నిర్మాత వ్యాఖ్యలపై కోలీవుడ్‌ డైరెక్టర్స్‌ ఆగ్రహం.. క్షమాపణలు చెప్పిన జ్ఞానవేల్‌ రాజా

కార్తి (Karthi) తొలి చిత్ర దర్శకుడు ఆమిర్‌ (Aamir)ను ఉద్దేశించి నిర్మాత జ్ఞానవేల్‌ రాజా (Gnanavel Raja) చేసిన వ్యాఖ్యలు కోలీవుడ్‌లో దుమారం రేపిన విషయం తెలిసిందే. ఆమిర్‌కు మద్దతు తెలుపుతూ తమిళ దర్శకులు వరుసగా ట్వీట్స్‌ చేశారు.

Published : 29 Nov 2023 13:52 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కార్తి (Kathi) హీరోగా నటించిన తొలి చిత్రం ‘పరుత్తివీరన్‌’ (Paruthiveeran). 2007లో విడుదలైన ఈ సినిమా విషయంలో చిత్ర దర్శకుడు ఆమిర్‌, నిర్మాత జ్ఞానవేల్‌ రాజా మధ్య వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. దీంతో ఆమిర్‌ను తప్పుబడుతూ జ్ఞానవేల్‌ ఇటీవల కొన్ని వ్యాఖ్యలు చేశారు. అవి కోలీవుడ్‌లో దుమారం రేపడంతో ఈ వ్యాఖ్యలపై అతడు తాజాగా క్షమాపణలు చెప్పారు.

‘‘పరుత్తివీరన్‌’ విషయంలో కొన్నేళ్ల నుంచి వివాదం నెలకొని ఉంది. ఇప్పటి వరకూ ఈ విషయంపై నేను ఎప్పుడూ మాట్లాడలేదు. చిత్ర దర్శకుడు ఆమిర్‌ను అన్నగా భావించా. మొదటి నుంచి ఆయనతో మా కుటుంబానికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అయితే, ఇటీవల ఆయన నాపై చేసిన ఆరోపణలు నన్నెంతో బాధించాయి. ఆయన మాటలకు బదులిచ్చే క్రమంలో నేను ఏదైనా తప్పుగా మాట్లాడి ఉంటే నన్ను క్షమించండి. నాతోపాటు ఎంతోమందికి జీవనోపాధిని కల్పించిన చిత్ర పరిశ్రమ అంటే నాకెంతో ఇష్టం’’ అని ఆయన ట్వీట్‌ చేశారు.

Vishal: సీబీఐ ఆఫీస్‌కు వెళ్తానని జీవితంలో అనుకోలేదు: హీరో విశాల్‌

అసలేం జరిగిందంటే: కార్తి హీరోగా నటించిన 25 చిత్రం ‘జపాన్‌’. జ్ఞానవేల్‌ రాజా దీనికి నిర్మాతగా వ్యవహరించారు. ఈ నెల ఆరంభంలో చెన్నై వేదికగా జరిగిన ఈ సినిమా ప్రీరిలీజ్‌ వేడుకకు కార్తితో ఇప్పటి వరకూ సినిమాలు చేసిన దర్శకులందరూ హాజరయ్యారు. అయితే, తొలి చిత్ర దర్శకుడు ఆమిర్‌ మాత్రం ఈ వేడుకలో కనిపించలేదు. దీనిపై ఆయన ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘‘జపాన్‌’ ఈవెంట్‌కు నాకు ఆహ్వానం అందలేదు. సూర్య-కార్తితో నాకు సత్సంబంధాలు లేవు. జ్ఞానవేల్‌ రాజా మా మధ్యలోకి రావడంతోనే ఈ పరిస్థితి వచ్చింది’ అని చెప్పారు. దీనిపై జ్ఞానవేల్‌ రాజా స్పందిస్తూ.. ‘‘అతడికి ఆహ్వానం పంపించాం. ‘పరుత్తివీరన్‌’ విషయంలో నన్ను ఇబ్బందిపెట్టాడు. అనుకున్న దానికంటే ఎక్కువ డబ్బులు నాతో ఖర్చుపెట్టించాడు. సరైన లెక్కలు చూపించకుండా నా డబ్బులు దోచుకున్నాడు’’ అని ఆరోపణలు చేశాడు. ఈ వ్యాఖ్యలు కోలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారాయి. ఆమిర్‌కు మద్దతు తెలియజేస్తూ కోలీవుడ్‌ దర్శకులు భారతీ రాజా, సుధా కొంగర, సముద్రఖనితోపాటు పలువురు నటీనటులు సైతం సోషల్‌మీడియాలో పోస్టులు పెట్టారు. సినిమా పట్ల ఆయనకు ఉన్న నిబద్ధత, ఆయన వర్కింగ్‌ స్టైల్‌ను మెచ్చుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని