Cannes Film Festival: 30 ఏళ్ల తర్వాత కేన్స్‌లో భారతీయ చిత్రం.. రెడ్‌ కార్పెట్‌పై మనోళ్ల డ్యాన్స్‌

Cannes Film Festival: కేన్స్‌ ఉత్సవంలో భారతీయ చిత్రం ‘ఆల్‌ వి ఇమేజిన్‌ యాజ్‌ లైట్‌’ పోటీలో నిలిచింది. దీంతో ఈ చిత్ర బృందం రెడ్‌కార్పెట్‌పై మెరిసి సందడి చేసింది. దర్శకురాలు సహా నటీనటులు ఎర్రతివాచీపై డ్యాన్స్‌ చేస్తూ ఫొటోలకు పోజులిచ్చారు.

Updated : 24 May 2024 16:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రతిష్ఠాత్మక కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ (Cannes Film Festival) అట్టహాసంగా సాగుతోంది. ఈ వేడుకల్లో దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఓ భారతీయ చిత్రం కాంపిటీషన్‌లో ఉంది. కేన్స్‌ ఉత్సవంలో ప్రధాన విభాగమైన ‘పామ్‌ డి ఓర్‌ (Palme d'Or)’ అవార్డుల కేటగిరీలో.. మలయాళీ చిత్రం ‘ఆల్‌ వి ఇమేజిన్‌ యాజ్‌ లైట్‌’ (All We Imagine as Light) పోటీలో నిలిచింది. మే 23న ఈ సినిమాను ప్రదర్శించారు. ఈ సందర్భంగా చిత్ర బృందం రెడ్‌ కార్పెట్‌పై మెరిసింది.

దర్శకురాలు పాయల్‌ కపాడియాతో పాటు నటీనటులు ఎర్రతివాచీపై సందడి చేశారు. వారు డ్యాన్స్‌లు చేస్తూ ఫొటోలకు పోజులివ్వడం అక్కడున్నవారందరినీ ఆకట్టుకుంది. మధ్యతరగతి యువతుల జీవితాలు, వారి భావోద్వేగాలతో ముడిపడిన ఈ సినిమాకు కేన్స్‌లో విశేష ఆదరణ లభించింది. దాదాపు రెండు గంటల నిడివి ఉన్న ఈ చిత్ర ప్రదర్శన పూర్తయిన తర్వాత టీమ్‌కు స్టాండింగ్‌ ఒవేషన్‌ దక్కింది. అందరూ లేచి నిలబడి చప్పట్లతో అభినందించారు.

పాయల్‌ కపాడియా (Payal Kapadia) దర్శకత్వం వచ్చిన తొలి ఫీచర్‌ సినిమా (Indian Feature Film) ఇదే కావడం విశేషం. అంతకుముందు ఆమె తెరకెక్కించిన డాక్యుమెంటరీ ‘ఎ నైట్‌ ఆఫ్‌ నోయింగ్‌ నథింగ్‌’.. 2021 కేన్స్‌ ఉత్తమ డ్యాకుమెంటరీగా అవార్డు అందుకుంది.  ఈ వేడుకల్లో భారత్‌ నుంచి ఓ ఫీచర్‌ ఫిల్మ్‌ పోటీలో నిలవడం 30 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడే. గతంలో 1994లో ‘స్వహం’ సినిమా ‘పామ్‌ డి ఓర్‌’ కేటగిరీలో పోటీ పడింది. తాజాగా ‘ఆల్‌ వి ఇమేజిన్‌ యాజ్‌ లైట్‌’తో పాటు యోర్గోస్ లాంతిమోస్, మెగాలోపోలిస్, ఓహ్ కెనడా, బర్డ్, అనోరా తదితర చిత్రాలు బరిలో నిలిచాయి. వీటిల్లో విజేతను మే 25న ప్రకటించనున్నారు.

కేన్స్‌లో ఇండియన్‌ షార్ట్‌ ఫిల్మ్‌కు మొదటి బహుమతి.. పేరేంటంటే

సినిమా కథ ఇదే..

ముంబయి నర్సింగ్‌ హోమ్‌లో పనిచేసే కేరళకు చెందిన ఇద్దరు నర్సుల కథే ‘ఆల్‌ వి ఇమేజిన్‌ యాజ్‌ లైట్‌ (All We Imagine as Light)’. వీరు తమ తమ రిలేషన్‌షిప్స్‌లో ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇద్దరు కలిసి ఓ బీచ్‌ టౌన్‌కు రోడ్‌ ట్రిప్‌కు వెళ్తారు. అక్కడ వారికి కన్పించిన అడవిలో ఏం జరిగింది? దాని వల్ల వారి జీవితాలు ఎలా మారాయి?అన్నదే చిత్ర కథాంశం. ఈ సినిమాకు అంతర్జాతీయ పబ్లికేషన్స్‌లో మంచి రివ్యూలు వచ్చాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని