Telugu Movies: ‘స్కంద’ టు ‘పెదకాపు 1’.. ఈ వారం సినిమాల నేపథ్యమేంటి?రన్‌టైమ్‌ ఎంతంటే?

ఈ వారం విడుదల కానున్న సినిమాలేంటి? వాటి నేపథ్యమేంటి? రన్‌టైమ్‌ ఎంతో ఈ కథనం చదివి తెలుసుకోండి..

Updated : 27 Sep 2023 17:48 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సెలవును దృష్టిలో పెట్టుకుని పలు దర్శక, నిర్మాతలు తమ చిత్రాలను గురువారమే విడుదల చేయనున్నారు. మరికొన్ని శుక్రవారం రిలీజ్‌ కానున్నాయి. మరి, చూసేందుకు మీరు ప్లాన్‌ చేసుకున్నారా? అసలు, ఏయే మూవీస్‌ (List of Movies Releasing This Week) వస్తున్నాయి? వాటి నేపథ్యమేంటో చూసేయండి..

‘స్కంద’ మాస్‌ సినిమా మాత్రమే కాదు

 • రామ్‌ పోతినేని (Ram Pothineni) హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను (Boyapati Srinu) తెరకెక్కించిన యాక్షన్‌ డ్రామా మూవీ ‘స్కంద’ (Skanda). శ్రీలీల (Sreeleela) కథానాయిక. శ్రీకాంత్‌, సయీ మంజ్రేకర్‌ (Saiee Manjrekar), ప్రిన్స్‌ దగ్గుబాటి రాజా, ఇంద్రజ కీలక పాత్రలు పోషించారు. ఊర్వశీ రౌతేలా ఓ పాటలో తన అందంతో కనువిందు చేయనుంది. రామ్‌ ఇందులో రెండు కోణాలున్న పాత్రలో కనిపిస్తారు. తండ్రిని చంపిన వారిపై ప్రతీకారం తీర్చుకునే కొడుకు చుట్టూ ఈ కథ తిరుగుతుందని టాక్‌.
 • బోయపాటి అనగానే పవర్‌ఫుల్‌ డైలాగ్స్‌, అదిరిపోయే ఫైట్స్ గుర్తొస్తాయి. ట్రైలర్‌ చూస్తే ఈ సినిమాలో కూడా ఆ అంశాలు మెండుగా ఉన్నట్లు అర్థమవుతోంది. అయితే, ఇది మాస్‌ చిత్రం మాత్రమే కాదు ఫ్యామిలీ ఎమోషన్స్‌ కూడా ఉన్నాయని రామ్‌ అంటున్నారు. సోషల్‌ మెసేజ్‌ కూడా ఉందట.
 • ఎనర్జిటిక్‌గా డ్యాన్స్‌ చేస్తారని ఇటు రామ్‌కి, అటు శ్రీలీలకు మంచి పేరుంది. అలాంటి వారిద్దరు కలిసి డ్యాన్స్‌ చేస్తే విజిల్‌ వేయాల్సిందే. అందుకు ఈ సినిమాలో ‘నీ చుట్టు చుట్టు’, ‘గండరబాయ్‌’ పాటలున్నాయి. సెన్సార్‌ బోర్డు నుంచి U/A సర్టిఫికెట్‌ పొందిన ఈ సినిమా నిడివి 167 నిమిషాలని సమాచారం. సినిమా గురువారం విడుదల కానుంది. 

చంద్రముఖి మళ్లీ వస్తోంది..

 • హారర్‌ కామెడీ నేపథ్యంలో 2005లో తెరకెక్కి ప్రేక్షకులకు మంచి అనుభూతి పంచిన చిత్రం ‘చంద్రముఖి’. ఇన్నేళ్ల తర్వాత దానికి సీక్వెల్‌గా ‘చంద్రముఖి 2’ (Chandramukhi 2) రూపొందింది. పార్ట్‌ 1లో రజనీకాంత్‌ హీరోకాగా పార్ట్‌ 2లో రాఘవ లారెన్స్‌ (Raghava Lawrence) కథానాయకుడు.
 • 17 ఏళ్ల క్రితం కోట నుంచి వెళ్లిపోయిన చంద్రముఖి మళ్లీ ఎందుకొచ్చిందనే ఆసక్తికర అంశంతో ఈ సినిమాని తీర్చిదిద్దారు. తొలి భాగంలో జ్యోతికను చంద్రముఖి ఆవహిస్తుందనే సంగతి తెలిసిందే. కొత్త సినిమాలో చంద్రముఖి పాత్రను ఎలివేట్‌ చేశారు. కంగనా రనౌత్‌ (Kangana Ranaut) ఆ క్యారెక్టర్‌లో కనిపిస్తారు. ఈసారి కూడా వడివేలు తన కామెడీ టైమింగ్‌తో సందడి చేయనున్నారు.
 • పి. వాసు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మహిమా నంబియార్‌, రాధికా శరత్‌కుమార్‌, రావు రమేశ్‌ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. U/A సర్టిఫికెట్‌ పొందిన ఈ సినిమా రన్‌టైమ్‌ 157 నిమిషాలు. గురువారం రిలీజ్‌ కానుంది.

ఈసారి వార్‌..

 • ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’తో అందరి దృష్టిని ఆకర్షించిన దర్శకుడు వివేక్‌ రంజన్‌ అగ్రిహోత్రి (Vivek Agnihotri). వాస్తవ సంఘటలను ఆధారంగా చేసుకుని సినిమాలను తెరకెక్కించడంలో ముందుంటారాయన. ఈ క్రమంలోనే.. కరోనా నాటి పరిస్థితులు, మహమ్మారిని ఎదుర్కోవడానికి భారత శాస్త్రవేత్తలు వ్యాక్సిన్‌ను ఎలా అభివృద్ధి చేశారనే కథతో ‘ది వ్యాక్సిన్‌ వార్‌’ (The Vaccine War) సినిమా తెరకెక్కించారు.
 • ఈ సినిమాలో సీనియర్‌ నటులు నానా పటేకర్‌, అనుపమ్‌ ఖేర్‌ ప్రధాన పాత్రధారులు. ‘కాంతార’ ఫేమ్‌ సప్తమి గౌడ, పల్లవి జోషి, రైమా సేన్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
 • ‘‘నా చిత్రం చూసి ఒక్క అమ్మాయైనా స్ఫూర్తి పొంది వైరాలజిస్ట్‌గా మారితే అది ‘ది వ్యాక్సిన్‌ వార్‌’కు దక్కిన విజయంగా భావిస్తా’’ అని దర్శకుడు పేర్కొన్నారు. ‘భారతదేశపు మొట్టమొదటి బయోసైన్స్‌ చిత్రం’గా విడుదలకానున్న ‘ది వ్యాక్సిన్‌ వార్‌’ రన్‌టైమ్‌ 161 నిమిషాలు. గురువారం రిలీజ్‌ కానుంది.

సామాజిక వర్గంకాదు సామాన్యుడి సంతకం!

 • క్లాస్‌ దర్శకుడిగా పేరొందిన శ్రీకాంత్‌ అడ్డాల (Srikanth Addala) తెరకెక్కించిన పొలిటికల్‌ యాక్షన్‌ ఫిల్మ్‌ ‘పెదకాపు 1’ (Peda Kapu 1). టైటిల్‌ని బట్టి చాలామంది ఈ సినిమా ఓ సామాజిక వర్గం నేపథ్యంలో రూపొందిందని అనుకుంటున్నారు. కానీ, ఇది క్యాస్ట్‌కు సంబంధించి కాదు ఓ సామాన్యుడి సంతకం అని దర్శకుడు స్పష్టం చేశారు.

 • నిర్మాత మిర్యాల రవీందర్‌ రెడ్డి కుటుంబ సభ్యుడు విరాట్‌ కర్ణ ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాడు. ప్రగతి శ్రీవాస్తవ కథానాయిక. ఈ సినిమాతో శ్రీకాంత్‌ అడ్డాల తన పంథా మార్చడం ఓ విశేషమైతే.. ఇందులో నెగెటివ్‌ ఛాయలున్న పాత్రలో ఆయన నటించడం మరో విశేషం.

 • ఎన్టీఆర్‌ రాజకీయ ప్రవేశం చేసిన 1980ల నాటి నేపథ్యంలో జరిగే కథ ఇది. ఒక కొత్త పార్టీ వస్తుందంటే యువతలో ఓ చైతన్యం వస్తుంది. ఆ పార్టీతో తమ తలరాతలు మారతాయనే ఆశ ఉంటుంది. మరి అలా వచ్చిన పార్టీ వారికి ఎలాంటి చేయూతనిచ్చిందనేది సినిమాలో ఒక అంశంగా ఉంటుంది. ఈ సినిమాతో 294 మంది కొత్త వాళ్లు తెరకు పరిచయమవుతున్నారు. సెన్సార్‌ బోర్డు A సర్టిఫికెట్‌ జారీ చేసిన ఈ సినిమా రన్‌ టైమ్‌ 2 గంటల 2 నిమిషాలని సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని