగ్‌పై నాకు నమ్మకం ఉంది. అవకాశం ఇవ్వండి’ అనడంతో ఎట్టకేలకు నాగార్జున ఒప్పుకొన్నారు. అలా ‘సత్యం’లో సతీష్‌ పాత్రకు రాజేష్‌ ఎంపికయ్యారు. తన నటన, కామెడీ టైమింగ్‌, ‘పులి రాజా’ అంటూ ఆయన చేసే హంగామా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. ఇక కెరీర్‌లో వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. ఈ సినిమాతో రాజేష్‌బాబు కాస్తా.. ‘సత్యం’ రాజేష్‌ అయ్యారు.

కమెడియన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గానే కాకుండా వైవిధ్యమైన పాత్రలను రాజేష్‌ పోషిస్తున్నారు. ‘క్షణం’లో పోలీస్‌ ఆఫీసర్‌గా నటించి మెప్పించారు. ఇక ‘మా ఊరి పొలిమేర’తో అందరికీ థ్రిల్‌ పంచారు. ఇటీవల విడుదలైన ‘మా ఊరిపొలిమేర 2’లో తన నటనతో మరో మెట్టు ఎక్కారు. చేతబడులు చేసే వ్యక్తి కొమిరి పాత్రలో జీవించేశారు. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని