
Ashoka Vanamlo Arjuna Kalyanam:మాటులోని మల్లెవా.. మల్లెమాటు ముల్లువా
‘‘మాట రాని మాయవా.. మాయజేయు మాటవా. మాటులోని మల్లెవా.. మల్లెమాటు ముల్లువా. వయ్యారివా.. కయ్యారివా.. సింగారివా.. సింగాణివా’’ అంటూ తన ప్రేయసిని ఉద్దేశిస్తూ పాట పాడుకుంటున్నాడు విష్వక్ సేన్. మరి ఆ ప్రేయసి ఎవరు? ఆమె ప్రేమ కోసం ఆయన చేసిన సాహసాలేంటి? తెలుసుకోవాలంటే ‘అశోకవనంలో అర్జున కల్యాణం’ చూడాల్సిందే. విష్వక్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని విద్యాసాగర్ చింతా తెరకెక్కిస్తున్నారు. బాపినీడు, సుధీర్ ఈదర నిర్మిస్తున్నారు. రుక్సర్ థిల్లాన్ కథానాయిక. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా.. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే బుధవారం ఈ చిత్రం నుంచి ‘‘ఓ ఆడపిల్ల నువ్వర్థం కావా’’ అనే పాట విడుదల చేశారు. జై క్రిష్ స్వరాలందించిన ఈ పాటకు అనంత శ్రీరామ్ సాహిత్యమందించగా.. రామ్ మిర్యాల ఆలపించారు. విష్వక్ ఈ చిత్రంలో అర్జున్ అనే పాత్రలో కనిపించనున్నారు. ఈ పాత్ర కోసం బరువు పెరిగి, తన లుక్ మార్చుకున్నారు. ఈ సినిమాకి ‘రాజావారు రాణిగారు’ ఫేం రవికిరణ్ కోలా కథ, మాటలు, స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. పవి కె.పవన్ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు.