ప్రేక్షకులు చాలా స్మార్ట్.. ‘పుష్ప’ పాత్రను అలా ఏమీ చూడరు: అల్లు అర్జున్‌

‘పుష్ప’లో తన పాత్ర గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు అల్లు అర్జున్‌.

Updated : 14 May 2024 16:25 IST

హైదరాబాద్‌: ‘పుష్ప’ ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో సాగుతుందని, తన పాత్ర స్మగ్లర్‌ అని దర్శకుడు సుకుమార్‌ చెప్పగానే కంగారు పడలేదని, అగ్ర కథానాయకుడు అల్లు అర్జున్‌ (Allu Arjun) అన్నారు. ఆ పాత్ర ప్రభావం ప్రేక్షకులపై ఉండదన్నారు. ఆయన కీలక పాత్రలో నటిస్తున్న యాక్షన్‌ థ్రిల్లర్‌  ‘పుష్ప2: ది రూల్‌’. గతంలో వచ్చిన ‘పుష్ప: ది రైజ్‌కు కొనసాగింపుగా ఈ మూవీ తెరకెక్కుతోంది. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ మూవీని ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్రబృందం ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో బన్ని ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.

‘‘ఒకప్పటితో పోలిస్తే, ఎర్రచందనం స్మగ్లింగ్‌ బాగా తగ్గింది. నా పాత్ర ప్రభావం ప్రేక్షకులపై ఉంటుందని నేను అనుకోవడం లేదు. పైగా ఈ కథా నేపథ్యంలో జరిగే సమయం వేరు. సినిమా, టైటిల్‌ చూడగానే ఇదొక కల్పిత కథ అని అందరికీ అర్థమవుతుంది. నా పాత్రను స్ఫూర్తిగా తీసుకుంటారని నేను అనుకోవడం లేదు. ప్రేక్షకులు చాలా తెలివైనవాళ్లు. సినిమాను సినిమాలాగే చూస్తారు’’ అని అన్నారు. తాను గతంలో పోషించిన స్టైలిష్‌ పాత్రలతో పోలిస్తే, ఇది బాగా మాసీగా ఉంటుందని తెలిపారు. ఇలాంటి పాత్రలు తెలుగు చిత్ర పరిశ్రమలో అరుదుగా వస్తాయన్నారు.

‘‘ఒక నటుడిగా ఎప్పటికప్పుడు ప్రయోగాలు చేయాలనుకుంటాను. నన్ను తెరపై స్టైల్‌, ఛార్మింగ్‌గా చూడాలని ప్రేక్షకులు అనుకుంటారు. గతంలో అలాంటి పాత్రలు చేశా. ‘పుష్ప’లాంటి పాత్రను ఎప్పుడూ పోషించలేదు. ఈ తరహా నేపథ్యంతో కూడిన కథలు తెలుగులో పెద్దగా రాలేదు. వచ్చినా ఈ స్థాయిలో కథ ప్రపంచాన్ని చూపించలేదు. బహుశా ఇలాంటి కథతో వస్తున్న మొదటి నటుడిని నేనేనేమో. కమర్షియల్‌ చిత్రాల్లో గ్లామర్‌ ఉంటుంది. ఆ పరిధి దాటి నేను కొత్తగా పని చేయాలనుకుంటున్నా. అందులో భాగమే ‘పుష్పరాజ్’’’ అని అల్లు అర్జున్‌ చెప్పుకొచ్చారు.

రష్మిక కథానాయికగా నటిస్తున్న ఈ మూవీలో ఫహద్‌ ఫాజిల్‌, జగదీష్‌, సునీల్‌, అనసూయ, ధనుంజయ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇటీవల విడుదలైన ఫస్ట్‌ సింగిల్‌ ‘పుష్ప.. పుష్ప’ సామాజిక మాధ్యమాల వేదికగా హోరెత్తిపోతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా బన్ని సరికొత్త స్టెప్‌ ఇప్పుడు ట్రెండ్‌ అవుతోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని