మామా.. హంగామా

సుధీర్‌బాబు త్రిపాత్రాభినయంతో తెరకెక్కిన చిత్రం ‘మామా మశ్చీంద్ర’. మృణాళిని రవి, ఈషా రెబ్బా కథానాయికలు. హర్షవర్ధన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. సునీల్‌ నారంగ్‌, పూస్కుర్‌ రామ్మోహన్‌రావు నిర్మించారు.

Published : 07 Sep 2023 01:38 IST

సుధీర్‌బాబు త్రిపాత్రాభినయంతో తెరకెక్కిన చిత్రం ‘మామా మశ్చీంద్ర’. మృణాళిని రవి, ఈషా రెబ్బా కథానాయికలు. హర్షవర్ధన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. సునీల్‌ నారంగ్‌, పూస్కుర్‌ రామ్మోహన్‌రావు నిర్మించారు. ఈ సినిమాని అక్టోబరు 6న విడుదల చేయనున్నట్లు బుధవారం ప్రకటించాయి చిత్రవర్గాలు. స్థూలకాయుడుగా, డాన్‌గా, డీజేగా మూడు భిన్నమైన పాత్రల్ని పోషించారు సుధీర్‌బాబు.

సూపర్‌ హీరో పూర్తి

సుధీర్‌బాబు కథానాయకుడిగా...అభిలాష్‌ రెడ్డి కంకర దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మా నాన్న సూపర్‌ హీరో’. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయినట్టు సుధీర్‌బాబు సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు.


నిన్నటికంటే ఎక్కువ ప్రేమిస్తా!

దినేశ్‌ తేజ్‌, హెబ్బా పటేల్‌, పాయల్‌ రాధాకృష్ణ ప్రధాన పాత్రధారులుగా రూపొందుతున్న చిత్రం ‘అలా నిన్ను చేరి’. మారేష్‌ శివన్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కొమ్మాలపాటి సాయి సుధాకర్‌ నిర్మాత. విడుదలకి సిద్ధంగా ఉన్న ఈ సినిమాలోని ‘నిన్నటికంటే ఎక్కువగా నిను ప్రేమిస్తా..’ అంటూ సాగే  పాటని ప్రముఖ దర్శకుడు క్రిష్‌ జాగర్లమూడి విడుదల చేశారు. పాట చాలా బాగుందని, ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా చిత్రీకరించిన ఈ పాటకి తప్పకుండా మంచి స్పందన లభిస్తుందన్నారు క్రిష్‌. ‘‘గ్రామీణ నేపథ్యంలో సాగే పాట ఇది. చంద్రబోస్‌ సాహిత్యం, సుభాష్‌ ఆనంద్‌ బాణీలు, జావేద్‌ అలీ గానం  ఎంత బాగా కుదిరాయో, తెరపై నాయకానాయికల మధ్య కెమిస్ట్రీ కూడా అంత బాగుంటుంది. కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రమిది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామ’’ని సినీ వర్గాలు తెలిపాయి.


వారెవ్వా కుర్రాళ్లు

సాయిపవన్‌, ప్రియాంక జంటగా నటించిన  చిత్రం... ‘వారెవ్వా జతగాళ్ళు’. సత్య సలాది దర్శకత్వం వహించారు. బండారు నాగబాబు (రాజు), దొడ్డి వీర ప్రభాకర్‌, గరగ వీరబాబు నిర్మాతలు. ఈ నెల 22న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు సినీ వర్గాలు తెలిపాయి. దర్శకుడు మాట్లాడుతూ ‘‘తమిళనాడులో జరిగిన ఓ యథార్థ సంఘటన ఆధారంగా... వర్తమాన పరిస్థితులకి తగ్గట్టుగా కొన్ని మార్పులతో తయారు చేసిన కథ ఇది. ప్రాథమిక హక్కులు సైతం నిషేధానికి గురైన ఓ గ్రామంలో నలుగురు కుర్రాళ్లు చేసిన పోరాటం ఎలాంటిదో తెరపైనే చూడాలి. ప్రేమ, హాస్యం, భావోద్వేగాలు,  సస్పెన్స్‌, థ్రిల్లర్‌ తదితర అంశాల మేళవింపుగా రూపొందిన ఈ చిత్రం తప్పకుండా ప్రేక్షకుల్ని మెప్పిస్తుంద’’న్నారు. నిర్మాతలు మాట్లాడుతూ ‘‘హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రత్యేక ప్రదర్శనలో సినిమాని చూసిన పలువురు ప్రముఖులు సరికొత్త కథతో సినిమాని తెరకెక్కించారని మెచ్చుకున్నారు. తెలుగులోనే కాకుండా, మరో ఐదు భాషల్లో సినిమాని విడుదల చేస్తాం’’ అన్నారు. పోసాని కృష్ణమురళి, జబర్దస్త్‌ గుండు మురళి, భాస్కర్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: సంతోష్‌.ఎమ్‌.


1980 మహారాజు

రాజ్‌తరుణ్‌, సందీప్‌ మాధవ్‌ కథానాయకులుగా నటిస్తున్న చిత్రం ‘మాస్‌ మహారాజు’. ‘గదర్‌ 2’ ఫేమ్‌ సిమ్రత్‌ కౌర్‌, ‘బిచ్చగాడు’ ఫేమ్‌ సట్నా టిటస్‌, సంపద కథానాయికలుగా నటిస్తున్నారు. సీహెచ్‌ సుధీర్‌రాజు దర్శకత్వం వహిస్తున్నారు. స్వాతిరాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమా చివరి షెడ్యూల్‌ చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోందని సినీ వర్గాలు తెలిపాయి. ‘‘1980 నేపథ్యంలో సాగే చిత్రమిది. యాక్షన్‌తోపాటు కుటుంబ అంశాలూ కీలకం. రాజ్‌తరుణ్‌, సందీప్‌ మాధవ్‌ విభిన్నమైన లుక్స్‌లో కనిపిస్తారు. మణిశర్మ సంగీతం ప్రధాన బలం. త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటిస్తామ’’ని చిత్రవర్గాలు తెలిపాయి. రాజారవీంద్ర, రవిశంకర్‌, షఫి, శివరామరాజు వెంకట్‌, సత్యం రాజేశ్‌, ధనరాజ్‌, రచ్చ రవి, ఐశ్వర్య ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని