Sudheer Babu: ఆ విషయం చెబితే మహేశ్‌ కంగారు పడ్డాడు: సుధీర్‌ బాబు

సుధీర్‌ బాబు హీరోగా హర్షవర్ధన్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘మామా మశ్చీంద్ర’. ఈ సినిమా ట్రైలర్‌ విడుదల వేడుకలో మహేశ్‌ బాబు గురించి మాట్లాడారు సుధీర్‌.

Published : 27 Sep 2023 18:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తాను నటించిన ‘మామా మశ్చీంద్ర’ (Mama Mascheendra) సినిమా గురించి చెబితే అగ్ర హీరో, తన బావ మహేశ్‌ బాబు (Mahesh Babu) కంగారు పడ్డారని సుధీర్‌ బాబు (Sudheer Babu) చెప్పారు. ఆ సినిమా ట్రైలర్‌ విడుదల వేడుకలో ఆయన మాట్లాడారు. ‘‘తదుపరి ఏ సినిమా చేస్తున్నావని మహేశ్‌ అడిగితే మామా మశ్చీంద్ర గురించి చెప్పా. మూడు పాత్రలు పోషిస్తున్నానని, ఓ పాత్ర కోసం బాగా బరువు పెరగాలని, దానికోసం సమయం వెచ్చించి మరీ బాగా తినాలకుంటున్నానని వివరించా. దాంతో, ఆయన కంగారు పడ్డాడు. కానీ, తర్వాత కొన్ని సలహాలు ఇచ్చాడు. గతంలో అలాంటి పాత్ర పోషించిన వారి గురించి తెలియజేశాడు’’ అని పేర్కొన్నారు. దివంగత నటుడు కృష్ణ, తన మామయ్య నటుడిగా జీవితాన్నిచ్చారంటూ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.

‘స్కంద’ టు ‘పెదకాపు 1’.. ఈ వారం సినిమాల నేపథ్యమేంటి?రన్‌టైమ్‌ ఎంతంటే?

చిత్ర బృందం గురించి ప్రత్యేకంగా మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమా విషయంలో ముందుగా నిర్మాతలు నారాయణదాస్‌ కె. నారంగ్‌, పుస్కూర్‌ రామ్మోహన్‌రావుకు థ్యాంక్స్‌ చెబుతున్నా. ఈ సినిమా వారికి లాభం తెచ్చిపెడుతుందనే నమ్మకం ఉంది. హర్షవర్ధన్‌కు నేను పెద్ద అభిమానిని. పరిమిత బడ్జెట్‌లో అద్భుతంగా సినిమా తెరకెక్కించగల దర్శకుల్లో ఆయన ఒకరు. ప్రతి క్రాఫ్ట్‌పై ఆయనకు పట్టుంది. సంగీత దర్శకుడవ్వాలనే కలతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. తర్వాత నటుడిగా, రచయితగా, దర్శకుడిగా మారారు. ఎప్పటి నుంచో ఆయనతో కలిసి పనిచేద్దామనుకుంటే ఇప్పటికి కుదిరింది. సినిమాట్రోగ్రాఫర్‌ పీజీ విందా, ఎడిటర్‌ మార్తాండ్‌ కె. వెంకటేశ్‌తో ఇది నాకు నాలుగో చిత్రం. సంగీత దర్శకుడు చేతన భరద్వాజ్‌తో మరో రెండు సినిమాలు చేస్తున్నా’’ అని వారి ప్రతిభను కొనియాడారు. ఈ సినిమాలో పరశురామ్‌, దుర్గ, డీజే అనే మూడు విభిన్న పాత్రల్లో నటించారు సుధీర్‌. దుర్గ పాత్రలో ఆయన లావుగా కనిపిస్తారు. ఈ సినిమా అక్టోబరు 6న విడుదల కానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని