Anand Mahindra: కలలు కనడం మానొద్దు: నాగ్‌ అశ్విన్‌పై ఆనంద్‌ మహీంద్రా ప్రశంసలు

టాలీవుడ్‌ డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌ను ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రా కొనియాడారు.

Published : 24 May 2024 00:15 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మహీంద్రా గ్రూప్‌ ఛైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా (Anand Mahindra).. టాలీవుడ్‌ దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ (Nag Ashwin)పై ప్రశంసలు కురిపించారు. ఆయన్ను చూస్తుంటే గర్వంగా ఉందన్నారు. ఈ మేరకు ‘ఎక్స్‌’ (ఇంతకుముందు ట్విటర్‌) వేదికగా పోస్ట్‌ పెట్టారు. గతంలో తన సాయం కోరుతూ నాగ్‌ అశ్విన్‌ పెట్టిన ట్వీట్‌ స్క్రీన్‌ షాట్‌ను షేర్‌ చేస్తూ.. ‘‘వాస్తవానికి సరదా సంగతులు ‘ఎక్స్‌’లోనే కనిపిస్తాయి. నాగ్‌ అశ్విన్‌, అతడి టీమ్‌ గొప్పగా ఆలోచించడానికి భయపడరు. వారిని చూస్తుంటే గర్వంగా ఉంది. అధునాతన వాహనాలు తయారు చేయడంలో ‘కల్కి’ చిత్ర బృందానికి చెన్నైలోని ‘మహీంద్రా రీసెర్చ్‌ వ్యాలీ’ టీమ్‌ సహాయపడింది. ‘బుజ్జి’ వాహనం రెండు మహీంద్రా ఇ- మోటర్లతో నడుస్తుంది. జయం ఆటోమోటివ్స్‌ కూడా ఈ వెహికల్‌ రూపొందించడంలో భాగమైంది’’ అని తెలిపారు. మహీంద్రా ట్వీట్‌పై దర్శకుడు స్పందిస్తూ.. అసాధ్యం అనుకున్న కలను సుసాధ్యం చేశారంటూ థాంక్స్‌ చెప్పారు. ‘కలలు కనడం మానొద్దు..’ అంటూ మహీంద్రా రిప్లై ఇచ్చారు.

ఆ ఇద్దరితో కలిసి నటించడం గర్వంగా ఉంది: ప్రభాస్‌

ప్రభాస్‌ (Prabhas) హీరోగా నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కించిన చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD). సైన్స్‌ ఫిక్షన్‌ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో విభిన్నమైన వాహనాలు కీలకం. వాటిని రూపొందించేందుకు అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీని వినియోగించాల్సి వచ్చింది. దీంతో, సినిమా ప్రారంభ సమయంలో డైరెక్టర్‌.. ఆనంద్‌ మహీంద్రాను ‘ఎక్స్‌’ వేదికగా సాయం చేయాలని కోరారు. దానిపై ఆయన సానుకూలంగా స్పందించారు. అలా అధునాతన సాంకేతికతో ‘బుజ్జి’ అనే వాహనాన్ని తయారు చేశారు. దాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసేందుకు హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌ సిటీలో చిత్ర బృందం బుధవారం గ్రాండ్‌ ఈవెంట్‌ నిర్వహించిన సంగతి తెలిసిందే. అనంతరం, సోషల్‌ మీడియా వేదికగానూ బుజ్జి పరిచయ వీడియోను విడుదల చేశారు. ఆ క్లిప్పింగ్‌ను పోస్ట్‌ చేస్తూ ఆనంద్‌ మహీంద్రా కొనియాడారు.

ఇతిహాసాలతో ముడిపడిన ఈ సినిమాలో అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌, దీపికా పదుకొణె, దిశా పటానీ కీలక పాత్రలు పోషించారు. జూన్‌ 27న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని