Gaami: గామి.. ఓ కొత్త ప్రయత్నం

నిజమైన సంఘటనలకి... కొన్ని కల్పితాల్ని జోడించి ‘గామి’ తెరకెక్కించానని చెప్పారు యువ దర్శకుడు విద్యాధర్‌ కాగిత. మెకానికల్‌ ఇంజినీరింగ్‌ చదువుకున్న ఈయన తొలి ప్రయత్నంలోనే ప్రేక్షకులపై తనదైన ముద్ర వేయాలనే సంకల్పంతో ఐదేళ్లపాటు శ్రమించి ‘గామి’ తెరకెక్కించారు.

Updated : 06 Mar 2024 09:32 IST

నిజమైన సంఘటనలకి... కొన్ని కల్పితాల్ని జోడించి ‘గామి’ తెరకెక్కించానని చెప్పారు యువ దర్శకుడు విద్యాధర్‌ కాగిత. మెకానికల్‌ ఇంజినీరింగ్‌ చదువుకున్న ఈయన తొలి ప్రయత్నంలోనే ప్రేక్షకులపై తనదైన ముద్ర వేయాలనే సంకల్పంతో ఐదేళ్లపాటు శ్రమించి ‘గామి’ తెరకెక్కించారు. విష్వక్‌సేన్‌ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. చాందినీ చౌదరి కథానాయిక. వి సెల్యులాయిడ్‌ సంస్థ సమర్పిస్తోంది. ఈ చిత్రం ఈ నెల 8న ప్రేక్షకుల ముందుకొస్తున్న సందర్భంగా దర్శకుడు మంగళవారం హైదరాబాద్‌లో విలేకర్లతో సంభాషించారు. ‘‘కొత్త ప్రయత్నం చేస్తున్నప్పుడు చాలా సమస్యలొస్తాయి. వాటిని దాటుతూ వెళ్లినప్పుడే అనుకున్నది సాధిస్తాం. కథ, దృశ్యం, సంగీతం...ఇలా అన్ని కోణాల్లోనూ ప్రేక్షకుడికి ఓ కొత్త అనుభూతిని పంచాలనే ప్రయత్నంలో భాగంగానే ‘గామి’ ప్రయాణం మొదలైంది. వాస్తవ సంఘటన నుంచి రాసుకున్న ఓ ఆలోచనకి తోడుగా, విఠలాచార్య సినిమాల్లో సాహసాలు, మంచు పర్వతాల్లో  ప్రయాణంపై నాకున్న ఆసక్తి... ఇలా అన్నీ కలవడంతో ‘గామి’ సినిమా స్క్రిప్ట్‌ సిద్ధమైంది. మాకున్న వనరులతోనే ఓ చిన్న ప్రయత్నంగా సినిమా చేయాలనుకున్నాం. మా ఆలోచన నచ్చి క్రౌడ్‌ ఫండింగ్‌లో నిధులు సమకూరడం, ఆ తర్వాత మేం విడుదల చేసిన ఓ ప్రచార చిత్రం చూసి యు.వి.క్రియేషన్స్‌లో భాగమైన వి.క్రియేషన్స్‌ సంస్థ ముందుకు రావడంతో ఈ సినిమా స్థాయి మరింత పెరిగింది. మేం అనుకున్న కథని తెరపైకి తీసుకు రావడం కోసం అడుగులు వేస్తూ వెళ్లాం. ఈ క్రమంలో ఇంత సమయం పట్టిందనే భావన మాకు ఎప్పుడూ కలగలేదు’’.

‘‘గమ్యం ఉన్నవాడే గామి. ఇందులో కథానాయకుడు ఓ అన్వేషి. అతని గమ్యం ఏమిటి? అదెలా చేరుకున్నాడనేది కీలకం. విష్వక్‌సేన్‌ తన తొలి సినిమా తర్వాతే ఈ కథలోని లోతుని అర్థం చేసుకుని చేయడానికి ముందుకొచ్చారు. అప్పట్లోనే తనకున్న అవగాహన, ధైర్యం స్ఫూర్తిదాయకం. తన పాత్రలో చాలా బాగా నటించాడు. తర్వాత ఏం జరుగుతుందనే ఆసక్తిని అడుగడుగునా పెంచుతూ ఈ చిత్రం సాగుతుంది. మిగతా పాత్రలన్నీ కూడా గుర్తుండిపోతాయి. మేం కొత్తగా ఏదో చేస్తున్నామని నమ్మింది వి.క్రియేషన్స్‌. అందుకే ఆర్థికంగా ఎంతో స్వేచ్ఛనిచ్చి, సమయం కూడా నిర్దేశించకుండా సహకారం అందించారు. అందుకే మేం అనుకున్న చిత్రాన్ని అనుకున్నట్టుగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం’’.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని