ప్రేమ పంచాయితీ

భరత్‌, విషికా లక్ష్మణ్‌ జంటగా నటించిన చిత్రం ‘ఏందిరా ఈ పంచాయితీ’. టి.గంగాధర్‌ తెరకెక్కించారు. ఎం.ప్రదీప్‌ కుమార్‌ నిర్మాత.

Published : 02 Oct 2023 01:17 IST

భరత్‌, విషికా లక్ష్మణ్‌ జంటగా నటించిన చిత్రం ‘ఏందిరా ఈ పంచాయితీ’. టి.గంగాధర్‌ తెరకెక్కించారు. ఎం.ప్రదీప్‌ కుమార్‌ నిర్మాత. ఈ సినిమా ఈనెల 6న థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో నటుడు శ్రీకాంత్‌ ఇటీవల ఈ చిత్ర ట్రైలర్‌ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘ట్రైలర్‌ బాగుంది. కొత్త వాళ్లైనా ఈ సినిమాని అద్భుతంగా తెరకెక్కించారు. ఇది పెద్ద హిట్టవ్వాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ‘‘ఇదొక భావోద్వేగభరిత ప్రేమ కథా చిత్రం. క్రైమ్‌, సస్పెన్స్‌ అంశాలతో నిండి ఉంటుంది’’ అని దర్శక నిర్మాతలు తెలిపారు. ఈ సినిమాకి సంగీతం: పెద్దపల్లి రోహిత్‌, ఛాయాగ్రహణం: సతీష్‌ మాసం.


‘జై విఠలాచార్య’ పుస్తకం విడుదల

‘జానపద బ్రహ్మ, ప్రఖ్యాత తెలుగు దర్శకుడు విఠలాచార్య జీవిత చరిత్రను అక్షరబద్ధం చేసిన పులగం చిన్నారాయణకు శుభాకాంక్షలు’ అన్నారు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌. సీనియర్‌ సినీ పాత్రికేయుడు పులగం చిన్నారాయణ రాసిన ‘జై విఠలాచార్య’ అనే పుస్తకాన్ని ఆదివారం ఆయన ఆవిష్కరించారు. మూవీ వాల్యూమ్‌ మీడియా ఆధ్వర్యంలో షేక్‌ జీలాన్‌ బాషా ఈ పుస్తకాన్ని ప్రచురించారు.


బంగ్లా విముక్తి పోరాట ముజిబ్‌

బంగ్లాదేశ్‌ జాతిపిత ముజిబుర్‌ రెహ్మాన్‌ జీవితం ఆధారంగా దిగ్దర్శకుడు శ్యాం బెనెగల్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ముజిబ్‌: ది మేకింగ్‌ ఆఫ్‌ ఏ నేషన్‌’. అరిఫిన్‌ షువో టైటిల్‌ పాత్ర పోషిస్తున్నారు. నుస్రత్‌ ఇమ్రోజ్‌ రేణుగా, నుస్రత్‌ ఫరియా షేక్‌ హసీనా నటిస్తున్నారు. ఆదివారం ఈ సినిమా ట్రైలర్‌ విడుదల చేశారు. విమానం నుంచి దిగిన ముజిబ్‌ పాత్రధారి నేలను ముద్దాడే సన్నివేశంతో ట్రైలర్‌ మొదలవుతుంది. మహ్మద్‌ అలీ జిన్నా పాత్రధారి ఉర్దూని రాజభాషగా ప్రకటించడంతో ఈస్ట్‌ పాకిస్థాన్‌ భగ్గుమంటుంది. ‘బెంగాలీ మన మాతృభాష మాత్రమే కాదు.. మన కన్నతల్లి కూడా..’ అంటూ ముజిబ్‌ ఉద్రేకపూరితంగా ఉపన్యాసం ఇవ్వడంతో తమ ఉనికి, భాషని కాపాడుకోవడానికి అక్కడి జనం పెద్దఎత్తున వీధుల్లోకి వస్తారు. ఆ ఆందోళనలు తీవ్ర రూపం దాల్చి యుద్ధానికి దారి తీస్తుంది. ఈ సమరంలో భారత్‌ ముజిబుర్‌ రెహ్మాన్‌ సారథ్యంలోని పక్షానికి అండగా నిలిచి, తన సేనల్ని ఆ భూభాగంలోకి పంపుతుంది. ఈ పోరులో పాకిస్థాన్‌ తోక ముడవడంతో.. స్వేచ్ఛావాయువులు పీల్చిన తూర్పు పాకిస్థాన్‌ 1971లో బంగ్లాదేశ్‌గా ఆవిర్భవిస్తుంది. మన దేశానికి చెందిన నేషనల్‌ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఎన్‌ఎఫ్‌డీసీ), బంగ్లాదేశ్‌ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (బీఎఫ్‌డీసీ) ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించాయి. అక్టోబరు 27 ఈ సినిమా విడుదలవుతోంది.


జెంటిల్‌మేన్‌ 2 నాయికగా ప్రాచీ

అర్జున్‌ హీరోగా నటించిన విజయవంతమైన చిత్రం ‘జెంటిల్‌మేన్‌’. ఇప్పుడీ సినిమాకి సీక్వెల్‌గా ‘జెంటిల్‌మేన్‌ 2’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కె.టి.కుంజుమోన్‌ నిర్మిస్తున్న ఈ పాన్‌ ఇండియా సినిమాని గోకుల్‌ కృష్ణ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రాచీ తెహ్లాన్‌ కథానాయికగా నటించనుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘ఇంత పెద్ద బ్లాక్‌బస్టర్‌ మూవీ ఫ్రాంచైజీలో భాగమవుతున్నందుకు ఆనందంగా ఉంది. దీనికోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటున్నా. త్వరలో చిత్రీకరణలో పాల్గొననున్నా’’ అంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని