Geethanjali Malli Vachindi: ఓటీటీలోకి హారర్‌ కామెడీ థ్రిల్లర్‌.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే

‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. 

Published : 06 May 2024 14:51 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అంజలి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇప్పుడీ హారర్‌ కామెడీ థ్రిల్లర్‌ ఓటీటీ ప్రేక్షకులకు నవ్వులు పంచేందుకు సిద్ధమైంది. మే8 నుంచి ‘ఆహా’(Aha) వేదికగా ప్రసారం కానుంది. అంజలి 50వ సినిమాగా విడుదలైన దీనికి శివ తుర్లపాటి దర్శకత్వం వహించారు. ఇందులో శ్రీనివాస్‌రెడ్డి, సత్యం రాజేశ్‌, సత్య, షకలక శంకర్‌, సునీల్‌ కీలకపాత్రల్లో కనిపించారు. 

ఈ వారమూ చిన్న చిత్రాలదే హవా.. థియేటర్‌/ఓటీటీ చిత్రాలివే!

కథేంటంటే: ‘గీతాంజలి’ సినిమా తీసి తొలి ప్రయత్నంలోనే దర్శకుడిగా సత్తా చాటిన శ్రీను అలియాస్‌ శ్రీనివాస్‌ (శ్రీనివాస్‌ రెడ్డి) ఆ తర్వాత హ్యాట్రిక్‌ ఫ్లాప్‌లు ఇస్తాడు. ఫలితంగా చేతిలో అవకాశాలు లేక ఆర్థిక సమస్యల్లో చిక్కుకుంటాడు. ఈ క్రమంలోనే పొట్టకూటి కోసం వైజాగ్‌లో ఉంటున్న తన మిత్రుడు అయాన్‌ (సత్య)ను హీరో చేస్తానని చెప్పి మోసం చేస్తూ ఉంటాడు. ఒకరోజు హైదరాబాద్‌ వచ్చిన అయాన్‌.. తాను మోసపోయానని అర్థమై శ్రీను పరిస్థితి చూసి ఏమీ చేయలేకపోతాడు. అప్పుడే అయాన్, శ్రీనులతో పాటు తన సహ రచయితలు ఆరుద్ర (షకలక శంకర్‌), ఆత్రేయ (సత్యం రాజేష్‌) గ్యాంగ్‌ ఓ ఆలోచన చేస్తారు. ఇండస్ట్రీకి దూరంగా వెళ్లిపోవాలని నిర్ణయం తీసుకుంటారు. సరిగ్గా అప్పుడే ఊటీలో ఉండే విష్ణు రిసార్ట్స్‌ యజమాని విష్ణు (రాహుల్‌ మాధవ్‌) మేనేజర్‌ నుంచి శ్రీనుకు ఫోన్‌ వస్తుంది. తనతో ఓ హారర్‌ థ్రిల్లర్‌ సినిమా నిర్మిస్తానని చెప్పి.. ఓ కథను శ్రీను గ్యాంగ్‌ చేతిలో పెడతాడు. కాకపోతే ఆ కథను తాను కొన్న సంగీత్‌ మహల్‌లోనే చిత్రీకరించాలని షరతు పెడతాడు. ఆ కథ కోసం నాయికగా అంజలి (అంజలి)ని తీసుకోమని సూచిస్తాడు.  వాళ్లంతా విష్ణు మాట ప్రకారమే సినిమాని ఆ మహల్‌లోనే తీసేందుకు సిద్ధమై అక్కడ అడుగు పెడతారు. మరి ఆ మహల్‌లోకి అడుగు పెట్టిన అంజలి, శ్రీను గ్యాంగ్‌కు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? విష్ణు తన సినిమాని ఆ మహల్‌లోనే చిత్రీకరించాలని ఎందుకు పట్టుబట్టాడు? తన చిత్రాన్ని అంజలి, శ్రీనుల చేతుల్లోనే ఎందుకు పెట్టాడు? వీళ్ల కోసం గీతాంజలి ఆత్మ మళ్లీ ఎందుకు తిరిగొచ్చింది? అన్నది మిగతా కథ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని