Ashika Ranganath: ఆషికా రంగనాథ్‌కు ‘మెగా’ ఛాన్స్‌.. చిరు సినిమాలో ఆఫర్‌

ఆషికా రంగనాథ్‌ బంపర్‌ ఆఫర్‌ను సొంతం చేసుకున్నారు. మెగాస్టార్‌ చిరు మూవీలో అవకాశం అందుకున్నారు. 

Updated : 24 May 2024 14:18 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: యంగ్‌ హీరోయిన్‌ ఆషికా రంగనాథ్‌ (Ashika Ranganath) బంపర్‌ ఆఫర్‌ అందుకున్నారు. చిరంజీవి హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘విశ్వంభర’ (Vishwambhara)లో అవకాశాన్ని సొంతం చేసుకున్నారు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ నిర్మాణ సంస్థ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. అద్భుతమైన సినిమాటిక్ అనుభూతిని సొంతం చేసుకోవడం కోసం అభిమానులు సిద్ధంగా ఉండాలని పేర్కొంది. ‘అమిగోస్‌’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ఆషిక.. ఆ తర్వాత నాగార్జున సరసన ‘నా సామిరంగ’లో మెరిశారు. తెలుగులో మూడో సినిమానే మెగాస్టార్‌తో చేయనుండటంతో ఆమె ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సోషియో ఫాంటసీ ఫిల్మ్‌గా ‘విశ్వంభర’ రూపొందుతోంది. రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో దీన్ని నిర్మిస్తున్నారు. ఇంతకు ముందెన్నడూ చూడని సరికొత్త పాత్రలో చిరంజీవి (Chiranjeevi) కనిపించనున్నారు. గతంలో ఆయన నటించిన సినిమాలతో పోలిస్తే.. అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో దీనిని తెరకెక్కిస్తున్నారు. భారీ స్థాయిలో ఉండనున్న యాక్షన్ సీక్వెన్స్‌లు సినిమాకే హైలైట్‌ కానున్నాయి. ఇక ఈ చిత్రంలో ఐదుగురు హీరోయిన్స్ ఉండనున్నట్లు ఎప్పటి నుంచో టాక్‌ వినిపిస్తోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌లో స్టార్‌ హీరోయిన్‌ త్రిష, ఇప్పుడు ఆషికా అధికారికంగా జాయిన్‌ అయ్యారు. సురభి, ఇషా చావ్లా, మీనాక్షి చౌదరి పేర్లను త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది.

ఆషికా రంగనాథ్‌.. ఆసక్తికర విషయాలు తెలుసా?

గతంలో ‘విశ్వంభర’ గురించి వశిష్ఠ మాట్లాడుతూ.. ఇది పూర్తిస్థాయి ఫాంటసీ జానర్‌ చిత్రమన్నారు. ఇందులో 70శాతం స్పెషల్‌ ఎఫెక్ట్‌లు ఉంటాయని చెప్పారు. సృష్టిలో అత్యంత ముఖ్యమైన పంచభూతాలు, త్రిశూల శక్తి.. వీటికి ఆధ్యాత్మికతను జోడిస్తూ ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టించామన్నారు. మామూలుగానే మెగా సినిమా అంటే ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా నెలకొంటాయి. దర్శకుడి మాటలతో అవి రెట్టింపయ్యాయి. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని