Chiranjeevi: నా హృదయం ఉప్పొంగుతోంది: పవన్‌ విజయంపై చిరంజీవి ఆనందం

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, తెదేపా అధినేత చంద్రబాబుకు ప్రముఖ హీరో చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు.

Updated : 04 Jun 2024 18:02 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తన సోదరుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన విజయంపై ప్రముఖ నటుడు చిరంజీవి (Chiranjeevi) స్పందించారు. సోషల్‌ మీడియా వేదికగా ఆయన ఆనందం వ్యక్తంచేశారు. మరోవైపు, తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu)కు చిరు శుభాకాంక్షలు తెలిపారు.

‘‘డియర్ కల్యాణ్‌ బాబు.. ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ తగ్గాలో తెలిసిన నిన్ను తగ్గావని ఎవరు అనుకున్నా.. అది ప్రజలని నెగ్గించటానికే అని నిరూపించావ్‌. నిన్ను చూస్తుంటే ఓ అన్నగా గర్వంగా వుంది. నువ్వు ‘గేమ్‌ ఛేంజర్‌’ మాత్రమే కాదు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ కూడా అని అందరూ నిన్ను కొనియాడుతుంటే నా హృదయం ఉప్పొంగుతోంది. నీ కృషి, నీ త్యాగం, నీ ధ్యేయం, నీ సత్యం జనం కోసమే. ఈ అద్భుతమైన ప్రజా తీర్పు.. రాష్ట్ర భవిష్యత్తు కోసం, ప్రజల సంక్షేమం కోసం, నీ కలల్ని, నువ్వు ఏర్పరుచుకున్న లక్ష్యాల్ని నిజం చేసే దిశలో నిన్ను నడిపిస్తుందని ఆకాంక్షిస్తూ, ఆశీర్వదిస్తూ, శుభాభినందనలు. నువ్వు ప్రారంభించే ఈ కొత్త అధ్యాయంలో నీకు శుభం కలగాలని, విజయం సాధించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా’’ అని పేర్కొన్నారు.

పొలిటికల్‌ ‘పవర్‌’స్టార్‌.. ఇదీ జనసేనాని పోరాట ప్రయాణం

‘‘ప్రియమైన చంద్రబాబునాయుడు గారికి.. చరిత్రలో అరుదైన విజయాన్ని అందుకున్న మీకు శుభాకాంక్షలు. ఈ మహత్తర విజయం.. మీపై ప్రజలకు ఉన్న నమ్మకానికి, మీ నాయకత్వ పటిమకు, రాష్ట్రానికి గత వైభవం తిరిగి తేగలిగిన మీ దక్షతకు నిదర్శనం. రాజకీయ దురంధరులైన మీపై, పవన్ కల్యాణ్, నరేంద్ర మోదీ గారిపై ప్రజలు కనపరచిన విశ్వాసాన్ని సంపూర్ణంగా నిలబెట్టుకొని, రాజధాని లేని, గాయపడిన రాష్ట్రాన్ని తిరిగి గాడినపెట్టి నంబర్ వన్‌గా తీర్చిదిద్దుతారని ఆశిస్తున్నా’’ అని చిరంజీవి ట్వీట్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని