Bhookailasa: మేకప్‌ వేసుకుని ఐదు గంటలకే బీచ్‌కు వెళ్తే..

తెలుగు ప్రేక్షకులకు అద్భుతమైన చిత్రాలను అందించి ప్రేక్షకులను అలరించిన దిగ్గజ నటులు ఎన్టీఆర్‌ (NTR), ఏయన్నార్‌ (ANR). ఇరువురు తమదైన నటనతో అన్ని జానర్‌ల సినిమాల్లోనూ నటించి

Updated : 25 Jun 2023 19:32 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తెలుగు ప్రేక్షకులకు అద్భుతమైన చిత్రాలను అందించి ప్రేక్షకులను అలరించిన దిగ్గజ నటులు ఎన్టీఆర్‌ (NTR), ఏయన్నార్‌ (ANR). ఇరువురు తమదైన నటనతో అన్ని జానర్‌ల సినిమాల్లోనూ నటించి మెప్పించారు. ఇక తెలుగు, తమిళ భాషల్లో చక్కటి సినిమాలను నిర్మించిన సంస్థ ఏవీఎం ప్రొడక్షన్స్‌. ఎన్టీఆర్‌, ఏయన్నార్‌లతో విడివిడిగా సినిమాలు తీయడమే కాకుండా వీరిద్దరి కాంబినేషన్‌లో ‘భూకైలాస్‌’ (Bhookailasa) సినిమా నిర్మించారు ఏవీఎం ప్రొడక్షన్స్ సంస్థ అధినేత మెయ్యప్ప చెట్టియార్‌. ఈ చిత్రంలోనే ఎన్టీఆర్ తొలిసారిగా రావణ పాత్రను పోషించారు. నారదుడి పాత్రను అక్కినేని నాగేశ్వరరావు ధరించారు.

‘భూకైలాన్’లో వీరిద్దరి కాంబినేషన్‌లో చాలా సన్నివేశాలున్నాయి. సెట్లో ఒకరి కంటే మరొకరు ముందు ఉండాలని పోటీ పడేవారు. అందరికంటే ముందు హీరోలు సెట్‌లో ఉండడంతో యూనిట్ సభ్యులు అప్రమత్తంగా ఉండేవారు. చిత్ర కథానాయిక జమున కూడా వీలైనంత త్వరగా సెట్‌కి రావడానికి ప్రయత్నించేవారు. ఈ చిత్రంలో సూర్యోదయ సన్నివేశం ఒకటుంది. అందులో ఎన్టీఆర్, ఏయన్నార్ పాల్గొనాలి. అందుకే చిత్ర దర్శకుడు శంకర్ ముందు రోజు సాయంత్రం ఈ అగ్ర నటులిద్దరి దగ్గరకి వెళ్లి ‘రేపు ఉదయం సూర్యోదయ సన్నివేశాన్ని మీ ఇద్దరి మీద బీచ్‌లో చిత్రీకరించడానికి ప్లాన్ వేశాం. మీరు ఉదయం ఐదు గంటల కన్నా ముందే స్పాట్‌లో ఉంటే ఒక గంట, గంటన్నర సమయంలో ఆ షాట్స్ తీసేసుకుని రావచ్చు’ అని చెప్పారు. దర్శకుడే స్వయంగా చెప్పడంతో ‘ఓకే అలాగే వస్తాం. మీరు ఏర్పాట్లు చేసుకోండి’ అని హీరోలిద్దరూ చెప్పారు.

రోజు లేచే సమయానికంటే ముందు లేచి మేకప్‌తో సిద్ధమై ఐదు గంటల కల్లా దర్శకుడు శంకర్‌ చెప్పిన బీచ్‌కు చేరుకున్నారు ఎన్టీఆర్, ఏయన్నార్. అక్కడ షూటింగ్‌కు సంబంధించిన వాళ్లెవరూ కనిపించలేదు. పొరపాటున వేరే ప్రదేశానికి వచ్చామా అని మొదట సందేహించినా తమకు చెప్పిన ప్రదేశం అదేనని నిర్ధారించుకున్నారు. ‘సరే వస్తారు’ కదాని ఆ బీచ్‌లో ఇసుక మీద కూర్చుని కాసేపు కబుర్లు చెప్పుకొన్నారు. ఆరు దాటినా, యూనిట్ సభ్యుల అలికిడి లేదు. ఎక్కడో తేడా జరిగి ఉంటుందనుకుని ఇక ఇంటికి వెళ్లడానికి ఎన్టీఆర్, ఏయన్నార్ సిద్ధమయ్యేసరికి దర్శకుడు శంకర్ కారులో అక్కడికి వచ్చారు. మేకప్ సిద్ధంగా ఉన్న ఎన్టీఆర్, ఏయన్నార్‌లను చూడగానే ఆయన పైప్రాణాలు పైకే పోయాయి. వణికిపోతూ కారులోంచి ఒక్కసారిగా కిందకు దూకేసి వాళ్ల కాళ్ల మీద పడ్డారు. ‘పొరపాటైంది క్షమించమ’ని బతిమాలాడారు. అగ్ర హీరోలు ఆగ్రహించకపోవడంతో ఆ తర్వాత కొద్ది సేపటికి భూకైలాస్ షూటింగ్ మొదలైంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని